కోట్లు విలువ చేసే స్థలాలు తీసుకొని అభివృద్ధి మరిచారు
పాలకొండ రోడ్డులో చెట్లేస్తే నగరమంతా సుందరమైపోతుందా?
పెరుగుతున్న ట్రాఫిక్‌కు పరిష్కారమేంటి?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఎప్పుడో 24 ఏళ్ల క్రితం ఓ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. దాని ప్రకారం అప్పుడున్న జనాభాకు, వాహనాలకు అనుగుణంగా రోడ్లు ఏయే రోడ్లు ఎంత వెడల్పులో ఉండాలో నిర్ధారించారు. సీన్ కట్‌చేస్తే.. ఆ మాస్టర్‌ప్లాన్‌కు సమయం ముగిసిపోవడంతో కొత్తగా వచ్చిన జనాభాకు, వాహనాలకు ఏమేరకు రోడ్లుండాలి? ప్రత్యామ్నాయం ఎలా ఉండాలి? అని నిర్దేశిస్తూ కొత్తగా తయారుచేసిన మాస్టర్‌ప్లాన్‌పై ఏకాభిప్రాయం కుదరక ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో నాలుగుసార్లు దీని మీద సమావేశం పెట్టారు. ఎంతసేపూ జీటీ రోడ్డు, పాలకొండ రోడ్డు, కళింగరోడ్డు, కలెక్టర్ బంగ్లా రోడ్డు కోసం మాట్లాడుతారే తప్ప సందుగొందులుగా మిగిలిపోయిన అసలు సిసలు సిక్కోలు కోసం ఏ పాలకులూ ఆలోచించడంలేదు. ఇప్పుడు రథసప్తమి వస్తుందని ఉన్న రోడ్లపై మొక్కలు నాటో, కరెంటు స్తంభాలు వేసో డెకరేషన్ వైపు మొగ్గు చూపుతున్న పాలకులు వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారి మెప్పును పొందవచ్చేమో గానీ సగటు సిక్కోలువాసికి మాత్రం దీనివల్ల ప్రయోజనం చేకూరదు. కేవలం నాలుగడుగుల వెడల్పు, ఆరడుగుల లోతు లోపు ఉన్న స్థలంలో బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలంటే 30 అడుగులు రోడ్డుకు విడిచిపెట్టాలనే నిబంధన పెట్టి అన్యాయంగా వీధుల్లో ఉన్నవారి నుంచి రోడ్డు కోసం 30 అడుగులు రిజిస్ట్రేషన్ చేయించుకొని లక్షలు విలువైన సైట్లు తీసుకున్న నగర కార్పొరేషన్ ఇప్పుడు ఆ వీధుల్లో రోడ్లు ఎందుకు వెడల్పు చేయడంలేదన్నదే ప్రధాన ప్రశ్న. సీసీ రోడ్డు స్థానంలో బీటీ రోడ్డు, కొత్తగా వేసిన బీటీ రోడ్డు మూడు నెలలకే పాడైతే మరో రోడ్డు వేస్తున్నారు తప్ప గడిచిన 70 ఏళ్లలో శ్రీకాకుళం నగరంలో ఏ వీధిలో రోడ్డయినా వెడల్పు చేశారా? కానీ రూల్ ప్రకారం 30 అడుగుల స్థలం తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటి? అభివృద్ధి అంతా ఒక్క జీటీ రోడ్డులోనో, పాలకొండ రోడ్డులోనో ఉండటం వల్లే చిక్కంతా వచ్చింది. పాలకొండ రోడ్డులో డివైడర్ పెట్టి, మధ్యలో మొక్కలు నాటి సుందరీకరణ అని చెబుతున ్న పాలకులు, అధికారులు జీటీ రోడ్డులో కూడా డివైడర్ పెట్టి, మొక్కలు నాటి బహు సుందరీకరణ అని నామకరణం చేస్తే మరీ బాగుంటుంది. ఎందుకంటే పాలకొండ రోడ్డుకు వచ్చే ప్రయాణీకుల కంటే జీటీ రోడ్డులో జనాలెక్కువుంటారు. ఇది పూర్తిగా కార్పొరేట్ వ్యాపారులకు కేంద్రంగా ఉంది కాబట్టి వినియోగదారులు ఎక్కువ మంది వచ్చిపోతుంటారు. ఇక్కడ డివైడర్ పెట్టి అందమైన మొక్కలు, సెంటర్ లైటింగ్, మధ్యలో ఫౌంటెన్‌లు పెడితే అద్భుతంగా ఉంటుందనేవారు లేకపోలేదు. కానీ ఆ పని ఇక్కడి పాలకులు చేయరు. ఎందుకంటే.. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఆస్తులున్నాయి. ఒక్కడికి పార్కింగ్ ప్లేసుంటే ఒట్టు. ఒకటి రెండు కమర్షియల్ భవనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుచేసినా, అందులోనే వారి స్టోర్ రూమ్‌లు, సెక్యూరిటీ రూమ్‌లు పెట్టుకొని కస్టమర్ల వాహనాలు మాత్రం సెంటర్ పార్కింగ్‌లో పెట్టిస్తున్నారు. అంతెందుకు.. స్వయంగా జీటీ రోడ్డులోని షాపుల్లో పని చేస్తున్న చిరుద్యోగుల వాహనాలు కూడా సెంటర్ పార్కింగ్‌లోనే ఉంటాయి. ఇక సంక్రాంతి సీజన్‌లో జీటీ రోడ్డులో ఎక్కడ పార్క్ చేసుకున్నా పోలీసులు అడగరు. కాబట్టి అసలు తమకు పార్కింగ్ సమస్యే కాదు కాబట్టి అద్దులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. జీటీ రోడ్డులో ఒక సాధారణ సెల్ షాపునకు నెలవారీ అద్దె రూ.2 లక్షలంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం జీటీ రోడ్డు, పాలకొండ రోడ్డు వంటి వాటి మీదే ఏ ప్రభుత్వమైనా ఏకపక్షంగా దృష్టి సారించడం వల్ల నగరంలో కమర్షియల్ ప్రాంతాలు విస్తరిండంలేదు. విశాఖపట్నంలో ఒకప్పుడు జగదాంబ సెంటర్ మాత్రమే వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉండేది. ఆ తర్వాత ఆసిల్‌మెట్ట, ద్వారకానగర్‌లు విస్తరించాయి. దీనికి ఆనుకొని వీఐపీ రోడ్డు, రామాటాకీస్ రోడ్డు ఇలా ఒకటేమిటి, విశాఖ మొత్తం కమర్షియల్ జోన్ అయింది. దీనివల్ల అన్ని ప్రాంతాలూ సరిసమానంగా అభివృద్ధి చెందాయి. అంతెందుకు.. పాలకొల్లు వంటి మున్సిపాలిటీలో కూడా ప్రధాన రహదారిలో కంటే వీధుల్లోనే కమర్షియల్ కాంప్లెక్స్‌లు సక్సెస్ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, భీమవరంలలో వ్యాపారాలన్నీ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న వీధుల్లోనే జరుగుతున్నాయి. అంతెందుకు.. మన పక్కనే ఉన్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు లాంతర్లు, గంటస్థంభం, లేదా రైల్వేస్టేషన్ రోడ్డు మీదకే వ్యాపారాలుండేవి. ఇప్పుడు రింగ్‌రోడ్డును డెవలప్ చేసిన తర్వాత విజయనగరం మొత్తం వ్యాపారాలు విస్తరించాయి. ఐదేళ్ల క్రితం వరకు శ్రీకాకుళంలో పెట్టిన మదుపులో పావువంతు పెడితే విజయనగరంలో ఆస్తి వచ్చేది. ఇప్పుడు అదే విజయనగరంలో శ్రీకాకుళంలో సమానంగా భూమి ధరలు ఉన్నాయి. ఇప్పుడు పాలకొండ రోడ్డుకు పార్కింగ్ లేకపోవడం, అవకాశమున్నా పాలకులు ఆ వైపు దృష్టి సారించకపోవడం నగరంలో చర్చనీయాంశమైంది. పార్కింగ్ కోసం భవన యజమానులే సెల్లార్‌లు ఏర్పాటుచేసుకోవాలని కొంతమంది మేధావులు సలహాలిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడినవారే ఎక్కువ. సెల్లార్ కట్టుకోవాలంటే జీవో నెంబరు 119 ప్రకారం భవన నిర్మాణ ఏరియా 750 చదరపు మీటర్లు దాటాలి. అంటే చిన్న చిన్న కమర్షియల్ స్థలాల్లో సెల్లార్ కట్టుకుంటామన్నా కార్పొరేషన్ పద్మిషన్ ఇవ్వదన్నమాట. ఈ పిసరంత ఏరియాలో 30 శాతం పార్కింగ్ కోసంతో పాటు ఫ్రంట్, రియర్, సైడ్ సెడ్‌బ్యాక్స్ విడిచిపెడితే, ఇక మిగిలిన స్థలంలో కట్టుకోవాల్సింది ఒక్క గోడ మాత్రమే.
