కెలికారో.. కూలిపోతారు!
- NVS PRASAD
- Apr 8
- 5 min read
పెద్దమార్కెట్ విషయంలో కూటమి పెద్దల తొందరపాటు
మొత్తం మార్కెట్‌నే కూల్చేస్తామనడం అనాలోచితం
నగరంలో ప్రకంపనలు రేపుతున్న మంత్రి, కమిషనర్ ప్రకటనలు
గతంలో ఇదే దూకుడు ధోరణితో దెబ్బతిన్న గత పాలకులు
సమగ్ర ప్రణాళిక లేకుండా ముందుకెళితే మొదటికి మోసం

కూటమి ప్రభుత్వం.. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు ఒక పెద్ద తేనెతుట్టెను కదుపుతున్నారు. కచ్చితంగా ఇది కెలికి కరిపించుకోవడమే. శ్రీకాకుళం నగరంలోని పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్‌ను పునర్నిర్మిస్తామంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన ఇప్పుడు నగర వ్యాపారవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తామంటే.. అది కూడా వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందని ప్రకటిస్తే కలవరం, కలకలం ఎందుకన్న ప్రశ్న తలెత్తొచ్చు. కానీ ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మార్కెట్‌లోకి అడుగు పెట్టిన వెంటనే ప్రస్తుత మార్కెట్ భవనాలను కూల్చేస్తామని.. వాటి స్థానంలో కొత్త మార్కెట్ భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి ప్రకటించడం.. అది చాలదన్నట్లు వారం పదిరోజుల వ్యవధిలోనే షాపులు ఖాళీ చేసేయాలని కమిషనర్ ఆదేశించడమే ఈ కలవరానికి కారణం.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రస్తుతం పెద్ద మార్కెట్‌లోని పలు భవనాలు నిరుపయోగంగా ఉన్నమాట వాస్తవం. అలా అని అవి పూర్తిగా పనికిరాకుండాపోలేదు. శ్రీకాకుళం వ్యాపార సరళిని బట్టి కొన్ని షాపులు ఖాళీగా మిగిలిపోయాయి. అందుకు బాధ్యులు గత ప్రభుత్వంలో ఉన్నవారైతే.. ఇప్పటి కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా అదే పంథా అనుసరిస్తూ పెద్ద తప్పు చేస్తున్నారు. పెద్దమార్కెట్‌కే వచ్చారో లేక బాబూ జగ్జీవన్‌రామ్ జయంతికి రాలేదు కాబట్టి మార్కెట్ పెద్దల ఆహ్వానం మేరకు అక్కడున్న రామమందిరంలో పూజలకే వచ్చారో తెలీదు గానీ అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, గొండు శంకర్‌ల బృందం పెద్దమార్కెట్‌లో ఆదివారం అడుగు పెట్టింది. సహజంగానే మార్కెట్‌లో సమస్యలున్నాయని అక్కడి వ్యాపారులు వారికి చెప్పుకొచ్చారు. అంతే.. అక్కడికక్కడే అచ్చెన్నాయుడు ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ స్టైల్‌లో రూ.25 కోట్లతో కొత్త మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రకటించేశారు. అంతవరకు బాగానే ఉంది. అచ్చెన్నాయుడు వెళ్లిన మరుసటి రోజే పెద్దమార్కెట్‌ను ఈ నెల 15లోగా స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని.. లేదంటే తామే తొలగిస్తామంటూ కార్పొరేషన్ కమిషనర్ స్వయంగా పర్యటించి మరీ ప్రకటించారు. అందులో భాగంగా వ్యాపారులకు ఓ సంకేతం ఇవ్వడానికి కొన్ని రేకుషెడ్లను తొలగించారు కూడా. ఆదివారం మంత్రులు రావడం.. సోమవారమే తొలగింపు కార్యక్రమం మొదలవడంతో తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా మార్కెట్‌ను కూల్చేస్తామనడం పట్ల వ్యాపారవర్గాలు భగ్గుమంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఒకసారి మోసపోయామన్న భావనలో పెద్దమార్కెట్ వర్తకులు ఉన్నారు.
నాడు మార్కెట్‌కు ఒక రూపు తెచ్చినా..!

