కారుణ్య కోటాకు కన్నం!
- BAGADI NARAYANARAO
- May 28
- 3 min read
ఆరుగురి నియామకాల ఫైలులో చేతివాటం
ఒకరి పేరు బదులు మరొకరి పేరు చేర్చి నాటకం
ఆ విషయం బయటపడటంతో ఫైలునే తొక్కిపెట్టిన వైనం
పైగా మంత్రి అచ్చెన్న ఆపమన్నారంటూ డీబీసీడబ్ల్యూవో సాకులు
విచారణకు కలెక్టర్ ఆదేశాలు

సర్వీసులో ఉండగా మృతి చెందే ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి అర్హతల ఆధారంగా కారుణ్య నియామకాల కోటాలో ఉద్యోగం ఇస్తుంటారు. కానీ జిల్లాలో ఆరుగురి కారుణ్య నియామకాల ఫైలు దాదాపు ఐదు నెలలు గడిచినా వెలుగు చూడటంలేదు. గత డిసెంబర్ 27న ఈ నియామకాలపై జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. అదే రోజు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా సంతకం చేసేశారు. కానీ ఇప్పటికీ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందకపోవడంతో వారంతా కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ జాప్యానికి కారణం.. జిల్లా బీసీ సంక్షేమాధికారి నిర్వాకమే. కారుణ్య కోటాలో ఆరుగురిని నియమించాల్సి ఉండగా.. అందులో అర్హులైన ఒకరిని తొలగించి ఆ స్థానంలో అనర్హుడిని చేర్చడంతో అవకాశం కోల్పోతున్న అసలు అభ్యర్థి కుటుంబీకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బీసీ సంక్షేమశాఖలో ఆరుగురి కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులపై ఐదు నెలల క్రితమే కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సంతకాలు చేసేశారు. అయినా ఇప్పటికీ అభ్యర్థులకు పోస్టింగులు లభించలేదు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సంతకం చేసిన వెంటనే అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సిన జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి వాటిని తొక్కిపెట్టేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నియామక ఉత్తర్వుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పలాస, ఆమదాలవలస ఎమ్మెల్యేలు గౌతు శిరీష, కూన రవికుమార్‌లను బాధితులు వేర్వేరుగా కలిసి నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై ఫిర్యాదు చేశారు. దాంతో వారిద్దరూ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సదరు నియామకాల ఫైల్ తీసుకుని తన వద్దకు రావాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధను రెండుసార్లు ఆదేశించారు. అయినా ఆమె కలెక్టర్‌ను కాకుండా కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణను కలిసి వచ్చేసినట్టు తెలిసింది. డీబీసీడబ్ల్యూవో అనురాధపై వచ్చే ఫిర్యాదులను తొక్కిపెట్టేస్తూ ఏవో సూర్యనారాయణ ఆమెకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. కలెక్టర్ పీఏ కూడా ఆమెకు అండగా ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు గ్రీవెన్స్‌లో నేరుగా కలెక్టర్‌ను కలిసి కారుణ్య నియామక ఉత్తర్వుల జారీలో అనురాధ చేస్తున్న జాప్యంపై ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశిస్తూ.. ఆ బాధ్యతను కలెక్టరేట్ ఏవోకు అప్పగించారు.
జిల్లా మంత్రి చెప్పారని సాకులు
గ్రీవెన్స్ ఫిర్యాదులపై తక్షణం స్పందించాల్సిన అనురాధ మూడు రోజులు కావస్తున్నా నియామక ఉత్తర్వులు జారీ చేయకపోగా కొత్త నాటకానికి తెర తీశారు. కారుణ్య నియామకాలను నిలిపివేయమని జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారంటూ కొత్త వాదన తీసుకువచ్చారు. నియామకాల ఫైలుపై గత డిసెంబర్ 27న కలెక్టర్ సంతకం చేశారు. ఆ వెంటనే డీబీసీడబ్ల్యూవో అనురాధ, ఆ కార్యాలయ సూపరింటెండెంట్ పార్వతిలను కారులో విజయనగరం జిల్లా గజపతినగరంలోని ఇన్‌ఛార్జి మంత్రి క్యాంపు కార్యాలయానికి పంపించి సంతకం చేయించారు. కలెక్టర్, ఇన్‌ఛార్జి మంత్రి సంతకం చేసిన ఐదు నెలల తర్వాత మరో మంత్రి అచ్చెన్నాయుడు నియామకాలను ఆపాలని ఆదేశించినట్టు కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణకు అనురాధ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి కారుణ్య నియామకాలను ఎవరూ అడ్డుకోరు. ఉద్యోగి మృతిచెందిన ఆరునెలల్లోనే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య కోటా ఉద్యోగం ఇవ్వాలి. కాని బీసీ సంక్షేమ శాఖలో పని చేస్తూ మృతిచెందిన ఆరుగురు ఉద్యోగుల కుటుంబాలకు మాత్రం నాలుగేళ్లు కావస్తున్నా న్యాయం జరగలేదు. దీనిపై 2022 నవంబర్ 11న గ్రీవెన్స్‌కు ఒక ఫిర్యాదు అందినా అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కూన రవికుమార్, గౌతు శిరీష తమ నియోజకవర్గ పరిధిలోని బాధితుల గురించి ఎనిమిది నెలల క్రితమే కలెక్టర్‌కు విన్నవించినా ఆ ఫైలుకు మోక్షం కలగలేదు.
