(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుత వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు 2019`24 మధ్య పీఏగా పని చేసిన గొండు మురళీ నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బుడితి పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గొండు మురళీ నివాసముంటున్న దంత గ్రామంలో ఆయన ఇంటితో పాటు ఆయన స్వగ్రామం జలుమూరు మండలం లింగన్నాయుడుపేట, విశాఖపట్నంలో వీరి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఇళ్లలోను, సారవకోట మండలంలో బంధువుల ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నాటికి ఇవి పూర్తికాలేదు. ఇంటిలో దొరికిన నగదు, వెండి, బంగారం తప్ప స్థిరాస్తుల వివరాలు ఇంకా తేలలేదు. వైకాపా ప్రభుత్వంలో పీఏగా వ్యవహరించిన సమయంలో మురళీ కొనుగోలు చేసిన ఆస్తులపైనే ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, మురళీ అన్నయ్య దుబాయ్‌లో ఓ ఆయిల్ కంపెనీలో ఇంజినీర్‌గా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం కావడంతో అక్కడి నుంచి వచ్చిన సొమ్ములతో గతంలో మురళీ కొన్ని ఆస్తులు కొనుగోలు చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల లెక్కల్లో లేని ప్రతీ ఆస్తిని ఏసీబీ పరిగణలోకి తీసుకుంటుంది.
Comments