పెద్దమార్కెట్ రూపురేఖలు మార్చడానికి ఐడీఎస్‌ఎంటీ స్కీమ్ కింద రూ.2.50 కోట్లు, మున్సిపాలిటీ నుంచి రూ.1.20 కోట్లు వెచ్చించి అదనంగా ప్రత్యేక షెడ్లు వేసుకునేందుకు మరో రూ.4 కోట్లతో నిర్మించి 2009 ఎన్నికలకు ముందు అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎంవీ పద్మావతి పని చేస్తున్న కాలంలో చేపట్టిన పెద్ద పని ఇది. అంతవరకు మార్కెట్‌కు ఒక రూపు, ఒక షేపు లేదు. అటువంటిది ఆమె హయాంలో మంత్రి ధర్మానను ఒప్పించి ఈ మార్కెట్‌ను పునర్నిర్మించగలిగారు. ఏళ్ల తరబడి మార్కెట్‌లో అడుగు పెట్టలేని దుస్థితిని తప్పించి ఓ స్థాయిలో దీన్ని నిర్మించగలిగారు. అప్పట్లో ఇది పెద్ద విజయమే. ఎందుకంటే.. పద్మావతి నాయకత్వాన్ని కౌన్సిల్‌లోనే సొంత పార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్న సమయంలో దానికి ఎదురీది మార్కెట్‌ను నిర్మించి ధర్మాన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించగలిగారు. సరిగ్గా అదేరోజు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారానికి చిరంజీవి శ్రీకాకుళంలో అడుగు పెట్టారు. జనమంతా చిరు వెంట పరుగులు తీస్తుంటే.. మార్కెట్ తరఫున అంధవరపు రఘురామ్, జామి జనార్థన, ఏఎన్‌ఆర్ రాజు వంటి ఓ నలుగురు మాత్రమే ధర్మాన తరఫున పని చేస్తున్న రోజుల్లో ఈ ప్రారంభోత్సవాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు.
పాత గాయాన్ని కెలుకుతున్నారా?
కట్ చేస్తే.. పాత మార్కెట్‌ను ఖాళీ చేయించినప్పుడు వ్యాపారులకు ఇచ్చిన హామీని అప్పటి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. దాని ఫలితమే 2014 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఓటమి అని చెప్పకతప్పదు. ఎందుకంటే.. 2009లో దీన్ని ప్రారంభించినా 2010 తర్వాతే వ్యాపారులకు దీన్ని అందించారు. షాపుల కోసం డ్రా తీయగా.. కొందరికి ఫస్ట్‌ఫ్లోర్‌లో షాపులు వచ్చాయి. నగరంలోని జీటీ రోడ్డులోనే ఫస్ట్‌ఫ్లోర్‌లో వ్యాపారాలు లేవంటే, మార్కెట్‌కు వచ్చి ఫస్ట్‌ఫ్లోర్‌లో ఎవరు కొంటారంటూ వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వారికి న్యాయం చేస్తామంటూ 2010 నుంచి 2014 ఎన్నికల వరకు నాయకులు ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున ధర్మానకు వ్యతిరేకంగా మళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూడా మార్కెట్ అంశాన్ని కెలికి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నదన్న భావన ఏర్పడకమానదు. మార్కెట్‌ను పునర్నిర్మించకముందు మూడు రకాల సైజుల్లో షాపులు ఉండేవి. సైజును బట్టే వాటి అద్దెలుండేవి. పునర్నిర్మాణానికి ముందు 120 షాపులు గ్రౌండ్‌లో ఉండేవి. పక్కా భవనాలు ఏర్పడిన తర్వాత వాటిని 90కి కుదించారు. షాపుల కేటాయింపునకు తీసిన డ్రాలో 30 మందికి ఫస్ట్‌ఫ్లోర్‌లో రావడంతో వారెవరూ వాటిని తీసుకోలేదు. అప్పట్నుంచి ఆ 30 మంది వ్యాపారులు తమకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షాపులు కేటాయించాలంటూ దాదాపు నాలుగేళ్లు తిరిగినా ఫలితం దక్కకపోవడంతో అప్పటి అధికార పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అప్పుడు కూడా 2006లో మార్కెట్‌ను యుద్ధప్రాతిపదికన ఖాళీ చేయించి శంకుస్థాపన చేశారు. కానీ షాపుల కేటాయింపు దగ్గర మాత్రం సమన్యాయం చేయలేకపోయారు. అప్పటికప్పుడు షాపులు ఖాళీ చేయాల్సి రావడంతో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో దేనికీ పనికిరాని షాపులను ఎక్కువ అద్దెలు చెల్లించి మరీ కిరాణా వర్తకులు తీసుకున్నారు. తీరా మార్కెట్‌లో తమ పాత షాపులు రాకపోవడంతో అక్కడ అంతంత అద్దెలు చెల్లించలేక దాదాపు 120 మంది తమ వ్యాపారాలను మూసేశారు. అదే సమయంలో పెద్ద మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా నగరంలో అనేక దిక్కుల్లో చిన్నచిన్న మార్కెట్లు వెలసి నిలదొక్కుకున్నాయి. ఉదాహరణకు కోవిడ్ విపత్కర కాలాన్నే తీసుకుంటే.. స్థానిక ఫిష్ మార్కెట్‌ను మూసేయడం వల్ల నగరంలో పీఎన్ కాలనీ, విశాఖ`బి కాలనీ జంక్షన్, బలగ మెట్టు వంటి ప్రాంతాల్లో చేపల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పుడు కరోనా లేకపోయినా అక్కడ మార్కెట్ మాత్రం బలంగా కొనసాగుతోంది.
