top of page

కిష్కింధపురి.. థ్రిల్లింగ్‌ అండ్‌ చిల్లింగ్‌

  • Guest Writer
  • Sep 15
  • 3 min read
ree

రాక్షసుడు తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఇటీవల ‘భైరవం’ ఎదురు దెబ్బ తిన్నాడు. అతను తొలిసారిగా హార్రర్‌ నేపథ్యంలో చేసిన ‘కిష్కింధపురి’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్‌ పెగళ్ళపాటి రూపొందించిన ఈ చిత్రం.. ప్రోమోలతో ఆకట్టుకుంది. మరి సినిమా కూడా మెప్పించిందా? శ్రీనివాస్‌ కు మంచి విజయాన్నందించిందా? తెలుసుకుందాం పదండి.

కథ:

కిష్కింధపురి అనే ఊరిలో అనే ఊరిలో ప్రేమికులైన రాఘవ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌).. మైథిలి (అనుపమ పరమేశ్వరన్‌).. దయ్యాల పట్ల ఆసక్తి ఉన్న వారిని హాంటెడ్‌ హౌస్‌ లకు తీసుకెళ్లి ఘోస్ట్‌ వాకింగ్‌ టూర్లు నిర్వహిస్తుంటారు. ముందే సిద్ధం చేసుకున్న సెటప్‌ లతో తమ క్లైంట్లను థ్రిల్‌ చేస్తుంటారు. ఐతే ఒక సందర్భంలో సువర్ణమాయ అనే మూతపడ్డ రైల్వే స్టేషన్‌ కు ఒక టీంను తీసుకెళ్లిన ఈ జంటకు అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడికి వెటళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దానికి కారణం అక్కడున్న విశ్రవ పుత్ర (శాండీ) అనే దయ్యం అని తెలుస్తుంది. ఇంతకీ ఆ విశ్రవ పుత్ర కథేంటి.. తనెందుకు దయ్యంగా మారాడు.. మరి ఆ దయ్యం ఆట కట్టించడం రాఘవ్‌-మైథిలిలకు సాధ్యమైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హార్రర్‌ థ్రిల్లర్స్‌ అనగానే ఒక ఫార్మాట్‌ ఉంటుంది. ఒక బృందం.. దయ్యాల పట్ల ఆసక్తితోనో లేదంటే ఏదైనా వేరే పని మీదో ఒక హాంటెడ్‌ హౌస్‌ కు వెళ్తారు. అక్కడ నిద్ర పోతున్న దయ్యాన్ని రెచ్చగొట్టి లేపుతారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ బృందంలో ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అప్పుడు ఆ టీంలోని మిగతా వాళ్లు ఆరాలు తీయడం మొదలుపెడితే దయ్యం కథ తెలుస్తుంది. ఆ తర్వాత అష్టకష్టాలు పడి ఆ దయ్యానికి అడ్డు కట్ట వేసి అక్కడ్నుంచి బయటపడతారు. చాలా వరకు ఈ లైన్లోనే ఈ కథలు సాగుతుంటాయి. ఇక్కడ దయ్యం వెనుక నేపథ్యం ఎంత కొత్తగా రాసుకున్నారు.. కథలో ట్విస్టులు ఎంత బాగా పేలాయి.. ప్రేక్షకులను ఎంతగా ఆశ్చర్యపరిచారు అన్న దాన్ని బట్టి ఆ కథ సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. ఈ మూడు విషయాల్లోనూ ‘కిష్కింధపురి’కి మంచి మార్కులే పడతాయి. దయ్యం బ్యాక్‌ స్టోరీ సినిమాలో అతి పెద్ద హైలైట్‌. దీంతో పాటు ఉత్కంఠ రేపే కథనం.. కొన్ని మలుపులు కూడా తోడవడంతో ‘కిష్కింధపురి’ థ్రిల్లింగా మారింది. కొన్ని లోపాలున్నప్పటికీ.. అక్కడక్కడా లాజిక్స్‌ కొండెక్కేసినప్పటికీ... ఒక హార్రర్‌ థ్రిల్లర్‌ నుంచి ఆశించే అంశాలకు ఇందులో లోటు లేదు.

హార్రర్‌ థ్రిల్లర్స్‌ లో కొన్ని సినిమాలు పూర్తిగా భయపెట్టడం.. థ్రిల్‌ చేయడం మీద దృష్టిసారిస్తాయి. కొన్ని చిత్రాలు దీన్నుంచి నవ్వులు పంచే ప్రయత్నమూ చేస్తుంటాయి. ‘కిష్కింధపురి’ పూర్తిగా మొదటి కోవలోనే సాగుతుంది. ఏమాత్రం డీవియేషన్‌ లేకుండా పూర్తిగా ప్రేక్షకులను భయపెట్టడం.. థ్రిల్‌ చేయడం మీదే ఈ సినిమా ఫోకస్‌ చేసింది. ఆరంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉండడం వల్ల కథ ఊపందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పైగా హార్రర్‌ చిత్రాల రొటీన్‌ ఫార్మాట్‌ నే ఇది అనుసరించడంతో ఒక దశ వరకు మామూలుగానే అనిపిస్తుంది. హార్రర్‌ సినిమాల్లో ఎక్కువగా ఆడ దయ్యాలనే చూస్తాం. ఇది కూడా ఆ బాపతులాగే అనిపిస్తుంది. కానీ ప్రేక్షకుల అంచనాకు భిన్నమైన తెరపైకి రావడం ‘కిష్కింధపురి’లో తొలి మలుపు. తమిళ డ్యాన్స్‌ మాస్టర్‌ శాండీని ఆ పాత్రకు ఎంచుకోవడం.. తన అవతారం.. స్క్రీన్‌ ప్రెజెన్స్‌.. అన్నీ కూడా ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. ఆ పాత్ర ప్రవేశం నుంచి కథనం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అక్కడ్నుంచి చివరి వరకు కిష్కింధపురిలో థ్రిల్స్‌ కు లోటు ఉండదు.