అర్హుడి స్థానంలో అనర్హుడు
నిబంధనల ప్రకారం కలెక్టరేట్ కారుణ్య నియామకాలను కలెక్టరేట్ ఏవో ద్వారా చేపట్టాలి. ఉద్యోగార్ధుల అర్హతలు, ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల ఆధారంగా పోస్టింగులు ఇవ్వాలి. అయితే ప్రస్తుత ప్రక్రియ ఆ విధంగా జరగలేదని, అర్హులమైన తమను తప్పించి మరో అనర్హుడిని కారుణ్య కోటా జాబితాలో చేర్చారంటూ డీబీసీడబ్ల్యూవో అనురాధపై సదరు బాధిత కుటుంబం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఇదే మొత్తం ఫైలును ఆమె తొక్కిపెట్టేయడానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. బీసీ సంక్షేమ వసతి గృహంలో పని చేస్తున్న బుంజు పాపారావు (రాజపురం) 2023 ఆగస్టు 10న, పైల రమేష్ (ప్రియాగ్రహారం) 2021 ఆగస్టు 8న, శ్రీకాకుళం (4) కాలేజి గర్ల్స్ హాస్టల్‌లో పని చేస్తున్న బురిడి సరిత 2023 జూలై 2న, శ్రీకాకుళం (3) కాలేజి గర్ల్స్ హాస్టల్‌లో పని చేస్తున్న దుప్పలపూడి కనకరత్నం 2024 జనవరి 14న మృతి చెందారు. వీరితో పాటు సిద్ధ ప్రమీల, సువ్వారి లోకనాధం అనే ఉద్యోగులు కూడా 2014లో మృతి చెందారు. వీరి వారసులకు కారుణ్య కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. బీసీ సంక్షేమశాఖ అధికారులు అందులో బుంజు పాపారావు వారసుడి పేరును జాబితా నుంచి తొలగించి వేరే అనర్హుడి పేరు చేర్చేశారు. ఈ విషయాన్ని పాపారావు కుటుంబ సభ్యులు అన్ని ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన కోట రామారావును 2016 నవంబర్‌లో అప్పటి బీసీ సంక్షేమాధికారి టెర్మినేట్ చేశారు. ఆ తర్వాత రామారావు మృతి చెందాడు. కానీ ఇప్పుడు అదే రామారావును ఉద్యోగిగా ఉండగా మరణించినట్లు చూపించి అతని భార్య పేరును కారుణ్య నియామకాల జాబితాలో చేర్చి కలెక్టర్, మంత్రితో సంతకాలు చేయించేశారు. దీనిపై బాధితులు కలెక్టర్‌కు ఫి˜ిర్యాదు చేయడం, అన్ని అర్హతలు ఉన్న బుంజు పాపారావు కుటుంబానికి జరిగిన అన్యాయంపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలెక్టర్‌కు లేఖ రాయడంతో వ్యవహారం వెలుగు చూసింది.
డీబీసీడబ్ల్యూపై విచారణకు ఆదేశాలు
జాబితాను తారుమారు చేసి ఒక అనర్హుడిని చేర్చడంపై డీబీసీడబ్ల్యూవో అనురాధను కలెక్టర్ వివరణ కోరగా తనకు తెలియకుండా ఫైల్ పెట్టారంటూ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం చేశారని తెలిసింది. దాంతో ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేసి విచారణకు ఆదేశించారు. అనురాధపై వస్తున్న ఆరోపణలుపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఆ మేరకు విచారణాధికారిని నియమించి, బాధితులతో పాటు డీబీసీడబ్ల్యూవో అనురాధకు నోటీసులు పంపి వాంగ్మూలాలు తీసుకునేందుకు కలెక్టకేట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments