top of page

కార్పొరేషన్‌తో కాపురం.. పంచాయతీతో పిల్లలు

Writer: NVS PRASADNVS PRASAD
  • ఎన్నికలు లేక కునారిల్లుతున్న అభివృద్ధి

  • చట్టం తెస్తేగానీ ఎలక్షన్స్‌ జరగవ్‌

  • కుశాలపురంను తప్పించాలని ఎమ్మెల్యేకి వినతి

  • 2021లో ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చిన ప్రభుత్వం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘‘అధ్యక్షా.. నా నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగి 14 ఏళ్లు అయింది. పాలకవర్గం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. దయచేసి ఎన్నికలు నిర్వహించేటట్టు చూడండి..’’

.. ఇది స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన అంశం.

‘‘ఎమ్మెల్యే గారూ.. నమస్కారం. శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో మా ప్రమేయం లేకుండా కలిపేసిన కుశాలపురం పంచాయతీని దయచేసి తప్పించండి. దీని వల్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు మంజూరు కావడంలేదు. కుశాలపురంలో 1100 జాబ్‌కార్డులు, తోటపాలెంలో 950 జాబ్‌కార్డులు ఉన్న వేతనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగని మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులు మంజూరుచేసి అభివృద్ధి చేస్తుందా? అంటే అదీ లేదు. మున్సిపల్‌ మినిస్టర్‌తో మాట్లాడతారో, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రితో మాట్లాడుతారో మాకు తెలీదు గానీ దయచేసి కార్పొరేషన్‌ పరిధి నుంచి మా పంచాయతీని తప్పించేటట్టు చూడండి..’’

.. ఇదీ కుశాలపురం గ్రామ పెద్దలు ఆదివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును కలిసి వినతిపత్రం ఇవ్వడంతో పాటు అక్కడికక్కడే మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణతో మాట్లాడిరచిన సందర్భం.

