top of page

క్రూరమైన ద్వారపాలకులు

  • Guest Writer
  • Jun 24
  • 3 min read

భారతదేశంలోని లోపభూయిష్టమైన పోటీ, బోర్డు పరీక్షల విధానం యువతను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఇందులో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమికంగా, అభ్యర్థులు ఒకే పరీక్షను పలుమార్లు రాసేందుకు అనుమతించాలి.

పరీక్షా కేంద్రం ఇనుప గేట్లను పట్టుకుని, లోపలికి వెళ్లనివ్వకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఒక యువతి. ఆమె పక్కనే నియంత్రణ కోల్పోయి ఏడుస్తున్న మరో అమ్మాయి. ఇంకోవైపు, కొద్ది నిమిషాల ముందే మూసివేసిన గేటును తెరిపించి, తన కూతురిని లోపలికి పంపించమని సెక్యూరిటీ గార్డు కాళ్లపై పడి వేడుకుంటున్న ఒక నిస్సహాయ తల్లి. ఆదివారం జరిగిన ‘నీట’ పునర్విచారణ పరీక్షా కేంద్రాల వద్ద కనిపించిన ఈ దృశ్యాలు, కేవలం ఒక చిన్న పరిపాలనా లోపం కంటే ఎంతటి లోతైన విషాదం దాగి ఉందో తెలియజేస్తున్నాయి. ఇవి భారతదేశంలోని అత్యంత కఠినమైన పోటీ పరీక్షల నమూనాలో ఉన్న వ్యవస్థాగత లోపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఈ లోపం ఎంతగా పాతుకుపోయిందంటే, దీన్ని సరిచేయడానికి చేసే ప్రతి ప్రయత్నమూ విద్యార్థుల వేదనను మరింత పెంచుతోంది.

ఆయా కేంద్రాల్లో కనిపించిన ఈ ఆవేదనకు తక్షణ కారణం.. అత్యంత కఠినంగా అమలుచేసిన గేట్ల మూసివేత సమయం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పరీక్షకు 1:35 గంటలకు చేరుకున్నా కూడా తక్షణమే అనర్హులుగా ప్రకటించే పరిస్థితి ఉంది. స్థానిక ర్యాలీల వల్ల ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఊహించని రోడ్డు ప్రమాదం కావచ్చు, లేదా రైలు ఆలస్యం కావచ్చు.. కారణం ఏదైనా ఆ ఐదు నిమిషాల ఆలస్యానికి విద్యార్థులే బలవుతున్నారు. దీనివల్ల బాధిత విద్యార్థులు దాదాపు ఐదేళ్ల పాటు పడిన కఠోర శ్రమ నిమిషాల వ్యవధిలో బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఈ కఠినత్వమే విద్యార్థులను ప్రాకార గోడలు దూకడానికి, ‘ఈ ఒక్కసారికి వదిలేయండి’ అని వేడుకునేలా దీనస్థితికి నెట్టుతోంది.

వైద్య వృత్తి అనేది ఆర్థిక భద్రతకు ఒక నిశ్చితమైన మార్గంగా భావించే మన దేశంలో, కేవలం పదేళ్ల వయసున్న పిల్లలను సైతం కోట, సికార్ వంటి నగరాల్లోని ఒత్తిడితో కూడిన ‘కోచింగ్ ఫ్యాక్టరీల’ లోకి తోసేస్తున్నారు. ఈ మానసిక క్షోభ కేవలం విద్యార్థులకే పరిమితం కావడం లేదు.. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, భవిష్యత్ తరాలను సైతం భయాందోళనల్లోకి నెట్టేస్తోంది. 20 లక్షలకు పైగా విద్యార్థులను ఇటువంటి వ్యవస్థాగత ఆందోళనకు గురిచేయడమే కాకుండా, మే నెలలో జరిగిన అసలు పరీక్ష పేపర్ లీకేజీల వల్ల రద్దయి, దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష పెట్టాల్సి రావడం అనేది ఈ విద్యావ్యవస్థ ఎంతగా నిర్వీర్యమైపోయిందో సూచిస్తోంది.

వ్యవస్థాగత లోపాలు

అసలు లోపం ఈ పరీక్షా విధాన నిర్మాణంలోనే ఉంది. ఒకే రోజు, పెన్ను-పేపర్‌తో దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ‘లాటరీ’ పద్ధతిని ఇంకా పట్టుకుని వేలాడుతున్న కొన్ని దేశాల్లో మనదీ ఒకటి. ఏడాదికి ఒకే ఒక్కసారి, కేవలం మూడు గంటల సమయంలోనే విద్యార్థి భవిష్యత్తు ముడిపడి ఉండటం వల్లే, పేపర్ లీకేజీల బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా సాగుతోంది. దీనికి ప్రభుత్వాల స్పందన వ్యవస్థను ఆధునీకరించడం కాదు.. భద్రతను మరింత కఠినతరం చేయడం. బయోమెట్రిక్ స్కానర్లు, డిజిటల్ జామర్లు, నేరస్థులను తనిఖీ చేసినట్లు చేసే ప్రోటోకాల్స్ కాబోయే వైద్యులను అనుమానితులుగా చూస్తున్నాయి.

