కాలం ఎప్పుడూ.. ముళ్ళపాన్పూ కాదు, పూలపాన్పూ కాదు!
- Guest Writer
- Apr 16
- 3 min read

ఆనాడే కాదు ఈనాడూ ఆవిడ పేరు ఎవ్వరికీ తెలియదు. అయినా ఆమె ఏనాడూ కోరుకోలేదు. కాలం ఎప్పుడూ ముళ్ళపాన్పూ కాదు, పూలపాన్పూ కాదు. కొన్నిసార్లు అది ముళ్ల కిరీటాన్ని తలపై పెట్టి, నెత్తురు చిందిన చోటే బంగారం పండిస్తుంది. చావులాంటి కష్టాలను ఇస్తోంది అంటే అమృతం లాంటి అద్భుతాలను సృష్టిస్తుంది.
భారతీయ సంగీత ప్రపంచాన్ని ఎన్నో దశాబ్దాల పాటు శాసించిన మంగేష్కర్ కుటుంబం వెనుక ఉన్నది కేవలం గాన మాధుర్యం మాత్రమే కాదు, ఒక తల్లి రాల్చిన కన్నీరు, పడిన ఆకలి, చేసిన నిస్వార్థ త్యాగం. ఆ మాతృమూర్తి పేరే సుధామతి మంగేష్కర్!
చిన్నప్పుడే తండ్రి దీనానాథ్ మంగేష్కర్ చనిపోయారు. నాటి ఆ నాటక రంగ దిగ్గజం, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తన సొంత బిడ్డల కోసం ఏ ఆస్తులు, అంతస్తులు ఏమీ మిగల్చలేకపోయారు. వెళుతూ వెళుతూ కేవలం ఒక్క ఏక్ తార చేతిలో పెట్టి ఆశీస్సులు ఇచ్చి పోయారు. అప్పటికి ఆ ఇంటి పెద్ద దిక్కు, పండిట్ దీనానాథ్ గారి ధర్మపత్ని ‘సుధామతి’ (వివాహానికి ముందు ఆమె పేరు సేవంతి) గుండెల్లో మాటలకందని శోకం. ఐదుగురు చిన్నపిల్లలు. కట్టుకోడానికి సరైన బట్టలు లేవు, తినడానికి తిండి లేదు.
ఆ క్షణంలో ఆ తల్లి కళ్ల ముందు ఒకటే లక్ష్యం-తన బిడ్డలను బతికించుకోవడం, తన భర్త ఇచ్చిన సంగీత వారసత్వాన్ని నమ్ముకుని బతికించుకోవాలనుకుంది.
ఆ ఐదుగురు పసికూనలను చూసుకుంటూ తల్లి సుధామతి పడిన వేదన వర్ణనాతీతం. భర్త మరణంతో ఉన్నదంతా పోయింది. బంధువులు ముఖం చాటేశారు. ఆ పరిస్థితుల్లో ఆ తల్లి ఎన్నో రాత్రులు పస్తులు పడుకుంది. తన కడుపు మాడ్చుకుని, పిల్లలకు ముద్ద పెట్టింది. ఆ కన్నీటి ధారల మధ్యే పిల్లల గొంతుల్లో ప్రాణం పోసింది.
ఆ తల్లి కడుపున పుట్టిన ఆ ఐదుగురు రత్నాల పూర్తి పేర్లు, వారిని వివాహమాడిన అదృష్టవంతులైన జీవిత భాగస్వాముల వివరాలు:
లతా మంగేష్కర్ (పుట్టినప్పటి పేరు హేమ).
తన తండ్రి మరణం తర్వాత 13 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను తన లేత భుజాలపై వేసుకున్న పెద్ద కుమార్తె. గానమే తన లోకమని నమ్మి, జీవితాంతం అవివాహితగానే ఉండిపోయి, భారతీయులందరికీ ‘గాన కోకిల’ అయ్యారు.
మీనా ఖాదికర్ (పుట్టినప్పటి పేరు మీనా మంగేష్కర్).
మంగేష్కర్ అక్కచెల్లెళ్లలో రెండవ వారు. ఈమె కూడా ఎన్నో మరాఠీ, హిందీ పాటలు పాడారు, సంగీత దర్శకత్వం వహించారు. ఈమె భర్త పేరు ఉదయ్ ఖాదికర్.
ఆశా భోంస్లే (పుట్టినప్పటి పేరు ఆశా మంగేష్కర్).