ప్రత్యామ్నాయం మాటేమిటి?
గతంలో మార్కెట్‌ను పునర్నిర్మించినప్పుడు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించారు. కానీ ఇప్పుడు ఆ ఊసు లేకుండానే తొలగింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉన్న ఫళంగా మార్కెట్‌ను ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మార్కెట్‌ను పునర్నిర్మించే ముందు దానికి సంబంధించిన డిజైన్‌ను వ్యాపారులకు చూపి వారి ఆమోదం మేరకు నిర్మిస్తామని చెప్పినా అలా జరగకపోవడం వల్ల పెద్ద డ్యామేజీయే జరిగింది. ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు ప్రకటించిన రూ.25 కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు? ప్రస్తుతం ఉన్న వ్యాపారులందరికీ చోటు కల్పించే డిజైన్‌ను ఎలా రూపొందిస్తారు? ఎప్పటిలోగా నిర్మాణాలు పూర్తి చేసి అందిస్తారు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే తొలగింపు కార్యక్రమం మొదలు పెట్టేశారు. వాస్తవానికి పెద్దమార్కెట్‌లోని డి`బ్లాక్‌లో 8 షాపులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటి స్థానంలో కొత్తవి నిర్మించాలన్న ప్రతిపాదన 2014లో గుండ లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఉంది. ఈమేరకు అప్పటి కలెక్టర్ లక్ష్మీనృసింహాన్ని మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కలిసి డి`బ్లాక్ స్థానంలో ప్రత్యామ్నాయ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇప్పుడు కూడా మార్కెట్‌లో వ్యాపారస్తుల డిమాండ్ అదే. కానీ వారేం చెప్పారో, వీరికేం అర్థమైందో తెలీదు కానీ మొత్తం మార్కెట్‌నే కూలగొట్టేస్తామని కమిషనర్ ప్రకటిస్తున్నారు.
వ్యాపారులు కోరని పునర్నిర్మాణం

వాస్తవానికి మార్కెట్ పునర్నిర్మాణాన్ని ఇక్కడి వ్యాపారస్తులెవరూ కోరుకోవడంలేదు. ఎందుకంటే కొత్తగా నిర్మించినా అక్కడున్న స్థలంలో అందరికీ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షాపులివ్వడం సాధ్యం కాదన్న విషయం వ్యాపారస్తులకు తెలుసు. ఎందుకంటే పెద్దమార్కెట్ నుంచి కిరాణా వ్యాపారం ఎప్పుడో తరలిపోయింది. ఇక్కడ కేవలం నేల వర్తకులు మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే మార్కెట్‌ను పునర్నిర్మించారో అప్పటి వరకు ఉన్న నేలవర్తకుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. పువ్వులమ్మేవారి దగ్గర్నుంచి అరటిపళ్లు అమ్మేవారి వరకు, కూరగాయల దగ్గర్నుంచి ఆకుకూరలమ్మేవారి వరకు వ్యాపారస్తులు పెరిగారు. ఇప్పుడు వారందరికీ అకామిడేట్ చేయాలి. అక్కడ చేపల మార్కెట్ పోను మిగిలిన స్థలంలో ఇంతమంది వ్యాపారులకు షాపులు నిర్మించడం అసాధ్యం. మార్కెట్ చుట్టూ ఉన్న నాలుగు రోడ్లలోని ఆక్రమణలను తొలగిస్తే అదే చాలు. మార్కెట్‌లోకి అడుగు పెట్టడానికి అవకాశం లేనివిధంగా నాలుగువైపులా రోడ్లు పూర్తిగా ఆక్రమణలకు గురైపోయాయి. మరీ విచిత్రమేమిటంటే.. ఈ నాలుగు