
దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. సరిహద్దు రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌తోపాటు హర్యానా ఎన్నిక లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వాస్తవానికి కశ్మీర్, హర్యానాలతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢల్లీి అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఓటర్ల జాబితా తుది పరిశీలన పూర్తి కాకపోవడం, ఎన్నికల సిబ్బంది సర్దుబాటు వంటి సమస్యలతో మొదట రెండు రాష్ట్రాలకు.. ఆ తర్వాత మిగిలిన మూడు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడిరచారు. కల్లోలిత కశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటి తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా సుమారు 87లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కశ్మీర్‌కు పదేళ్ల తర్వాత.. మరీ ముఖ్యంగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. ఇవే ఎన్నికలు కేంద్రం లోని ఎన్డీయే సర్కారును టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. అందుకే పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం నానా విన్యాసాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ సర్కారు రద్దు చేసింది. దాంతోపాటే మొత్తం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి జమ్ముకశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ ఢల్లీి, పాండిచేరిల మాదిరి గా అసెంబ్లీ ఉంటుందని ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కశ్మీర్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకే బీజేపీ ఈ పన్నాగం పన్నిందని ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు కాంగ్రెస్ విమర్శించాయి. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వ హించకుండా పెత్తనం చెలాయించడమే దాని వ్యూహమని ఆరోపించాయి. అయితే రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని అణిచివేసి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఈ చర్యలు తీసుకున్నామని కేంద్రం సమర్థించుకుంది. ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ, కశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణ సందర్భంగా కశ్మీర్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికల నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. దానిపై స్పందించిన సర్వో న్నత న్యాయస్థానం సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించింది. అందువల్ల ఇప్పుడు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. కేంద్రం చెప్పినట్లు ఆర్టికల్ 370 రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత కొన్నాళ్లు ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కనిపించింది. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఇటీవలి కాలంలో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు మళ్లీ పెచ్చరిల్లాయి. ఉగ్రవాదులు మన జవాన్లనే టార్గెట్ చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. ప్రతిగా సైన్యం, పారామిలటరీ దళాలు కూడా ఎదురుదాడులు చేస్తుండటంతో రాష్ట్రం మొత్తం హింసతో రగలిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కత్తి మీద సాములాంటిదే. కాగా ఎన్నికల ముంగిట కేంద్రం ఆ రాష్ట్రంలోని 200 మందికిపైగా ఐపీఎస్, ఐఏఎస్‌లతో పాటు కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేయడం సంచలనంగా మారింది. కశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పోలీసు, పౌర పాలన వ్యవస్థలు కేంద్ర హోంశాఖ చేతిలోనే ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే పాలన వ్యవహా రాలు పర్యవేక్షిస్తుంటుంది. కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు.. అది కూడా దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో కేంద్ర హోంశాఖ కశ్మీర్‌కు చెందిన దాదాపు మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒక్క కలంపోటుతో బదిలీ చేయడం విమర్శలపాలైంది. ఎన్నికల ముందు పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకునేందుకే కేంద్రం ఈ చర్యకు పాల్పడిరదని నేషనల్ కాన్ఫ రెన్స్ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఆయన ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఎన్నికలు కేంద్రంలోని మోదీ సర్కారుకు మరో పరీక్షగా మారాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించి, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టామని ప్రచారం చేసుకుంటోంది. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ఈ విషయంలో ప్రజల మనోగతం ఎలా ఉందన్నది వారిచ్చే తీర్పుతో స్పష్టం కానుంది. అలాగే దేశస్థాయిలో వరుసగా మూడోసారి మోదీ సర్కారు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినా.. ఆ సంతోషం ఎన్డీయే కూటమిలో పెద్దగా లేదు. ఎందు కంటే దేశాభివృద్ధికి ఎంతో చేశామని చెప్పుకున్నాక కూడా గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే తక్కువగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలు మోదీ సర్కారుకు అత్తెసరు మెజారిటీయే కట్టబెట్టారు. దీనివల్ల వారు చెబుతున్న అభివృద్ధి కంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ అవే సంకేతాలు కనిపించాయి. మొత్తం ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ రెండిరట మాత్రమే గెలిచింది. అందువల్లే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి తీవ్ర సవాలే.
Comments