కళింగ రోడ్డుకు, జీటీ రోడ్డుకు మెయిన్ లింక్ అయిన టౌన్‌హాల్ రోడ్డు, చిన్నబరాటం వీధి రోడ్డు వెడల్పు చేయడం తప్ప నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు మరో మార్గం లేదు. కానీ ఇప్పటి వరకు ఏ పాలకులూ అటువైపు దృష్టి సారించలేదు. టౌన్‌హాల్ రోడ్డును వెడల్పు చేయాలని 2009`14 మధ్య ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు చిన్నబజారు రోడ్డును వెడల్పు చేయడంలో భాగంగా మిగిలిన నిధులతో టౌన్‌హాల్ రోడ్డు పని పట్టాలని భావించారు. అక్కడ క్రైస్తవ స్మశానవాటిక, చర్చి పెద్దలతో చర్చించే లోపు ఎన్నికలు రావడం, ధర్మాన ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంక్లిష్టత పరిష్కరించడానికి వెనుకడుగు వేసింది. మళ్లీ 2019`24 మధ్య ఈ అంశం తెర మీదకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. కారణం.. అప్పటి నిధులు ఖర్చయిపోవడం, కొత్తగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడమే. అయితే క్రైస్తవ పెద్దలను మాత్రం ఒప్పించగలిగారు. అదే సమయంలో టౌన్‌హాల్‌కు సంబంధించిన కొంత స్థలం పోతున్నా ఓకే చేయించారు కానీ పనులు జరగలేదు. ఇక చిన్నబరాటంవీధి రోడ్డును వెడల్పు చేయాలని ధర్మాన మదిలో ఆలోచన ఉన్నా మొదట్నుంచీ కళింగకోమట్లు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయడం వల్ల ఓటు కోల్పోతామన్న భయంలో ఆ జోలికి పోలేదు. వాస్తవానికి చిన్నబరాటం వీధిలో ఉన్న ఇళ్లన్నింటి లోతెక్కువ. వరండాలు పోయినా ఆస్తి విలువ పెరుగుతుందన్న భావన వీరిలో ఉంది. కాకపోతే ధర్మాన వెనుకే ఉన్న ఈ ప్రాంత నాయకుడు ఈ దిశగా నడిపించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అదే జీటీ రోడ్డు, పాలకొండ రోడ్డు, కళింగరోడ్డుకు రంగులద్దడం మినహా సిక్కోలు సందుల రూపు మాత్రం మార్చడంలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా కార్పొరేషన్ ఎన్నికలు జరిపేలోపు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మళ్లీ కార్పొరేటరంటూ ఒక నాయకుడు పుట్టుకొస్తే స్వార్థ ప్రయోజనాలు మొదలవుతాయని, అలా కాకుండా తమ రోడ్డు వెడల్పు చేయాలని ఏ ప్రాంతవాసులైనా ముందుకొస్తే ఆ రోడ్లను మెరుగుపర్చాలని కోరుతున్నారు. శ్రీకాకుళం నగరంలో 10 అడుగుల వెడల్పు రోడ్డు మాత్రమే ఉన్న వీధులు 80 శాతం పైన ఉన్నాయని ఇప్పటి పాలకులకు తెలుసా? పాలకొండ రోడ్డులో డివైడర్ వేయడం, అందులో మొక్కలు నాటడం తప్పుకాదు. కానీ ఇప్పుడు ఫుట్‌పాత్‌ల పక్కనే వాహనాలు పార్క్ చేస్తే అడ్డుకునేదెవరు? సెంటర్ పార్కింగ్ పెడితే నాలుగు అడుగుల మేర రోడ్డు వెడల్పు తగ్గిపోతుందని బాధపడుతున్నవారు ఇప్పుడు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్, మధ్యలో డివైజర్, ఫుట్‌పాత్‌లు కలిపితే ఎంత వెడల్పు రోడ్డు మిగులుతుందో చెప్పగలరా? లేదూ రోడ్డును వెడల్పు చేస్తామని హామీ ఇవ్వగలరా? అదే ఇస్తే డే అండ్ నైట్ జంక్షన్ నుంచి ఆమదాలవలస వరకు రోడ్డు విస్తరణకు నిధులు వచ్చినా బలగ ప్రాంతవాసుల నుంచి ఎందుకు ఇంకా క్లియరెన్స్ తెచ్చుకోలేకపోతున్నారు.
Comments