top of page

కులం కార్డే ఆశా‘కిరణ’ం!

Writer: NVS PRASADNVS PRASAD
  • `గొర్లె కిరణ్‌ నెత్తిన పాలుపోసిన పొత్తు

  • `తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న చోటే సానుకూలత

  • `పోలరైజ్‌ అవుతున్న సొంత సామాజికవర్గ ఓటు

  • `వ్యక్తిత్వం, కేసులు ఎన్‌ఈఆర్‌కు మైనస్‌ పాయింట్లు


ఎచ్చెర్ల నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా సిటింగ్‌ ఎమ్మెల్యేను ఓడిరచడం అతి సులువు అన్న అతి విశ్వాసం వల్లే ఇప్పుడు ఎన్డీయే కూటమి పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. అభ్యర్థుల ఎంపిక ముందు వరకు వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ను ఓడిరచడానికి పెద్దగా కష్టపడక్కర్లేదని, ఆ నియోజకవర్గంలోని వైకాపా అసంతృప్త నేతలే ఆయన్ను ఓడిస్తారన్న ధీమాతో గెలుపు గుర్రాలను పక్క జిల్లాకు పంపించి టీడీపీ అధినేత చంద్రబాబు ఓ పెద్ద ప్రయోగం చేశారు. డబ్బులుంటే రాజకీయాలు చేయడం చాలా సులువని మొదట నిరూపించింది చంద్రబాబునాయుడే. గత చరిత్ర చూసుకున్నా, తాజా ఎన్నికల్లో కడప నుంచి సీఎం రమేష్‌ను అనకాపల్లికి రప్పించినా దాని వెనుక కారణం డబ్బే. ఇక్కడ కూడా ఆ ఫార్ములానే ఉపయోగించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కేవలం కమ్మసిగడాం, బంటుపల్లి గ్రామాల్లో కొన్ని కుటుంబాలు తప్ప ఎక్కడా కనిపించని కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్‌)కు పొత్తులో భాగంగా బీజేపీ కోటాలో టికెటివ్వడం ద్వారా నేలవిడిచి సాము చేస్తున్నట్లుగా ఉంది. ఇది వికటిస్తుందో, విజయవంతమవుతుందో పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే ఈ నిర్ణయం అంతవరకు అసమ్మతి పోటు ఎదుర్కొన్న గొర్లె కిరణ్‌కు పెద్ద ఊరటనిచ్చింది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ పదవుల కేటాయింపు విషయంలో గొర్లె కిరణ్‌ సొంత పార్టీల్లోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసినవారిని పక్కన పెట్టి పదవులు అమ్ముకున్నారన్న ఆరోపణతో ‘కిరణ్‌ వద్దు, జగన్‌ ముద్దు’ పేరుతో రెండున్నరేళ్లకుపైగా వైకాపాలో అసమ్మతి ఉద్యమం నడిచింది. గొర్లె కిరణ్‌కు టికెటివ్వరని అసమ్మతి నేతలందరూ భావించారు. కానీ పక్క జిల్లా రాజకీయాల్లో జరిగిన అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా మళ్లీ కిరణ్‌ అభ్యర్థిత్వాన్నే జగన్మోహన్‌రెడ్డి ఓకే చేశారు. మరోవైపు ఎన్డీయే కూటమి తన అభ్యర్థిగా రణస్థలం మండలం బంటుపల్లికి చెందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదిటి ఈశ్వరరావు పేరు ప్రకటించింది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబునాయుడు తనకు తెలియకుండానే కిరణ్‌ నెత్తిన పాలు పోశారు. కిరణ్‌ కాకుండా వేరే అభ్యర్థికి వైకాపా టికెటిస్తే కలిసి పని చేయాలని భావించిన అసమ్మతి నేతలు ఇప్పుడు ఎన్‌ఈఆర్‌కు అనుచరులుగా వెళ్లి తృతీయ శ్రేణి నాయకులుగా మిగిలిపోవడానికి ఇష్టపడక వైకాపాలోనే కొనసాగారు. అదీ ఎంతలా అంటే.. ఎచ్చెర్ల వైస్‌ ఎంపీపీ ప్రతినిధి జరుగుళ్ల శంకర్‌ మీద గొడ్డలితో దాడి చేసి హత్యకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నా కూడా, దాన్ని పక్కనపెట్టి స్వయంగా శంకర్‌ ఇప్పుడు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారంటే గొర్లె కిరణ్‌కు టీడీపీ ఎంత పెద్ద మేలు చేసిందో అర్థమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు ఈ నియోజకవర్గంలో పెద్దగా కష్టపడకుండానే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరిగింది. ఇక్కడ కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడుల్లో ఎవరికి టికెటిచ్చినా కచ్చితంగా గెలిచి ఉండేవారు. అలా కాకుండా కళాకు చీపురుపల్లి అసెంబ్లీ, అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్లిచ్చారు. చంద్రబాబు , కూటమి నేతలు ఆశించినట్లు బీజేపీ అభ్యర్థి గట్టిగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గొర్లె కిరణ్‌కుమార్‌ పంచాయతీకి రూ.5వేలు ఇచ్చిన చోట ఎన్‌ఈఆర్‌ అంతకు నాలుగింతలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ ఎత్తుగడతో మారిన పరిస్థితి