ఇలాంటి కఠినత్వమే మన బోర్డు పరీక్షల్లోనూ కనిపిస్తోంది. నిజానికి ఇప్పుడున్న బోర్డు పరీక్షలు (సీబీఎసఈ, 30కి పైగా రాష్ట్ర బోర్డులు) అత్యంత పురాతనమైనవి, ప్రయోజనం లేనివి. కొన్ని దశాబ్దాల క్రితం, ఈ ప్రీ-యూనివర్సిటీ పరీక్షల మార్కులే మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రాతిపదికగా ఉండేవి. కానీ, దరఖాస్తుదారుల సంఖ్య పెరిగి, మార్కుల ద్రవ్యోల్బణం (గ్రేడ్ ఇన్‌ఫ్లేషన్) ఎక్కువవడంతో రాష్ట్రాలు విడిగా పోటీ పరీక్షలను ప్రవేశపెట్టాయి. ఆ తర్వాత కూడా జాతీయ స్థాయి పరీక్షలు ప్రామాణికం అయ్యే వరకు 12వ తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు.

ఉద్దేశం మంచిదే అయినా, అమలు చేయడంలో విఫలమయ్యారు. బోర్డు పరీక్షల ప్రాధాన్యత దాదాపు శూన్యమైనప్పటికీ, పాత పద్ధతిలోనే వాటిని ఏడాదికి ఒకేసారి నిర్వహిస్తూ అదే భయాన్ని కొనసాగిస్తున్నారు. నీట్, జేఈఈ, లేదా సీయÖఈటీ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రావడంతో, విద్యార్థులపై ‘డూ ఆర్ డై’ (జీవన్మరణ) పరీక్షల భారం రెట్టింపయింది. బోర్డు పరీక్షలు సాధారణ విజ్ఞానాన్ని, ప్రవేశ పరీక్షలు వృత్తిపరమైన అర్హతను అంచనా వేయడానికే అయితే, ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం ఆశ్చర్యకరం. విదేశాల్లోని చాలా కళాశాలలు భారతీయ విద్యార్థులను చేర్చుకునేటప్పుడు వారి గత నాలుగేళ్ల సగటు మార్కులను చూస్తాయి, బోర్డు పరీక్ష అందులో ఒక భాగం మాత్రమే. అది సమగ్రమైన విద్యా విధానం. కానీ మన దేశంలో, చివరి నాలుగేళ్ల పాఠశాల విద్యను బోర్డులు, ప్రి-బోర్డులు, కోచింగ్ క్లాసులు, ప్రవేశ పరీక్షలనే నరకప్రాయమైన కనుమలోకి నెట్టేస్తున్నారు.

ఈ అసంబద్ధత వల్ల మరో విషాదం ఏమిటంటే.. అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా, బోర్డు పరీక్షల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఏదో ఒక నిబంధన (కట్-ఆఫ్ పర్సంటేజ్) రీత్యా అర్హత సాధించలేక తమ కలలను కోల్పోతున్నారు. రాజకీయ నాయకులు విద్యార్థుల ఒత్తిడిని తగ్గిస్తామని మాటలు చెబుతున్నారే తప్ప, ప్రస్తుత వ్యవస్థ దానికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తోంది.

పరిష్కార మార్గాలు

దీనికి పరిష్కారాలు స్పష్టంగా ఉన్నాయి, ఇతర దేశాలలో విజయవంతంగా అమలు అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వార్షిక ఒత్తిడిని తొలగించాలి. దీనికి బదులుగా, ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు రాసేలా ‘రోలింగ’ లేదా స్క్రీన్-ఆధారిత (కంప్యూటర్) పరీక్షా విధానంలోకి మారాలి. దీనికోసం రాత్రికి రాత్రే అమెరికా ‘శాట’ విధానాన్నో లేదా మన దేశ ‘జేఈఈ’ కంప్యూటర్ విధానాన్నో పూర్తిగా అనుకరించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సరళమైన నమూనా వైపు క్రమంగా అడుగులు వేయాలి.

అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసి, అందులో బెస్ట్ స్కోర్‌ను సమర్పించేలా అనుమతిస్తే, ఒకే ఒక మధ్యాహ్నంపై ఉండే విపరీతమైన ఒత్తిడి తక్షణమే తగ్గుతుంది. ఇది పేపర్ లీకేజీల వంటి అవినీతి మార్కెట్‌ను దెబ్బతీస్తుంది. ఐదు నిమిషాల ట్రాఫిక్ జామ్ కారణంగా ఒక విద్యార్థి జీవితం నాశనమయ్యే పరిస్థితి ఉండదు.

భారతదేశం తన మానవ వనరుల ఫలాలను అందుకోవాలనుకుంటే, పరీక్షా కేంద్రాల గేట్ల వద్దే దేశ యువత ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేయడం ఆపాలి. ఈ విద్యా వ్యవస్థను ఆధునీకరించడం అనేది ఇప్పుడు కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదు.. ఇది నైతిక, దేశాభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆవశ్యకత.

- టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page