రోడ్లను గత వైకాపా ప్రభుత్వం చాలా బలంగా నిర్మించింది. ఇందులో పాతబస్టాండు వైపు తోపుడుబండ్లతోను, మేదరవీధివైపు మేదర్లు, ఫిష్‌మార్కెట్‌కు వచ్చే వాహనాలు, చికెన్ సెంటర్లతో నిండిపోయింది. మార్కెట్ వెనుకవైపు హోల్‌సేల్ మార్కెట్లకు వచ్చే లారీలు, తోపుడుబళ్లు అడుగు పెట్టలేని పరిస్థితికి తీసుకువచ్చాయి. ఇక పందుంపుల్లల సెంటర్ నుంచి మార్కెట్‌కు వచ్చే మార్గం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పుడు కొత్త మార్కెట్ నిర్మించినా మార్కెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం లేనప్పుడు ఏం లాభమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లోపల 50 అడుగుల రోడ్డుందంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఇవన్నీ ఆక్రమణలకు గురైపోయాయి. అసలు ఎంతమంది మార్కెట్‌లో వ్యాపారాలు చేస్తున్నారు? అందులో నేలమార్కెట్ ఎంత? ఎవరికి షాపులు ఇవ్వాలి? అన్న సర్వే లేకుండానే కూల్చేస్తాం, కట్టేస్తాం అంటున్నారు. పెద్దమార్కెట్ ఒక పెద్ద తేనెతుట్టె. దాన్ని ఎప్పుడు కెలికినా తియ్యనైన తేనె మాత్రం రాలేదు. తేనెటీగల ముళ్లు మాత్రమే గుచ్చుకున్నాయి. ఈ విషయం అచ్చెన్నకు తెలీకపోవచ్చు. కానీ మార్కెట్‌లో తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోరాడ హరిగోపాల్ వంటి నాయకులకు తెలుసు.
సామాజిక ఆర్థిక సర్వే చేపట్టాలి
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను మళ్లీ పునర్నిర్మించాలంటే సామాజిక, ఆర్ధిక, వాస్తవిక భౌగోళిక సర్వేను ముందుగా చేపట్టాలి. అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని మార్కెట్‌కు శాశ్వత కట్టడాలు కల్పించిన ధర్మాన ప్రసాదరావు ఆ తర్వాత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలంటే మార్కెట్‌కు మించిన పాఠం ప్రస్తుత రాజకీయ నాయకులకు దొరకదు. అరసవల్లిలోనో, గుజరాతీపేటలోనో నివాసముంటూ పెద్దమార్కెట్‌లో కిరాణా వ్యాపారం చేసుకునేవారు మూడు తరాలుగా తమ వీలునామాలో తమ ఆస్తులతో పాటు మార్కెట్‌లో కిరాణా షాపు కూడా వాటాగా చూపించారంటే సామాజికంగా దాంతో ఎటువంటి సెంటిమెంట్‌ను కలిగివున్నారో అర్థం చేసుకోవాలి. అటువంటివారికి షాపులు దక్కకపోవడం వల్లే పెద్ద ఎత్తున అసంతృప్తి బయటపడిరది. అలాగే అసలు మార్కెట్‌లో ఎంతమంది వ్యాపారులున్నారు? ఎన్ని షాపులు కావాలి? అనే వాస్తవిక సర్వే ఒకటి జరపాలి. అది జరగలేదు. అలాగే మార్కెట్‌కు సంబంధించి ఎంతమంది అర్హులు? ఎంతమంది కాదు? అనేది పార్టీలకు అతీతంగా తేలాలి. ఇంతవరకు ఎటువంటి మ్యాప్ లేకుండా షాపులు కూల్చేస్తాం, కొత్తవి కట్టేస్తామంటే ఎక్కడి నుంచి నిధులు తెస్తారు? టెండర్లు ఎప్పుడు పిలుస్తారు? అనేది తేలకుండా మార్కెట్‌ను తొలగించడం ఆత్మహత్యాసదృశమే. అదే జరిగితే కోడి రామ్మూర్తి స్టేడియంలాగా, ఒక అరసవల్లి ఆక్రమణల తొలగింపు లాగా మొదలుపెట్టడమే గాని ముగింపు లేని కథగా మారిపోతుంది.
Comments