‘కృష్ణా’.. నీవే దిక్కు!
- NVS PRASAD
- Oct 10, 2024
- 3 min read
విధేయత, సమర్ధతకు పట్టం
శ్రేణులను సమీకరిస్తారన్న నమ్మకం
దూకుడు, తెగింపుల సమ్మిళితం
జిల్లా వైకాపా అధ్యక్షుడుగా బాధ్యతలు ఎత్తుకున్న దాస్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘అజాతశత్రువుగా పేరు తెచ్చుకోవడం కోసం కనీసం యుద్ధం చేయకుండానే కురుక్షేత్రంలో తన తమ్ముళ్ల ద్వారా గెలిచి రాజ్యాధికారాన్ని మాత్రం చేపట్టాడు ధర్మరాజు’’ అని మహాభారతంలో ధర్మరాజు పాత్రను విమర్శకులు చూపించిన కోణమిది. అయితే ఇక్కడ మర్చిపోయిన లాజిక్కేమిటంటే.. ధర్మరాజు అనేవాడే లేకపోతే భారతంలో భీష్ముడు, ద్రోణుడు లాంటి మహా యోధులు నేలకు ఒరిగివుండేవారు కాదు. వారిద్దరూ రణక్షేత్రంలో ఉంటే పాండవులకు విజయం దక్కివుండేది కాదు.

శ్రీకాకుళం జిల్లా వైకాపా రాజకీయాల్లో ధర్మరాజు లాంటి ధర్మాన కృష్ణదాస్ నాయకత్వాన్నే జిల్లాకు ఆ పార్టీ అధినేత ఎందుకు ఎంచుకున్నారో చెప్పడానికి మహాభారతం ఉదాహరణ. అధికారంలో లేనప్పుడు పార్టీని కష్టనష్టాలకు ఓర్చి నడిపించే గుణం కలిగిన నాయకుడు ఇప్పుడు వైకాపాకు అవసరం. అవసరానికి మించిన దూకుడు, తాబేలు లాంటి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సిద్ధాంతాన్ని పాటించే నాయకుడు ఇప్పుడు వైకాపాకు సరిపోరు. ఈ రెండిరటి మేళవింపులో ఒక నాయకత్వం అవసరం. అందుకే మరోసారి వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కృష్ణదాస్ వైపే జగన్ మొగ్గుచూపారు. ఒకానొక సమయంలో జిల్లాలో కాళింగ సామాజికవర్గాన్ని అధికార టీడీపీ విస్మరించిందని, ఇప్పుడు తమ పార్టీ అదే సామాజికవర్గానికి చెందిన నాయకుడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచన జగన్మోహన్‌రెడ్డికి వచ్చింది. కాకపోతే 2019 నుంచి 2024 వరకు జిల్లాలో కాళింగులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసుకున్నారు. మరో యాంగిల్‌లో పలాస మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజును జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని చేయాలని చూశారు. ఇందులో మొదటిది కులం కోణమైతే, రెండోది విధేయత అంశం. అయితే ఈ రెండూ కలగలిపి ఉన్న నేతయితే జిల్లాలో జూనియర్లను, సీనియర్లను ఒకే తాటిమీదకు తీసుకొస్తారని జగన్మోహన్‌రెడ్డి భావించారు. అందుకే ధర్మాన కృష్ణదాస్ వైపే మొగ్గు చూపారు. పనిలో పనిగా కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు పార్లమెంటరీ ఇన్‌ఛార్జిగా, సీదిరి అప్పలరాజుకు రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. ఇందులో కొత్త, విచిత్రం లేకపోవచ్చు. కానీ ఇది భావోద్వేగానికి, విశ్వాసానికి వేసిన పీట కాదు. నిజంగా వైకాపాను నడపడానికి ఈ జిల్లాలో ఈ ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు కీలకమే. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగానో, లేదంటే మరో పదవిలోనో ఫెయిలైవుండొచ్చు గానీ, ప్రతిపక్షంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి సీతారామ్ లాంటి గళమున్న నేత, ఉద్యమాలకు రోడ్డెక్కడానికి అప్పలరాజు లాంటి దూకుడున్న నాయకుడు అవసరం. అదే సమయంలో వీరికి మద్దతు తెలపడానికి, శ్రేణులను కూడగట్టడానికి కృష్ణదాస్ లాంటి సౌమ్యుడు, ఎవ్వర్నీ నొప్పించనివాడు, అన్నింటికీ మించి తన స్టేచర్ ఇదీ అని అంతకు మించి కిందకు దిగనని పట్టు పట్టనివాడు ఇప్పుడు ఆ పార్టీకి అవసరం. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడదే పని చేశారు. జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన తర్వాత జిల్లా నుంచి మొదట వెళ్లిన నేత కృష్ణదాసే. అందుకే ఆయన 2019లో ప్రభుత్వం రాగానే ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టగలిగారు. కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2024లో పార్టీ గెలుపునకు బాటలు వేయలేకపోయారు. ఇందుకు అనేక కారణాలు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉన్న కారణాలే. స్వతహాగా జగన్మోహన్‌రెడ్డి ఒక మాట చెబితే, దానిని ఎస్ అనడం తప్ప, నో అనలేని కృష్ణదాస్ శైలి గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేల గెలుపునకు దోహదపడలేదు. కానీ ఇప్పుడిప్పుడే కృష్ణదాస్ జిల్లాపై తనకున్న పట్టును, తనకున్న పార్టీ ఇంట్రస్ట్‌ను జగన్మోహన్‌రెడ్డి ముందు పెడుతున్నారు. తన వీరభక్తుడు దువ్వాడ శ్రీనివాస్‌ను తప్పించి పేరాడ తిలక్‌కు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా జగన్మోహన్‌రెడ్డి నియమించారంటే అందుకు కారణం కృష్ణదాస్ కోరడమే. 2024లో పార్టీ ఓటమిపాలైన తర్వాత కార్యకర్తలు చెల్లాచెదురైపోయారు. లక్కీగా ఇక్కడ ఎక్కువ శాతం మున్సిపాలిటీలకు పాలకవర్గం లేదు కాబట్టి పార్టీ ఫిరాయింపులు అధికారికంగా లెక్కలోకి రావడంలేదు. ఇక జిల్లాపరిషత్ ఉందీ అంటే కేవలం ఒక్క జెడ్పీటీసీయే టీడీపీకి ఉండటం వల్ల మిగిలినవారందరికీ పచ్చ కండువా కప్పడం సాధ్యంకాదు కనుక జిల్లాలో వైకాపా ఇంకా అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయికి వెళితే.. ఎంత డొల్ల ఉందో అర్థమవుతుంది. 2029 వరకు ప్రతిపక్షంగా పార్టీని నడపడానికి సర్వశక్తులూ ఒడ్డాలి. అన్నింటికీ మించి డబ్బులు తీయాలి. కేసులకు వెరవకూడదు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. ఇవన్నీ జరగాలంటే నాయకుడనేవాడు నేరుగా కార్యకర్తకు టచ్‌లో ఉండాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లు అనేక కారణాల వల్ల కేడర్‌కు, లీడర్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు కృష్ణమాయ చేసైనా 40 శాతం ఉన్న ఓటుబ్యాంకును కాపాడుకోవాలి. గురువారం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న కృష్ణదాస్ ముందు సవాళ్లు లేవా అంటే, కోకొల్లలు ఉన్నాయి. వాటిని అధిగమించడంలోనే కృష్ణదాస్ నేర్పరితనం బయటపడుతుంది. ధర్మాన ప్రసాదరావు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదగగలిగారు. ఇప్పుడు కృష్ణదాస్‌కు ఇది బంగారు అవకాశం. పదవిలో ఉన్నట్టు కేన్వాయ్‌లు, ప్రోటోకాల్‌లు, పోలీస్ సెల్యూట్‌లు ఉండకపోవచ్చు. కానీ ఈ ఐదేళ్లు బలంగా పని చేయగలిగితే రాష్ట్రంలో ధర్మాన అంటే కృష్ణదాస్ కూడా అన్న పేరు వస్తోంది. కృష్ణదాస్ రెవెన్యూ మంత్రి అయిన తొలినాళ్లలో అప్పటి తూర్పుగోదావరి జిల్లాలో ఒక శంకుస్థాపన శిలాఫలకంపై ధర్మాన కృష్ణదాస్ పేరు బదులు ధర్మాన ప్రసాదరావు అని చెక్కేశారు. ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత కూడా దీన్ని తెలుసుకోలేకపోయారు. అంటే ధర్మాన అని గూగుల్‌లో వెతికితే ప్రసాదరావు పేరే మొదటిగా వస్తోంది. ఇప్పుడు కృష్ణదాస్ కూడా రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకోడానికి ఇది మంచి అవకాశం. అయితే ఇప్పుడు ఆయన ముందున్న మొదటి సవాల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తమ్ముడు, మాజీమంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావును యాక్టివ్ చేయడం. సాధారణంగా కృష్ణదాస్ మంత్రిగా ఉండి, ప్రసాదరావు మంత్రి కాకపోయినా ఆయన మైండ్‌సెట్‌తోనే ఉంటారన్న ప్రచారం ఉంది. అందుకు ఉదాహరణలూ ఉన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించిన తర్వాత ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని, అదే సమయంలో జిల్లా నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి కొందరి పేర్లు సూచించాలని ధర్మాన ప్రసాదరావును అడగడానికి ఐదు రోజుల క్రితం కృష్ణదాస్, పేరాడ తిలక్, డాక్టర్ అప్పలరాజు ఆయన బంగ్లాకు వచ్చారు. ఆయన సూచించిన పేర్లు తీసుకొని పార్టీ అధిష్టానానికి పంపించారు. ప్రసాదరావు మైండ్‌సెట్‌తోనే కృష్ణదాస్ ఉంటారనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు ఆయన తమ్ముడ్ని యాక్టివేట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. అప్పలరాజు వరకు రాజకీయాల్లో జూనియరే కావచ్చు. కానీ ఇక్కడ ప్రజాబలం ఉన్న నాయకుడు. ఆ ప్రాంతాన్ని అప్పలరాజుకు రాసిస్తారా? ఆమదాలవలస ఏరియాను సీతారాం చేతిలో పెడతారా? అన్న విషయాన్ని పక్కన పెడితే, గతంలో పదవుల్లో ఉన్నప్పుడు దూరమైన నాయకులను, కేడర్‌ను దగ్గరకు తీసుకోగలగాలి. వంశధార నుంచి 670 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించే ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన వైకాపా తరఫున అక్కడి ప్రజలను కూడగట్టగలగాలి. అవసరమున్నా, లేకపోయినా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో బాధితులకు అండగా ఉన్నామన్న భరోసాను ఇవ్వగలగాలి. ఎన్నికలకు దూరమైపోయిన మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కగలగాలి. అధినాయకుడి మొహం చూసే మళ్లీ ఓట్లేస్తారనుకొని స్థానిక నాయకత్వాన్ని వదిలేయకుండా 2014 నుంచి 2019 వరకు పని చేసినవారిని కూడదీయాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూమంత్రిగా పని చేసిన ధర్మాన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం మున్సిపాలిటీలో అప్పటి అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య రచ్చ జరిగినప్పుడు, దాన్ని చక్కదిద్దే పని కృష్ణదాసే చేపట్టారు. పార్టీలో గాని, బయట గాని తనకో వ్యక్తి నచ్చకపోతే వారిని దూరంగా పెట్టడం, మొహం చిట్లించుకోవడం వంటివి చేయడం కృష్ణదాస్‌కు తెలియదు. అందుకే దాస్ అందరివాడని గుర్తింపు తెచ్చుకోగలిగారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దారిన పోయే దానయ్యలను పిలిచి పదవులు ఇప్పించారు. ఇప్పుడు జిల్లా పార్టీలో మిగిలిన పోర్టుఫోలియోలు సమర్ధులతో నింపగలిగితే వైకాపా ప్రతిపక్షంగా నిలదొక్కుకోగలదు.
Comentários