top of page

కాలగర్భంలో తొమ్మిది నియోజకవర్గాలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 29, 2024
  • 3 min read
  • `పునర్విభజన ప్రక్రియతో మటుమాయం

  • `కొన్ని పేరు మారితే.. మరికొన్ని కొత్తగా తెరపైకి

  • `ఇప్పుడున్న పలు సెగ్మెంట్లలో గతంలో ఎన్నో మార్పులు

  • `కొన్నింటి రిజర్వేషన్లు కూడా మార్చిన ఉదంతాలు

  • `మళ్లీ 2029లో మారనున్న స్వరూప స్వభావాలు

(ఎన్నికల రచ్చబండ)

ప్రస్తుతం ఉన్న ఆమదాలవలస నియోజకవర్గాన్ని గతంలో నగరికటకం నియోజకవర్గంగా.. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని గతంలో ఎస్‌ఎంపురం నియోజకవర్గంగా వ్యవహరించేవారన్న విషయం మనలో ఎందరికి తెలుసు? ఈ రెండు కాదు అనేక నియోజకవర్గాలు కాలక్రమంలో తమ భౌగోళిక స్వరూప స్వభావాలను, పేర్లను, రిజర్వేషన్లను మార్చుకున్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన జిల్లాల పునర్విభజన సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలోనూ, రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలోనూ కలిసిపోవడంతో పది నియోజకవర్గాల శ్రీకాకుళం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలకు తగ్గిపోయింది. కాలప్రవాహంలో సమాజంలో, వివిధ రంగాల్లో మార్పుచేర్పులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అది సహజ పరిణామ ప్రక్రియ. అదే క్రమంలో భారతీయ ఎన్నికల వ్యవస్థలోనూ కాలానుగుణంగా, మారుతున్న అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా కూడా దానికి మినహాయింపు కాదు. గతంలో శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు మాత్రమే ఉండేవి. 1978లో శ్రీకాకుళం జిల్లా నుంచి పార్వతీపురం డివిజన్‌ను విశాఖ నుంచి విజయనగరం డివిజన్‌ను విడదీసి కొత్తగా విజయనగరం జిల్లా ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకొండ, రాజాం నియోజకవర్గాలను విడదీసేశారు. అదే రీతిలో నిర్ణీత కాలవ్యవధిలో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంటుంది. ఆ క్రమంలో కొన్ని పాత నియోజకవర్గాలు రద్దయిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తుంటాయి. అందులో భాగంగానే ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు కనుమరుగైపోయాయి.

పునర్విభజన ఎందుకు?

నియోజకవర్గాలు మారిపోవడానికి, కనుమరుగు కావడం వంటివి ఊరికే జరిగిపోవు. మారిన సామాజిక, భౌగోళిక పరిస్థితులు ఈ మార్పులకు ప్రాతిపదికన నిలుస్తున్నాయి. ఈ వ్యవహారమంతా పక్కా శాస్త్రీయంగా జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 20 ఏళ్లకోసారి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నిర్వహిస్తున్నారు. చివరిసారి 2008లో జరిగిన ఈ ప్రక్రియ మళ్లీ 2029లో జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం నిపుణులతో ప్రత్యేకంగా పునర్విభజన (డీలిమిటేషన్‌) కమిటీని నియమిస్తుంది. జనాభా, నివాసా ప్రాంతాల పెరుగుదల ప్రాతిపదికన ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సూచనలు, వినతులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో పర్యటించి నియోజకవర్గాలను పునర్విభజిస్తుంది. 2008లో జరిగిన పునర్విభజన ప్రక్రియలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున రెండు లక్షల మంది ఓటర్లు ఉండాలన్న ప్రామాణికతను నిర్దేశించుకున్న మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం ప్రతి 20 ఏళ్లకు ఒకసారి పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నా.. మొదట్లో అలా జరిగేది కాదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైంది. 1951`52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ ప్రక్రియ అంతా కొత్త కావడంతో తరచూ నియోజకవర్గాల స్వరూపాలు మార్చుకుంటూ వచ్చారు. ఆ విధంగా 1952, 1962, 1972 వరకు ప్రతి పదేళ్లకోసారి పునర్విభజన ప్రక్రియ చేపట్టినా.. ఆ తర్వాత 30 ఏళ్లపాటు నియోజకవర్గాల్లో మార్పులు జరగలేదు. మళ్లీ 2002లోనే పునర్విభజన కమిటీ ఏర్పాటు చేయగా 2008లో ఆ కమిటీ నిర్ణయం మేరకు కొత్త నియోజకవర్గాలతో 2009 ఎన్నికలు జరిగాయి. ఆ విధంగా పునర్విభజన జరిగిన ప్రతిసారీ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు పోవడం, కొత్త నియోజకవర్గాలు రావడం జరుగుతూ వస్తోంది. ఆ విధంగా ఇప్పటివరకు తొమ్మిది నియోజకవర్గాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. పొందూరు, ఎస్‌ఎం పురం, హొంజరాం, బ్రాహ్మణతర్లా, నగరికటకం, హరిశ్చంద్రపురం, ఉణుకూరు, సోంపేట, కొత్తూరు నియోజకవర్గాలు కాలగతిలో కలిసిపోగా వాటి స్థానంలో రాజాం, పలాస, ఎచ్చెర్ల నియోజకవర్గాలు వచ్చి చేరాయి. జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య కూడా తగ్గిపోయింది. 2009 ఎన్నికలకు ముందు జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా తర్వాత 10కి, మూడేళ్ల క్రితం జిల్లాల పునర్విభజనతో ఎనిమిదికి తగ్గిపోయాయి.