భారతీయ చలనచిత్ర సంగీతంలో బహుముఖ గాయనిగా చరిత్ర సృష్టించిన మూడవ కుమార్తె. ఈమె మొదటి భర్త పేరు గణపత్రావు భోంస్లే. ఆ తర్వాత కాలంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ (ఆర్.డి.బర్మన్)ను వివాహం చేసుకున్నారు.
ఉషా మంగేష్కర్
నాల్గవ కుమార్తె. అక్కల అడుగుజాడల్లో నడుస్తూ, ఎన్నో భక్తిగీతాలు, సినీగీతాలతో తనదైన ముద్ర వేశారు. తన అక్క లతా మంగేష్కర్‌లాగే ఈమె కూడా అవివాహితగానే జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు.
హృదయ్‌నాథ్ మంగేష్కర్
కుటుంబంలో అందరికంటే చిన్నవాడు, ఏకైక కుమారుడు. ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఎదిగారు. ఈయన భార్య పేరు భారతీ మాల్వంకర్.
తల్లి పడిన కష్టం - సాధించిన విజయం:
భగవంతుడు వాళ్లకు ఇచ్చింది కేవలం పాడే శక్తి. ఆ శక్తిని నమ్ముకుని ఆ పసిపిల్లలు, ముఖ్యంగా లతా మంగేష్కర్ ముంబై వీధుల్లో అవకాశాల కోసం తిరిగారు. కుటుంబం గడవడం కోసం ఇష్టం లేకపోయినా ముఖానికి రంగు వేసుకుని చిన్న చిన్న వేషాలు వేశారు. అప్పటి సినీ పరిశ్రమ కూడా వారిని పూలమాలలతో స్వాగతించలేదు. లతా మంగేష్కర్ గొంతు విని, ఆ పాటను అనేక సంగీత విద్వాంసులు, సినీ నిర్మాతలు కూడా “అబ్బే ఈ గాత్రము పనికిరాదు, చాలా సన్నగా ఉంది” అనేసారు. నిరాశతో ఇంటికి వచ్చిన బిడ్డలను చూసి ఆ తల్లి గుండె పగిలినా, ధైర్యం కోల్పోలేదు. “మీ నాన్నగారి ఆశీస్సులు మీకున్నాయి, సాధన మానకండి” అని వెన్నుతట్టి ప్రోత్సహించింది సుధామతి.
నిజమే.. అయినా వారు దేనికీ వెరువలేదు. తల్లి ఇచ్చిన ఆత్మస్థైర్యం, తండ్రి ఇచ్చిన ఏక్ తార స్ఫూర్తితో నిరంతరం శ్రమించారు. తమ నిరంతర సాధనతో కాదన్న చోటే అవుననిపించుకునేట్టు, భళిరా వేరెవరూ సాటి లేరు అనేట్టు సాధించారు. పనికిరాదు అన్న గొంతులే ఆ తర్వాత దశాబ్దాల పాటు యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించాయి. లతాజీ గొంతు లేనిదే పాట లేదు అన్నంతగా ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆశాజీ తనదైన విభిన్న శైలితో చరిత్ర సృష్టించారు.
ఈ అద్భుతమైన ప్రయాణం వెనుక, వారు సాధించిన శిఖరాల వెనుక ఉన్న పునాది రాయి వారి తల్లి సుధామతి. పిల్లలు కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు కూడా ఆమె అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతూ, వారిని ఎప్పుడూ నేలమీద ఉండేలా వినయాన్ని నేర్పారు. ఆ మాతృమూర్తి త్యాగం లేకపోతే, భారతదేశానికి లతా మంగేష్కర్, ఆశా భోంస్లే లాంటి రత్నాలు దక్కేవారు కారు. తండ్రి అందించిన ఏక్ తారను అక్కున చేర్చుకుని, తల్లి కన్నీటిని అమృతంగా మార్చుకుని ఆ ఐదుగురు బిడ్డలు పలికించిన స్వరాలు, చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతాయి.
నేను ఒకనాడు రాసుకున్న నా పాట ఇవ్వాళ మళ్ళీ గుర్తుకొచ్చింది.
“ఆత్మహింస లేనిదే అందలమే లేదు,
వేదనలో కాలనిదే జయమనేది రాదు
పరితాపం జ్వాలల్లో గుండె కాలుతుంది
కాలి కాలి కాంచనమై కాంతి చిమ్ముతుంది”
- గౌతమ్ కశ్యప్






Comments