ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన అత్యున్నత క్రీడా పోటీల్లో ఒలింపిక్స్ ఒకటి. మన దేశం అధికారికంగా 1900 సంవత్సరం ఒలింపిక్స్‌లో ప్రవేశించింది. నాటి నుంచి 25 ఒలింపిక్స్‌లో పాల్గొంటే 41 పతకాలు సాధించగా, ఇందులో 16 పతకాలు హర్యానా క్రీడాకారులు పొందటం మరో విశేషం. ఈ ఏడాది పారిస్‌లో జరిగిన 33వ ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో మనం 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచాం. ఇప్పటి వరకు 30సార్లు ఒలింపిక్స్ జరిగితే మొదటి స్థానంలో అమెరికా 19 సార్లు నిలవగా, సోవియట్ యూనియన్ 7 సార్లు నిలిచింది. ఈసారి కూడా అమెరికా, చైనా పోటాపోటీగా తలపడి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. క్రీడల పట్ల మన పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. క్రీడాభివృద్ధికి నిధులేవీ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో క్రీడలకు నిధులు కేటాయించడంలో గానీ లేదా ఖర్చు చేయడంలో గానీ చాలా అలసత్వం, ప్రాధాన్యత లేని అంశంగా చూడటమే క్రీడాకారులకు నేడు శాపంగా మారింది.

గత పదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే 2014-15లో రూ.1769 కోట్లు కేటాయించగా ఇది వరుసగా రూ.1943, రూ.2197, రూ.2596, రూ.2776, రూ.2826 కోట్లు కేటాయించారు. 2024-25లో రూ.3442 కోట్లు. గతేడాది కన్నా రూ.45 కోట్లు పెంచారు. దీన్నిబట్టి చూస్తే బడ్జెట్‌లో జీడీపీ పెరుగుదల ద్వారా పెరగడం తప్ప పాలకులు క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదని అర్థం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తీసుకొచ్చిన ఖేలో ఇండియా పథకం దక్షిణాది రాష్ట్రాల పట్ల తీరని వివక్షత చూపుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయం చూపిస్తుంది. ఖేలో ఇండియా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.2168 కోట్లు ఖర్చు చేస్తే ఇందులో గుజరాత్‌కు రూ.426 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.438 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.148 కోట్లు, రాజస్థాన్‌కు రూ.107 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.94 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.21 కోట్లు, తెలంగాణకు రూ.18 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
ఏపీలో క్రీడా విధానం ఏదీ?
‘పతకం కొట్టు జాబ్ పట్టు’ అంటూ హర్యానా, పంజాబ్, కేరళ, తమిళనాడు, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఉన్నంతలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం క్రీడల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. జీవో నెంబర్ 74 ప్రకారం ప్రతి ఉద్యోగంలో 4 శాతం కోటాను నిజాయితీగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం క్రీడలకు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా టూరిజం, యువజన సర్వీసుల శాఖ పేరుతో కలిపి నిధులు కేటాయించడం జరుగుతుంది. బడ్జెట్లో నిధులు చూపించినా ఖర్చు చేయడం లేదు. ఒకవేళ ఖర్చు చేస్తే అవి క్రీడలకు ఖర్చు చేయడం లేదు. 2006లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తెచ్చి దేశానికి క్రీడా పోటీల్లో ఆదర్శంగా నిలిచింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ప్రతి గ్రామంలో మినీ స్టేడియాలను నిర్మిస్తే మన రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రాలకే దిక్కు లేదు. అక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో స్పోర్ట్స్ స్కూల్ నిర్మిస్తే మన పాలకులు మాత్రం విజయనగరం జిల్లాలో ఉండే స్పోర్ట్స్ స్కూల్‌ను మూసివేసి క్రీడల పట్ల తమ ‘నిజాయితీ’ని నిరూపించుకున్నారు!
ఏపీలో గతంలో ‘హ్యాపీ సండే’ పేరుతో అయినా ఏదో ఒక కార్యక్రమం జరిగేది. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. 175 నియోజక వర్గాల్లో తక్షణమే మినీ స్టేడియాలను, క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) శాప్ పరిధిలో 15 మంది పర్మినెంటు కోచ్‌లు కూడా లేరంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ కింద ఉన్న 97 మంది కోచ్‌లకు సరైన వేతనాలు లేక, సమయానికి ఇవ్వక, అధికారుల ఒత్తిడి కారణంగా, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి గురించి ఆలోచించకుండా క్రీడలు ఎలా అభివృద్ధి అవుతాయి? కాంట్రాక్ట్ కోచ్‌లను పర్మినెంటు చేయడానికి శాప్‌కు వచ్చిన ఇబ్బందులు ఏమిటి? కొత్తగా మరో 500 మంది కోచ్‌లను నియమించకుండా రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి సాధ్యమా? గత మూడేళ్లుగా జాతీయ క్రీడల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు పెండిరగ్‌లో ఉన్నాయి. బంగారు పతకానికి రూ.5 లక్షలు, వెండి పతకానికి రూ.3 లక్షలు, కాంస్యానికి లక్ష రూపాయలు ఇవ్వాలని శాప్ నిబంధనలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదు. ఇచ్చినా సగం మాత్రమే ఎందుకు ఇస్తున్నారు. మిగతా సగం ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. పథకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహానికే నిధులు లేకపోతే క్రీడా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది?