కానీ ఎన్నికలంటేనే కులాల సమరం. ఇప్పుడు సరిగ్గా గొర్లె కిరణ్‌కు ఇదే అంశం కలిసొచ్చింది. తూర్పుకాపు సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో 22.93 శాతం మంది ఆ సామాజికవర్గీయులే. ఇప్పుడు కిరణ్‌ ఇదే నినాదాన్ని ఎత్తుకున్నారు. తూర్పుకాపులకు తాను ప్రాతినిధ్యం వహిస్తానని, నియోజకవర్గంలో మెజారిటీ వర్గీయులైన తూర్పుకాపులు ఓ కమ్మ సామాజికవర్గ నేత వద్దకు వెళితే ఏమేరకు పనులు జరుగుతాయో ఆలోచించుకోవాలని ప్రచారం ప్రారంభించారు. ఈ ఎత్తుగడ గట్టిగానే పని చేసింది. గొర్లె కిరణ్‌కుమార్‌ నామినేషన్‌ కంటే 10 రెట్లు ఎక్కువ జనాన్ని పోగేసి నామినేషన్‌ వేసి సత్తా చాటిన బీజేపీ అభ్యర్థి ఎన్‌ఈఆర్‌ ఒక్క అడుగుతో బాగా ముందుకొచ్చినట్లు కనిపించినా.. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కులం కార్డు గట్టిగా పని చేస్తోంది. దీనికి తోడు మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలతో కిరణ్‌ టికెట్‌ తెచ్చుకోడంతో ఆయన సహకారం అందుతోంది. వైకాపా వ్యూహాత్మకంగా విజయనగరం జెడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీనుకు ఈ నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది. అందువల్ల ఇక్కడ కాపులను పోలరైజ్‌ చేసేందుకు గ్రామాలన్నీ బలంగానే పని చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి స్వతహాగా కాపుల్లోనూ ఓటుబ్యాంకు ఉంది. ఎందుకంటే.. కళా వెంకట్రావు, అప్పలనాయుడు ఇద్దరూ కూడా ఈ సామాజికవర్గానికి చెందినవారే. అయితే ఇప్పుడు వైకాపాకు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి కాపు కానప్పుడు పార్టీతో ప్రమేయం లేకుండా తమ సామాజికవర్గ అభ్యర్థినే గెలిపించుకోవాలన్న భావన గత నాలుగు రోజుల నుంచి మొదలైంది.

సామాజికివర్గాల ఓట్లు ఇలా..

