క్లీన్ కొల్లేరు సాధ్యమేనా?
- DV RAMANA
- Sep 13, 2024
- 2 min read

విజయవాడ మునకకు బుడమేరు పోటెత్తడం కారణం. బుడమేరు పోటెత్తడానికి కొల్లేరు కారణం. బుడమేరు కు వరద వచ్చినప్పుడు ఆ వరద చాలావరకు కొల్లేరు సరస్సులో కలుస్తుంటుంది. కానీ అదే పూర్తిగా ఆక్రమణ లతో ముఖద్వారం మూసుకుపోయి బుడమేరు వరదను తనలోకి తీసుకోలేకపోవడం వల్లే బుడమేరు విజయ వాడపైకి దండెత్తింది. దాంతో కొల్లేరు ఆక్రమణలు అనే చాలా పాత సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. వరద పరిస్థితి చాలావరకు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం వరదలకు కారణమైన అంశాలపై దృష్టి సారిస్తోంది. కొల్లేరులో ఆక్రమణలను పూర్తిగా తొలగించి పూర్వపు స్వరూపం సంతరింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్ర బాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రకటించారు. దానికి తొందరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామంటు న్నారు. కానీ గత అనుభవాలను పరిశీలిస్తే కొల్లేరును ఆక్రమణల నుంచి రక్షించడం అంత సులభం కాదని అర్థమవుతుంది. దీనికి ప్రధాన అవరోధం రాజకీయాలే. ఎందుకంటే కొల్లేరును ఆక్రమించి ఎడాపెడా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేసి కోట్లు ఆర్జిస్తున్నవారిలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన చిన్నా పెద్దా రాజకీయ నేతలు, వారి బంధుగణం, అనుచరగణాలే. ఈ కారణంతోనే గతంలో ప్రభుత్వం చేపట్టిన క్లీన్ కొల్లేరు ఆపరేషన్లు మట్టికొట్టుకుపోయాయి. ఆక్రమణలు మాత్రం పెరిగిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటిగా పేరొందిన కొల్లేరు రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. సుమారు 245 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సరస్సు కు ఆక్రమణలే పెద్ద శాపంగా పరిణమించాయి. వీటిని తొలగించి కొల్లేరును కాపాడతామని అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ చెప్పే మాటే. కానీ దశాబ్దాలుగా అది కార్యరూపం దాల్చడంలేదు. తాజాగా విజయవాడ వరదల నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొల్లేరును క్లీన్ చేస్తామని చెబుతోంది. ఒక్కసారి గతంలోకి వెళితే ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గతంలో కూడా ఇదే మాట చెప్పారు. కానీ ఏమీ చేయలేకపోయారు. 1999లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కొల్లేరు ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక జీవో జారీ చేసింది. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొల్లేరు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలనుకున్నారు. 2006లో వైఎస్ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ మేరకు కొల్లేరును ఆక్రమించి నిర్మించిన ఆక్వా చెరువులను బ్లాస్టింగ్ ద్వారా ధ్వంసం చేశారు. దాంతో ఆక్రమణదారులు సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ యత్నాలను న్యాయపరంగా అడ్డుకున్నారు. అంతే.. అప్పటినుంచీ ప్రభుత్వం కొల్లేరు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోయి సరస్సు స్వరూపాన్ని మార్చేశాయి. మరోవైపు గత ప్రభుత్వం కొల్లేరు భూముల్లోనే పలువురికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా కొల్లేరు చిక్కిశల్యమైపోయింది. ఇతర వాగులు, వంకల నుంచి వచ్చే వరద నీటిని తనలోకి తీసుకునే శక్తిని కోల్పోయింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని 12 మండలాలకు చెందిన 120కిపైగా గ్రామాలకు కొల్లేరే జీవనాధారం. 1970 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం కొల్లేరులో చేపలు, రొయ్యల పెంపకానికి అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయం పరిసర గ్రామాల్లోని లక్షలాది మందికి ఉపాధి కల్పించినా.. మరోవైపు కొల్లేరుపై ఆక్రమణదారుల దాడికి కారణమైంది. కాలక్రమంలో ఆక్వా పరిశ్రమ నష్టాల పాలైనా చేపల పెంపకం ద్వారా మాత్రం ఇక్కడివారికి మంచి ఆదాయమే లభిస్తోంది. కొల్లేరు ప్రాంతవాసులు సొసైటీలుగా ఏర్పడి చేపల వేట, విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు. అదే సమయంలో అంగ, అర్థబలం ఉన్నవారు, రాజకీయ నాయకులు, వారి బంధుగణాలు, అనుచరవర్గాల దృష్టి కొల్లేరుపై పడిరది. కొల్లేరు ద్వారా వస్తున్న ఆదాయం చూసి ఆదో బంగారు బాతులా కనిపించింది. అయితే దాని ఆదాయాన్ని క్రమంగా కాకుండా ఒకేసారి కొల్లగొట్టేయాలన్న అత్యాశతో ఏకంగా కొల్లేరు విధ్వంసానికి పాల్పడటం ప్రారంభించారు. చాలామంది కొల్లేరు గర్భాన్ని, ముఖద్వారాన్ని ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వించి కొల్లేరు సహజ త్వాన్ని దెబ్బతీశారు. వీటి ద్వారా కోట్లలో వ్యాపారాలు చేస్తుంటే కొల్లేరు రూపరేఖలు మారిపోవడం ప్రారంభ మైంది. మరోవైపు కొల్లేరు తీరప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అక్రమాలు పెచ్చరిల్లిపోయాయి. కొల్లేరు తీరాన్ని నలు వైపులా ఆక్రమించి, చదునుచేసి ప్లాట్లు వేసి విక్రయించడం ద్వారా రెండు జిల్లాల్లో చాలామంది రెండు చేతులా సంపాదించి కోట్లకు పడగలెత్తారు. ఇది ఎంతగా హద్దుమీరిందంటే.. సరస్సులోకి ఇతర వాగులు, వంకల నీరు ప్రవేశించే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. దాంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరంతా కొల్లేరులో వెళ్లలేక చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తుతోంది. ఆ క్రమంలోనే ఊహించనంతగా వచ్చిన బుడమేరు వరద కొల్లేరులోకి ప్రవహించలేక విజయవాడపై దండెత్తి లక్షలాది మందిని నిలువ నీడ లేకుండా చేసింది. ఈ అనుభవంతో కళ్లు తెరిచిన చంద్రబాబు ప్రభుత్వం క్లీన్ కొల్లేరు కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. అయితే ఈ విషయంలో గతంలో స్వయంగా చేదు ఫలితాలు రుచి చూసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఈసారైనా రాజకీయ, ఇతరత్రా ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆక్రమణ అంతు చూస్తే తప్ప కొల్లేరుకు పూర్వ వైభవం సాధ్యం కాదు.
Comentários