
కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ లోకం నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు సర్వం సమస్తం కాలం చేతి మాయాజాలాలే. పొద్దు పొడుపు, పొద్దుగుంకడాల మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేం. రావాల్సిన ఒక్క క్షణాన్ని కూడా ముందుగానే తీసుకురాలేం. కాలకృతి చేతిలో ఆకృతులం. అనంతకాలానికి ఆది లేదు. తుది ఉండదు. కానీ మనకు మాత్రం ఆది, అంతాలు ఉంటాయి. ఉండి తీరాలి. మనం కాలానికి అతీతులం కాము. అందుకే ‘కాలాతీత విఖ్యాతుడు’ పరబ్రహ్మ ఒకడే అన్నాడు త్యాగయ్య. మనవన్నీ దిన చర్యలే. ఉదయం లేవాలి. తినాలి. పడుకోవాలి. మళ్లీ లేవాలి. మళ్లీ పడుకోవాలి. ఇదే పునరపి.. పునరపి.. సృష్టికి ఆటోమేటిక్ అలారం ఉంటుంది. దానికి ఇంకొకరు అలారం పెట్టి సమయానికి తగు పనులు చేయాలని చెప్పాల్సిన పనిలేదు. మనకలా కాదు. అలారం తట్టి లేపాలి. గడియారం సమయం చెబుతూ తొందర పెట్టాలి. నిమిషాల ముల్లు వేగంగా తిరగాలి. గంటల ముల్లు నెమ్మదిగా నడవాలి. భోజనానికి గంట కొట్టాలి. బడికి గంట కొట్టాలి. పూజకు గంట కొట్టాలి. ఉంటే గుండె గంట కొట్టాలి. పొతే చావు డప్పు కొట్టాలి. గడియారాన్ని చూస్తూ బతకాలి. టైమ్ వచ్చినప్పుడు గడియారాన్ని చూడకుండానే పోవాలి. సృష్టి గడియారానికి, జీవ గడియారానికి, గోడ మీద లేదా చేతి గడియారానికి అంతర్గతంగా లంకె ఉంటుంది. పగలు పనిచేయాలి. రాత్రి పడుకోవాలి. ఇది సృష్టి ధర్మం. మనమిప్పుడు పగలు పడుకుని రాత్రిళ్లు జడలు విప్పి నర్తిస్తున్నాం. ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆఫీసు వేళలు, ఇతర రోజువారీ కార్యక్రమాలు, సమస్త దైనందిన జీవితం ఈ జీవ గడియారం పరిధిలోనే ఉంటుంది. ఉండాలి. కాలం కొమ్మకు చిగురించిన యుగాలెన్నో? కుసుమించిన పుష్పాలెన్నో? కాచి.. పండి.. రాలిపోయిన పళ్లెన్నో? చీకటి దుప్పటి కప్పుకుని రెప్పవేసిన రాత్రులెన్నో? వెలుగుపూల రేకులు విచ్చిన వేకువ లెన్నో? వాలిపోయిన పొద్దుల్లో వర్ణాల సుద్దులెన్నో? రాలిపోయిన కాలం ఆకుల మాటున వినిపించే జ్ఞాపకాలెన్నో? రానున్న కాలం ఇవ్వనున్న అనుభవాలెన్నెన్నో? అందుకే సినీకవి అన్నట్టే మనం పాడుకోవాలి. అన్నట్టు మొన్నటి వరకు ఎండలు కాసినా, కొత్త ఏడాది సందర్భంగా ఈరోజు తెలి మంచు 11 వరకు కనిపించింది. అందుకే తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ! ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ!? నీ దోవ పొడవునా కువకువల స్వాగతము.. నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము. ఈ పూల రాగాల పులకింత గమకాలు.. గారాబు కవనాల గాలి సంగతులు.. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు.. పల్లవించును ప్రభూ పవళించు భువనాలు భానుమూర్తీ! నీ ప్రాణకీర్తన విని.. పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ.. పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని. భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు.. నీ రాజసానికవి నీరాజనాలు.. పసరు పవనాలలో.. పసికూన రాగాలు.. పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు.. తలయూచు.. తలిరాకు బహుపరాకులు విని దొరలనీ.. దోర నగవు దొంతరనీ.. తరలనీ దారి తొలగి రాతిరిని.
గతం గాయలెన్ని ఉన్నా.. రేపటి ఆశల వెలుగులు ఆ గాయాలను మాయం చేస్తూనే ఉంటాయి. రోజూ రాత్రి పడ్డ చీకటి తెర తొలగి.. పొద్దుటికి వెలుగు పూల వసంతం వస్తూనే ఉంటుంది. తెలి మంచు కరిగే వేళలో.. ఇలగొంతు వొణికే వేళలో.. లోకం తలుపు తెరిచి.. సూర్యుడిని పిలిచి బొట్టు పెట్టి.. ఏ రోజుకారోజు నవనవోన్మేష నవోదయ కావ్యాలు, కార్యాలు రచించాలి. తొలిపొద్దు కిరణాలు భూమిని తాకేవేళ పక్షుల కువకువల స్వాగతాల వందనం. సూర్యుడి కాలి అలికిడికి మన మెలకువే వందనం. సూర్యుడి రాకకు పూల పులకింత గమకాలు. గాలికి పూసిన గంధాలు. లోక దైనందిన కావ్యంలో కొత్త పేజీ రాయడానికి ఉత్ప్రేరకాలు. కిరణజన్య సంయోగ క్రియతో పత్రహరితప్రాణం నింపుకోవడానికి, ఒంపుకోవడానికి బంగారు కిరణాలు. జగతి ప్రతినిత్యం చైతన్యం నింపుకోవడానికి పొంగారు కిరణాలు. 2024 గతం రాత్రి దారి తొలగి.. 2025 భవిష్యత్ వెలుగులకు దారి ఇచ్చే ఉషోదయ వేళ.. నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
Comments