ముందే అన్నట్లు ‘కిష్కింధపురి’లో దయ్యం బ్యాక్‌ స్టోరీనే అతి పెద్ద హైలైట్‌. ఇందులో దయ్యం కంటే.. శాండీ పాత్ర దయ్యంగా మారడానికి ముందు దాన్ని ప్రెజెంట్‌ చేసిన తీరే ప్రేక్షకులను ఎక్కువగా భయపడుతుంది. దాదాపు అరగంట సాగే ఆ ఎపిసోడ్‌ ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. రేడియో స్టేషన్‌ నేపథ్యం కూడా కొత్తగా అనిపించి ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ ముగిసి వర్తమానంలోకి వచ్చాక కూడా కథనం మంచి ఊపుతోనే సాగుతుంది. ఐతే హాంటెడ్‌ హౌస్‌ కు వెళ్లిన బృందంలో ముగ్గురు చనిపోయాక.. మిగతా వాళ్ల వ్యవహారం పూర్తిగా వ్యవహారం పక్కకు వెళ్లిపోయి ఫోకస్‌ అంతా హీరో హీరోయిన్ల మీదికి వెళ్లిపోవడంతో కొంచెం థ్రిల్‌ తగ్గింది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్‌ మిస్సయ్యాయి. పకడ్బందీ బ్యాక్‌ స్టోరీ తర్వాత దయ్యం పాత్ర ఊహించుకున్నంత బలంగా కనిపించదు. కానీ ‘కిష్కింధపురి’లో ఏ దశలోనూ కథనం నెమ్మదించదు. సన్నివేశాలు రయ్యిన పరిగెడుతూనే ఉంటాయి. చివరి వరకు ట్విస్టులు కొనసాగడం.. థ్రిల్స్‌ కు లోటు లేకపోవడం.. భారీతనంతో కూడిన క్లైమాక్స్‌ ప్రేక్షకులను ఎంగేజ్‌ చేస్తాయి. ఇది పర్ఫెక్ట్‌ హార్రర్‌ థ్రిల్లర్‌ అని చెప్పలేం కానీ.. రెండు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి థ్రిల్‌ చేయడంలో ‘కిష్కింధపురి’ విజయవంతమైంది.

నటీనటులు-పెర్ఫార్మెన్స్‌:

బెల్లంకొండ శ్రీనివాస్‌ తన కెరీర్లో తొలి హార్రర్‌ థ్రిల్లర్లో మెప్పించాడు. ప్రథమార్ధం వరకు అతడి పాత్ర.. నటన మామూలుగానే అనిపిస్తాయి. కానీ ద్వితీయార్ధంలో కీలక సన్నివేశాల్లో అతను ఆకట్టుకున్నాడు. దయ్యం తనలోకి ఆవహించాక వచ్చే సన్నివేశాల్లో శ్రీనివాస్‌ నటన హైలైట్‌. తన ఆహార్యం ఈ పాత్రకు బాగా కుదిరింది. అనుపమ పరమేశ్వరన్‌ కు కూడా బాగా పెర్ఫామ్‌ చేసే స్కోప్‌ దొరికింది. దయ్యం ఆవహించినపుడు ఆమె నటన భయపెడుతుంది. ఐతే సినిమాలో బెస్ట్‌ పెర్ఫామర్‌ మాత్రం శాండీనే. అతణ్ని చూస్తే ప్రేక్షకులు వణికిపోయేలా నటించాడు. తన గెటప్‌ కూడా భలేగా కుదిరింది. ఇదొక భిన్నమైన హార్రర్‌ థ్రిల్లర్‌ గా మారడంలో తన పాత్రే కీలకం. సహాయ పాత్రల్లో సుదర్శన్‌.. హైపర్‌ ఆది ఓకే అనిపించారు. చిన్న పాత్రలో తనికెళ్ల భరణి ఆకట్టుకున్నారు. ప్రేమ.. శ్రీకాంత్‌ అయ్యంగార్‌.. భద్రమ్‌.. మకరంద్‌ దేశ్‌ పాండే.. వారి వారి పాత్రల్లో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం- పనితీరు :

హార్రర్‌ సినిమాల్లో సాంకేతిక విభాగాల పనితీరు ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ విషయంలో ‘కిష్కింధపురి’ టెక్నీషియన్స్‌ అందరూ మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చారు. కెమెరామన్‌ చిన్మయ్‌ సలాస్కర్‌ విజువల్స్‌ చాలా బాగున్నాయి. ఆర్ట్‌ వర్క్‌ కూడా బాగా చేశారు. ఇక సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. తొలి పాట సినిమాలో అనవసరం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. హార్రర్‌ సినిమాలకు అవసరమైన సెటప్‌ అంతా బాగా కుదిరింది. ఇక దర్శకుడు కౌశిక్‌ పెగళ్ళపాటి.. రైటింగ్‌ దగ్గరే మార్కులు కొట్టేశాడు. రేడియో స్టేషన్‌ నేపథ్యంలో దయ్యం కథను బలంగా.. కొంచెం కొత్తగా రాసుకున్నాడు. ఆ కథ వరకు టేకింగ్‌ కూడా బాగుంది. అతను కొంచెం లాజిక్కుల మీద దృష్టిపెట్టాల్సింది. ఆరంభ సన్నివేశాలను ఇంకొంచెం మెరుగ్గా.. భిన్నంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ఓవరాల్‌ గా తన పనితనానికి మంచి మార్కులే పడతాయి.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page