కూటమి అభ్యర్థి ఎన్‌ఈఆర్‌ సున్నా నుంచి మొదలుపెడితే తాను రెండు నుంచి మొదలుపెట్టడం గొర్లె కిరణ్‌కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో రెడ్డిక 12.30 శాతం, మత్స్యకార 11.47 శాతం, కాళింగులు 11.40 శాతం, ఎస్సీ (మాల) 9.12 శాతం, తెలగ లేదా ఓసీ కాపులు 7.73 శాతం, యాదవ 5.13 శాతం, పద్మశాలి 3.99 శాతం ఓటర్లు ఉన్నారు. ఇవి కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపే సామాజికవర్గాలు. వీటిలో ఏ పార్టీ సానుభూతిపరుడు ఆ పార్టీకి ఓటు వేసినా కాపులు గంపగుత్తగా కిరణ్‌ వైపు మొగ్గుచూపితే మాత్రం కౌంటింగ్‌ వరకు ఫలితం వరకు ఎదురుచూడక్కర్లేదు. కాకపోతే ఓసీ కాపులుగా ఉన్న 7.73 శాతం ఓట్లు ఎన్‌ఈఆర్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్‌కల్యాణ్‌ ప్రభావం.. లావేరు, రణస్థలం మండలాల్లో ఎన్‌ఈఆర్‌ ఇప్పటికే కొన్ని చారిటీ కార్యక్రమాలు నిర్వహించడం ఇందుకు కారణం. తూర్పుకాపులు ఈ నియోజకవర్గంలో ఎంతమేరకు ఒకటయ్యారంటే.. జి.సిగడాం మండలంలో ఉప్పు, నిప్పులా ఉన్న మీసాల నీలకంఠంనాయుడు, బూరాడ వెంకటరావులు ఇప్పుడు కాపు నాయకుడు ఎమ్మెల్యే కావడం కోసం ఒకే గొడుగు కిందకు వచ్చారని తెలుస్తోంది.

కూటమి అభ్యర్థిపై వివాదాలు, కేసులు

2019లో గొర్లె కిరణ్‌కు 99,672 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి కళా వెంకటరావుకు 80,961 ఓట్లు, జనసేన అభ్యర్ధి బాడాన జనార్థన్‌కు 5,068, కాంగ్రెస్‌కు 2,135, బీజేపీకి 1,022, నోటాకు 4,628 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,42,918 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో గొర్లె కిరణ్‌్‌కు ఎచ్చెర్లలో నాలుగు వేలు, లావేరులో మూడు వేలు, రణస్థలంలో ఏడు వేలు, జి.సిగడాంలో నాలుగు వేలతో కలిపి మొత్తం 18,711 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి కలిశెట్టి అప్పలనాయుడు రూపంలో బీజేపీ అభ్యర్ధి ఎన్‌ఈఆర్‌కు కొంత మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు ఎన్ని మండలాల వరకు ఉంటుందనేది తేలాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నాయకుడిన బరిలో దింపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్ధి ఎన్‌ఈఆర్‌పై అనేక ఆరోపణలున్నాయి. కమ్మపేట, బంటుపల్లి గ్రామాల్లో దళితులతో ఎన్‌ఈఆర్‌కు తీవ్రస్థాయిలో వివాదాలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఈశ్వరరావు స్వతహాగా వ్యాపారవేత్త కాబట్టి మొన్నటి వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు నెరుపుతూ ఆటంకాలను తొలగించుకొనే ప్రయత్నాల్లో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. భద్రకాళి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, స్మార్టెన్‌ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఈశ్వరరావు రియల్‌ వ్యాపారాలు చేస్తుండటం, విద్యాసంస్థలు, పెట్రోల్‌ బంకు వంటి అనేక వ్యాపార లావాదేవీలు నడుపుతున్నారు. ఈశ్వరరావు స్వతహాగా ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరన్న అభిప్రాయం బీజేపీ నాయకుల్లో ఉంది. అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటారని, తన మాటే చెల్లుబాటు కావాలని, అందరూ తన వద్దకే రావాలన్న దృక్పథంతో ఈశ్వరరావు ఉంటారని బీజేపీలోనే బలమైన ప్రచారం ఉంది. ఎన్‌ఈఆర్‌ వ్యవహార శైలి నచ్చక కొంతమంది బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా జరిగారు. కొందరు తటస్థులు, టీడీపీ, జనసేన నాయకులు ఈశ్వరరావు చుట్టూ తిరుగుతున్నా వారి వల్ల పెద్దగా ఉపయోగం లేదన్న భావనతో ఎన్‌ఈఆర్‌ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన ఓట్లు కూటమి అభ్యర్ధికి బదిలీ అయ్యే అవకాశాలు లేవని గుర్తించి ఈశ్వరరావు తన సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా గ్రామాల్లో ప్రత్యర్ధుల వ్యూహాలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు సర్ధుబాటు చేస్తున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్ధికి గుర్తుతో పాటు కులం ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఇప్పటి వరకు కమలం గుర్తుపై ఓటు వేయాల్సిన అవసరం ఆ నియోజకవర్గంలోని ఓటర్లకు రాలేదు.

 
 
 

Komentar


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page