రాష్ట్రంలో అత్యున్నత క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు క్రీడాకారులకు శిక్షణా, క్రీడా సామగ్రి సమకూర్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడం శాప్ ఉద్దేశం. కానీ నేడు దానికి భిన్నంగా నేడు శాప్ వ్యాపారం చేస్తుంది. క్రీడా మైదానాలను, స్టేడియాలను, ఇండోర్ స్టేడియాలను, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ సెంటర్లను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో క్రీడాకారులు గ్రౌండ్‌లో అడుగు పెట్టాలంటే డబ్బు చెల్లించి రావాల్సిన పరిస్థితి. శాప్ అధికారులు ఇప్పటికైనా వ్యాపారం మాని క్రీడాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేయకపోతే క్రీడలు బతకవు. యువతను క్రీడల వైపు నడిపిస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎక్కువ భాగం యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు పోతూ నిర్వీర్యం అవుతుంటే మనకి బాధ్యత లేదా. తప్పకుండా యువత క్రీడల వైపు పయనించాలి. మాయమైపోతున్న క్రీడలను భుజం భుజం కలిపి రక్షించుకోవాలి. మన దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలు తప్పనిసరిగా ఉండాలనేది చేయలేకపోతున్నం.
మన రాష్ట్రంలోనే వేల సంఖ్యలో పీఈటీ, పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు 10వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు లేడని గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులకు క్రీడలు ఎలా నేర్పుతారు? ఎవరు నేర్పుతారు? ఇంక కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలైతే సరేసరి. ఉదయం నుంచి రాత్రి వరకు బట్టి చదువులు తప్ప ఇంకేమీ ఉండదు. ప్రభుత్వం అన్ని సబ్జెక్టుల మాదిరిగా వ్యాయామ విద్య కూడా ఒక సబ్జెక్టుగా చేసి మార్కులు ఇస్తే గానీ క్రీడలు బాగుపడవు. అలాగే తల్లిదండ్రులకు గేమ్స్ వల్ల ఉపయోగాలు, అవకాశాలపై అవగాహన కల్పించాలి. క్రీడలు కేవలం గెలుపు కోసం కాదు. ప్రైజ్ మనీ కోసం కాదు. ఉద్యోగంలో కోటా కోసమూ కాదు. క్రీడలు స్నేహ సంబంధాలు నెలకొల్పి తద్వారా ఐక్యతను పెంచుతాయి. మానసిక ఉల్లాసం ఇస్తాయి. చదువుల పట్ల ఒత్తిడి తగ్గిస్తాయి. దేహ దారుఢ్యం పెంచుతాయి. శారీరక వ్యాయామం అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. నేడు యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తిప్పికొట్టడానికి క్రీడలు ఒక ఆయుధంగా పని చేస్తాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి.
ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫికెట్‌కు మంచి విలువ ఉంది. ఇప్పుడు ఇది కూడా పక్కదారి పడుతున్నది. అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణం ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం. వీరు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. కానీ దీనికి ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వడం లేదు. రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు విద్యార్థులే పెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో వారు అక్కడే అగిపోతున్నారు. కొంతమంది వ్యాయామ ఉపాధ్యాయులు తమ ఖర్చుతో తీసుకుపోతున్నారు. ఇది ఎంతకాలం సాధ్యం అవుతుంది. జిల్లా పరిషత్ హైస్కూల్లో కనీసం స్పోర్ట్స్ మెటీరియల్ కూడా లేని పరిస్థితిలో ఉంటే క్రీడలు ఎలా అభివృద్ధి అవుతాయో పాలకులే చెప్పాలి. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి బస్సు, ట్రైన్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను పెంచాలి. ప్రతి విద్యాసంస్థలో వ్యాయామ విద్య తప్పనిసరి సబ్జెక్టు చేసి మార్కులు ఇవ్వాలి. క్రీడాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక అమలుచేయాలి. అన్యాక్రాంతమైన క్రీడా మైదానాలను కాపాడాలి. క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు, యువజన సంఘాల అభిప్రాయాలతో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించాలి.
జి.రామన్న, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి, 91775 90726
Comments