బాల్యాన్ని ప్రేమించడం మానవీయ సంస్కృతికి నిదర్శనం. 140 కోట్లకు పైగా జనాభా వున్న మన దేశంలో ముప్పై సంవత్సరాల లోపువారు 60 శాతం మంది. అందుకే మన దేశాన్ని యంగ్ ఇండియా (యువభారత్) అని అంటున్నారు. అంటే 84 కోట్ల మంది. వారిలో 50 శాతం మంది (3 ` 18 సంవత్సరాల మధ్యవారు) బడి వయసు పిల్లలు. అంటే 42 కోట్ల మంది. నాణ్యమైన విద్యకు మన విద్యా ర్థులు దూరమవుతున్న విషయం అందరూ ఎరిగిందే. ఇంటికన్నా బడిపదిలం నుంచి సర్కారు బడికన్నా కార్పొరేట్ బడే పదిలం, అందుకోలేనివారికి బడి బయటే పదిలం అనే విధంగా పరిస్థితులు దిగజారుతు న్నాయి. ఫలితంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు బడిబాటకు దూరమవుతున్నారు. యునెసెఫ్ పేర్కొన్నట్టు బడిబయట వున్న బాలలందరూ బాలకార్మికులే. ఈ 42 కోట్లమందిలో మూడవ వంతుమంది అంటే దాదాపు 14 కోట్ల మంది బడి ముఖ్యం చూడని, లేదా బడి మధ్యలో చదువు ఆపేసిన బాలలే. ఐదేళ్ల లోపు బాలలు 40 శాతం మంది కనీస పోషక విలువల లేమితో బాధపడుతున్నారని, వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేక కునారిల్లుతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. ఆధునిక యుగంలో వ్యక్తిగత అభివృద్ధికి పర్యాయపదం చదువు. ‘విలువలతో కూడిన విద్యే నిజమైన విద్య’ అని అంబేద్కర్ పదే పదే చెప్తారు. మరి మన విద్యావ్యవస్థ ఎలాంటి సామాజిక, మానవీయ, శాస్త్రీయ విలువలు బాలలకు అంది స్తున్నదో మనం గమనించుకోవాలి. చదువుకు ఎల్లలు లేవని, బాలలందరూ సమానమేనన్న సత్యాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు మూడో వంతు బాల్యం ఈ విధంగా బాధపడుతుంటే మన దేశం ఎలా ముందుకు పోగలదు? ఈ విషాదాన్ని మనం ఎలా నైతికంగా సమర్ధించుకోగలం? వ్యక్తిగతంగా పైకి ఎగబాకాలనే ర్యాట్‌రేస్ ఒత్తిడిలో విద్యార్థులు బలవన్మరణాల పాలవుతున్నారు. ఇది బాల్యానికి మరో పార్శ్వం. విద్యార్థుల ఆత్మహత్యల్లో తమిళనాడు, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందు వరుసలో వున్నాయి. చదువులా? చావులా? అన్న పతాక శీర్షికలు ప్రతికలకు ఎక్కుతున్నాయి. ఈ కార్పొరేట్ విద్యాసంస్కృతికి ఆశపడి ఎంతోమంది బడుగు జీవులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పుల పాలవుతూ పల్లెలు వదలి పట్టణాలకు వస్తున్నారు. చేతగాని పనులు ఎన్నో చేస్తూ నరకయాతన పడుతున్నారు. ఇంటర్ విద్య ఖర్చు 5- 10 లక్షల రూపాయల వరకు వుంటే వారి ఆస్తులు, ఆదాయం హరతి కర్పూరంలా హరించుకుపోతున్నాయి. దుర్భరమైన ఈ తల్లిదండ్రుల కష్టం కూడా పిల్లలపై అధిక మానసిక ఒత్తిడిని పెంచుతున్నది. చదువుకు తగిన ఉద్యోగం రాకపోయినా, చదువు అబ్బకపోయినా కాయకష్టం చేసుకుని నిజాయితీగా, హాయిగా బతకవచ్చు అనే ఆత్మస్థైర్యం కొరవడిరది. ఉపాధ్యాయులు ఆకర్షణీయ బోధనాపద్ధతులు మెరుగుపరుచుకోలేక పిల్లలకు పాఠ్యాంశాలపై శ్రద్ధ లేక తరగతి గదులు నిస్సారమైపోతున్నాయి. చదువు కేవలం మార్కుల కోసమే అన్న పద్ధతుల్లో గైడ్‌లు ఇచ్చి పిల్లల చేత బట్టీ పట్టిస్తూ, చూచిరాతలు రాయిస్తున్నారు. యాంత్రికంగా మారుతున్న చదువు పట్ల ఎవరూ సిగ్గుపడటం లేదు. తల్లిదండ్రులు కూడా ఆ మార్కులు, ర్యాంకుల పట్ల పరుగుతీయడం శోచనీయం. పులిమీద పుట్రలా ఇప్పుడు బాల్యంపై డ్రగ్ (మత్తుపదార్థాల) పంజా కూడా విప్పింది. ఈ యంగ్ ఇండియాను డ్రగ్ ఇండియాగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం రెండు లక్షల మంది డ్రగ్ వాడకందార్లు వుంటే, ఇప్పుడు ఆ సంఖ్య పదికోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దాటుకుని పాఠశాలలకు చాక్లెట్స్ రూపంలో చేరడం పెనువిషాదం. అలాగే సెల్‌ఫోన్ వాడకం విశృంఖులత్వంలో అన్‌లైన్ బెట్టింగ్‌లు, బ్లూవేల్స్ వంటి ప్రమాద కర వీడియోగేమ్స్, హద్దూ అదుపూ లేని పోర్న్‌కల్చర్‌కు బానిసలవుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ఈ ప్రమాదకర విషపు సాలెగూడులో బాల్యం చిక్కుకుంటున్నది. లైంగిక విశృంఖలతో నేరాలకు, ట్రాఫి కింగ్‌కు బాల్యం బలైపోతున్నది. వీటన్నిటి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం క్షమించరానిది. ఈ నేపథ్యంలో బాల్యాన్ని పరిరక్షించేందుకు కేవలం ప్రభుత్వాలపైనే ఆధారపడక ఎక్కడి కక్కడ పౌరసమాజం మేల్కొని ఉద్యమంలా కదలాలి. తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకునే విధంగా పిల్లలకు శిక్షణనీయాలి. కెరీర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమన్న పద్ధతుల్లో విద్యాబోధన సాగాలి. శ్రమను గౌరవించడం (డిగ్నిటీ ఆఫ్ లేబర్), ప్రశ్నించడం నేర్పాలి. మానవులందరూ సమానమేనన్న సమతా ధర్మాన్ని పాటించేలా చేయాలి. బాల్యం భవిష్యత్తులోనే దేశ భవిష్యత్తు దాగి వుందన్న సత్యాన్ని తెలుసు కోవాలి. అలాంటి శాస్త్రీయ విద్యకు బాటలు పరిచినప్పుడే మనదేశానికి పురోగతి వుంటుంది.
top of page
bottom of page
Comments