మధ్యలో వచ్చి మధ్యలోనే పోయిన పొందూరు

తెరమరుగైన నియోజకవర్గాల్లో పొందూరు గురించి ముందుగా చెప్పుకోవాలి. ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైనప్పుడు లేని ఈ నియోజకవర్గంలో మధ్యలో ఏర్పాటై ఆ తర్వాత కొన్నాళ్లకే మాయమైంది. చీపురుపల్లి నుంచి విడిపోయి ఏర్పడిన పొందూరు 1962 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గంగా ఉండేది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కొత్తపల్లి పున్నయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే జిల్లా జడ్జి ఉద్యోగం రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 1964లో జరిగిన ఉప ఎన్నికలో కొత్తపల్లి నరసయ్య (కాంగ్రెస్‌) ఎన్నికయ్యారు. 1967లో ఎస్సీ నుంచి జనరల్‌కు మారగా స్వతంత్ర పార్టీ నుంచి చౌదరి సత్యనారాయణ, 1972లో లుకలాపు లక్ష్మణదాసు(కాంగ్రెస్‌) విజయం సాధించారు. లుకలాపు లక్ష్మణదాసు రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రిగా కూడా వ్యవహరించి, చీపురుపల్లి నుంచి విడదీసి పొందూరులో కొత్తగా తాలుకాను ఏర్పాటుచేశారు. అయితే ఏర్పాటైన 18 ఏళ్లకే పొందూరు నియోజకవర్గం మాయమైంది. 1978 ఎన్నికల నాటికి తిరిగి చీపురుపల్లి సెగ్మెంట్‌లోనే విలీనమైంది. 2004 ఎన్నికల వరకు పొందూరు, జి.సిగడాం మండలాలు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోనే ఉండేవి. 2008 పునర్విభజనలో పొందూరు మండలం ఆమదావలస నియోజక వర్గంలో, జి.సిగడాం మండలం ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనమయ్యాయి.

నాటి ఎస్‌ఎంపురం.. నేడు ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎంపురం(షేర్‌మహమ్మద్‌పురం) ఒకనాడు సమితి కేంద్రంగా, నియోజకవర్గా హెడ్‌క్వార్టర్‌గా ఉండేది. 1955లో అవతరించిన ఈ సెగ్మెంట్‌ 12 ఏళ్లకే 1967లో అంతరించిపోయింది. 1955లో జరిగిన ఎన్నికల్లో కృషికార్‌ లోక్‌పార్టీ అభ్యర్థిగా చౌదరి సత్య నారాయణ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 1962 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బల్లాడ హరప్పడు రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్‌ ఎచ్చెర్ల నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. మొదట్లో ఎస్సీలకు రిజర్వ్‌ అయిన ఎచ్చెర్ల 2009 నుంచి జనరల్‌కు మారింది.

హొంజరాం.. మూడేళ్ల ముచ్చట

ఒకప్పుడు నియోజకవర్గంగా ఉన్న హొంజరాం మూడేళ్లకే తెరమరుగైంది. 1952లో అవతరించిన ఈ నియోజకవర్గం ఒకే ఒక ఎన్నికను చూసింది. 1951`52 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి పీసపాటి పుండరీకాక్షాచార్యులు ఎన్నికయ్యారు. అనంతరం ఈ సెగ్మెంట్‌ పాలకొండలో కలిసిపోయింది.

`1955లో అవతరించిన బ్రాహ్మణతర్లా అసెంబ్లీ సెగ్మెంటు 12 ఏళ్లు కొనసాగి 1967లో అంతర్థానమైంది. 1955 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కృషికార్‌ లోక్‌పార్టీ అభ్యర్థి నిచ్చెర్ల రాములు, 1962లో బెండి లక్ష్మీనారాయణమ్మ ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల నాటికి ఈ సెగ్మెంట్‌ టెక్కలి నియోజకవర్గంలో కలిసిపోయింది.

`1955లో ఏర్పాటైన నగరికటకం సెగ్మెంట్‌ 1978 వరకు కొనసాగింది. 1955, 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తమ్మినేని పాపారావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పేరు మార్చుకుని ఆమదావలస నియోజకవర్గంగా మారింది.

`2008 పునర్విభజనలో జిల్లాలోని హరిశ్చంద్రపురం, ఉణుకూరు, సోంపేట, కొత్తూరు నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఉణుకూరు నియోజకవర్గం రాజాంగా మారి ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. హరిశ్చంద్రపురం నియోజకవర్గం రద్దు కాగా అందులో కొంత భాగంగా టెక్కలి నియోజకవర్గంలో విలీనమైంది. మరికొంత భాగం కొత్తగా ఏర్పాటైన పలాసలో కలిసింది. అలాగే సోంపేట నియోజకవర్గంలో కొంతభాగం పలాసలో, మరికొంత భాగం ఇచ్ఛాపురంలో కలిసిపోయాయి. కొత్తూరు ఎస్టీ నియోజకవర్గం రద్దు కాగా అందులో కొన్ని మండలాలు పాలకొండలో, మరికొన్ని మండలాలు పాతపట్నంలో కలిసిపోయాయి. గతంలో ఎస్సీ కేటగిరీలో ఉన్న పాలకొండ ఎస్టీ నియోజకవర్గంగా మారింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page