పై రెండూ రెండు సందర్భాలైనప్పటికీ ఒకే సమస్యకు ముడిపడి ఉన్న రెండు కొనలు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం వైకాపా అభ్యర్థి పెద్ద తేడాతో ఓడిపోడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడం ఒకటి. సరిగ్గా దీనినే ప్రచారాస్త్రంగా మలచుకొని టీడీపీ అభ్యర్థి తాము అధికారంలోకి వస్తే కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా కార్పొరేషన్‌ ఎన్నికలపైన ఇతిమిద్దంగా ఒక ప్రకటన ఈరోజుకూ వెలువడలేదు. మేయర్‌ రేసులో ఉన్నామని ప్రకటించుకుంటున్న అభ్యర్థులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో గతంలో నిర్వహించిన రోస్టర్‌ విధానం, రిజర్వేషన్‌ పద్ధతి, వార్డుల విభజన వంటి అంశాల మీద చర్చించి, సమావేశాలు పెట్టించి ఆశలు రేకెత్తిస్తున్నారే తప్ప ప్రభుత్వ స్థాయిలో ఎన్నికల కోసం తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం జిల్లా నుంచి ఎవరూ ముందడుగు వేయడంలేదు. అందుకే కుశాలపురం గ్రామస్తులు తమ పంచాయతీని కార్పొరేషన్‌ చెర నుంచి తప్పించాలని ఎమ్మెల్యేను కలిశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే ఎన్నికల కోసం విజయవాడ స్థాయిలో అందరికీ చెప్పేశానని, ఇక సిద్ధమైపోండంటూ పాత ఇన్‌ఛార్జిలనే కొనసాగిస్తూ అదిగో ఎన్నికలు, ఇదిగో ఎన్నికలని చెబుతున్నారు. వాస్తవానికి విలీన పంచాయతీలను వదిలేసి ఎన్నికలు జరిపించాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా చట్టాన్ని తీసుకురావాల్సి ఉంది. అలా కాకుండా ఏడు విలీన పంచాయతీలతో కలిపి కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపాలంటే ఒక్క క్షణంలో జరిపించొచ్చు. ఏ నిర్ణయమైనా ఇప్పుడు ప్రభుత్వం చేతిలోనే ఉంది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో కిల్లిపాలెం, చాపురం, ఖాజీపేట, పాత్రునివలస, పెద్దపాడు, తోటపాలెం, కుశాలపురం పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్‌ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు లేవు. ఎందుకంటే తమను కార్పొరేషన్‌లో చేరిస్తే పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుందని ఏడు పంచాయతీలు కలిపి హైకోర్టులో కేసు వేశారు. దీంతో ప్రభుత్వం విలీనం మీద తీసుకువచ్చిన జీవోపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు నడుస్తుండగానే ప్రభుత్వం 2021లో ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి అప్పటి గవర్నర్‌ ఆమోదముద్రను వేయించుకుంది. ఇది కూడా సరికాదంటూ మళ్లీ ఏడు పంచాయతీలు కోర్టును ఆశ్రయించాయి. ఆర్డినెన్స్‌ను ఆరు నెలల్లోగా అసెంబ్లీలో చట్టం చేయాల్సిన నిబంధన ఉంది కాబట్టి అదేదో తేలిన తర్వాత కోర్టు తలుపు తట్టండంటూ ఓ డైరెక్షన్‌ వచ్చింది. ఈలోగా కరోనా సమయంలో ఒక్క రోజు పాటు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపర్చి అనేక బిల్లులతో పాటు ఈ ఆర్డినెన్స్‌ను కూడా చట్టంగా చేసేసింది. దీంతో చట్టం మీద సవాల్‌ చేస్తూ మళ్లీ ఏడు పంచాయతీలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం 17924/2021 పేరుతో వేసిన రిట్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండిరగ్‌ ఉంది. సాధారణంగా చట్టం మీద తీర్పునివ్వడంపై ఢల్లీి నుంచి గల్లీదాకా అనేక వాజ్యాలు కోర్టుల్లో పెండిరగ్‌లో ఉన్నాయి. ఒకసారి చట్టం చేసిన తర్వాత అందులో కోర్టు వేలు పెట్టకూడదని, ప్రజాప్రతినిధులు దేన్నయినా సమీక్షించే అధికారం తమకుందని కోర్టులు చెబుతున్న గొడవ ఇప్పటికీ రాజ్యాంగబద్ధంగా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఈ విలీన పంచాయతీల చట్టాన్ని రద్దు చేస్తూ మళ్లీ అసెంబ్లీలో చట్టం చేస్తేగానీ కార్పొరేషన్‌ నుంచి ఈ ఏడు పంచాయతీలు బయటపడవు. అలా అని ఏడు పంచాయతీలతో ఎన్నికలకు వెళ్దామంటే ఇక్కడ తాజా, మాజీ సర్పంచ్‌లెవరూ అందుకు అంగీకరించడంలేదు. ఈ విలీన పంచాయతీల్లో పంచాయతీ పనులకు ఎంపీడీవో కార్యాలయానికి, అభివృద్ధి పనులకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడిరది. కార్పొరేషన్‌లో విలీనం చేసినా ఇక్కడ పెద్దగా అభివృద్ధి పనులు జరగడంలేదు. గతంలో పంచాయతీలో పని చేసిన శానిటేషన్‌ సిబ్బందినే మున్సిపల్‌ వర్కర్లుగా గుర్తించి చెత్తను ఊడ్పిస్తున్నారు తప్ప కాలువలు, రోడ్లు వేయడంలేదు. ఎందుకంటే.. మున్సిపాలిటీకి వచ్చిన జనరల్‌ ఫండ్‌ నిధులతో పాత 36 వార్డుల్లో రోడ్లు, కాలువలు వేయడానికే సొమ్ములు సరిపోవడంలేదు. చాపురం, ఖాజీపేట పంచాయతీల్లో అంతకు ముందే కొంతమేరకు అభివృద్ధి జరగడం వల్ల విలీనం మంచిదే అనిపిస్తుంది కానీ, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న రెండు పంచాయతీలు, శ్రీకాకుళం రూరల్‌లో ఉన్న పాత్రునివలస, కిల్లిపాలెం పంచాయతీల్లో ఏమాత్రం అభివృద్ధి కనిపించడంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపాలిటీలో కలిసే ప్రసక్తి లేదని ఈ ఏడు పంచాయతీల్లోని ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేలకు తెగేసి చెబుతున్నారు. దీనికి పెద్దపాడు మినహాయింపు కావచ్చు. కానీ ఎన్నికలంటూ జరిపితే ఏడిరటినీ కలిపైనా చేయాలి, లేదంటే ఏడిరటినీ విడగొట్టయినా జరపాలి. ఇందులో మొదటిది స్థానికులకు ఇష్టంలేదు. రెండోది చేయడానికి ఎమ్మెల్యేలకు స్థాయి సరిపోవడంలేదు. అటువంటప్పుడు ఎన్నికలు ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయనడం సబబు కాదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page