ఖమేనీ అంతం స్వయంకతం.. సౌదీ ప్రోద్బలం!
- DV RAMANA

- Mar 2
- 3 min read
భద్రతా నియమాలను ఖాతరు చేయని పాలకులు
శత్రువుల నిఘాలో ఉన్న నేతతో బహిరంగ భేటీ
మరోవైపు ట్రంప్‌ను ఎగదోసిని సౌదీ క్రౌన్ ప్రిన్స్
మత, వాణిజ్యపరమైన శత్రుత్వమే కారణం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
తమను సవాల్ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా వేటాడి మట్టుబెట్టాయి. తద్వారా మూడున్నర దశాబ్దాలకుపైగా సాగిన ఖమేనీ శకానికి చరమగీతం పాడాయి. తన కంటిచూపుతో ఇరానియన్లను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఒక మత నాయకుడి పాలన విషాదాంతం కావడం ప్రపంచ రాజకీయాల్లో పెనుసంచలనం సష్టిస్తున్నది. గత కొంతకాలంగా అణు ఒప్పందానికి ముందుకు రావడంలేదన్న సాకుతో అమెరికా, ఇజ్రాయెల్ పాలకులు ఇరాన్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. దాంతో వాటి మధ్య ఉద్రిక్తతలు పెరిగిన పరిస్థితుల్లో యుద్ధం తప్పదని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా యుద్ధానికి దిగడంతోపాటు తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీని, సుమారు 30 మంది టాప్ నాయకులు, సైన్యాధికారులను అమెరికా`ఇజ్రాయెల్ సామూహికంగా అంతం చేశాయి. ఇది నిజంగా విస్మయకర పరిణామమే. ఎందుకంటే.. ఖమేనీ చుట్టూ అత్యంత పటిష్టమైన భద్రతా వలయం ఉంటుంది. ఆయన ఎక్కడున్నారన్నది కూడా ఎవరికీ తెలియనివ్వకుండా టాప్ సీక్రెట్ మెయింటెన్ చేస్తారు. అలాంటప్పుడు ఆయన ఆచూకీ ప్రత్యర్థులకు ఎలా తెలిసింది? ఖమేనీ ఆచూకీని అమెరికన్, ఇజ్రాయెల్ నిఘా సంస్థలైన సీఐఏ, మొస్సాద్ వేగులు కనుగొన్నారని చెబుతున్నా.. దానికంటే కూడా ఖమేనీ, ఆయన అధికారులు చేసిన తప్పిదాలే వారిని పట్టించి, మట్టికరిపించాయని చెప్పాలి. మరోవైపు ఇజ్రాయెల్‌తోపాటు తోటి ముస్లిం దేశమైన సౌదీ పాలకుడు సైతం ఖమేనీని ఖతం చేసేలా అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టి ఎగదోశారని అంతర్జాతీయ మీడియా సంస్థలు, రక్షణరంగ నిపుణుల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.
తెరవెనుక సూత్రధారి
ఖమేనీ తనకు అత్యంత నమ్మకస్తులైన ఐఆర్జీసీ చీఫ్ మొహమ్మద్ పక్పూర్, సీనియర్ సలహాదారు అలీ షంఖానీలతో అత్యవసర సమావేశంలో ఉన్న సమయంలోనే అమెరికా క్షిపణులు వారున్న భవనంపై విరుచుకుపడ్డాయి. అయితే వారందరూ అక్కడ ఉన్న పక్కా సమాచారం అమెరికాకు ఎలా అందిందనే విషయంలో ఇప్పుడు అన్ని వేళ్లు సౌదీ అరేబియా వైపు చూపిస్తున్నాయి. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనం ప్రకారం సౌదీ అరేబియా ప్రోద్బలంతోనే అమెరికా ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఖమేనీని హతం చేయాలన్న అమెరికా నిర్ణయం వెనుక సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్(కాబోయే రాజు) ఒత్తిడి బాగా పనిచేసిందని ఆ పత్రిక కథనం ప్రకారం తెలిసింది. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ పదేపదే ట్రంప్‌కు ఫోన్ చేసి ఇరాన్‌పై దాడికి ఇదే సరైన సమయమని ఒత్తిడి తెచ్చారు. అలాగే జనవరి నెలలో సౌదీ రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్ రహస్యంగా వాషింగ్లన్కు వెళ్లి ట్రంప్ పేషీ నాయకులు, అధికారంలో భేటీ అయ్యారు. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఖమేనీని అడ్డు తొలగించుకోవడమే మార్గమని అమెరికా అధికారులను ఒప్పించారు. ఖమేనీపై కత్తిగట్టడానికి సౌదీ కారణాలు వేరే ఉన్నాయి. ఇరాన్ మరింత బలపడితే తమ దేశంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసే ప్రమాదముందన్న సౌదీ పాలకుల భయం. ఆ భయంతోనే ఇరాన్ అణుశక్తిగా మారకముందే దెబ్బకొట్టాలనే విధంగా అమెరికా వైపు నుంచి పావులు కదిపిందని సౌదీ వాదించిందని వాషింగ్టన్ పోస్టు అంచనా వేసింది.
మతపరమైన శత్రుత్వం
సౌదీ, ఇరాన్‌ల మధ్య ఘర్షణ, శత్రుత్వానికి మరో కారణం కూడా ఉంది. అదే మతపరమైన ఆధిపత్య పోరు అని విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ అరేబియా సున్నీ ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ షియా ముస్లిం దేశాలకు అండగా నిలుస్తున్నది. యెమెన్, సిరియా, లెబనాన్ దేశాల్లో ఇరాన్ తన బినామీల (హౌతీలు, హిజ్బుల్లా) ద్వారా సౌదీ ప్రయోజనాలను దెబ్బతీస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం పెరిగితే తమ చమురు వాణిజ్యానికి ముప్పు వాటిల్లుతుందని సౌదీ ఎప్పటి నుంచో భయపడుతోంది. 1980 నాటి ఇరాన్-ఇరాక్ యుద్ధం నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ వాదనే నిజమైతే ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు సౌదీ అరేబియాను కూడా తన ప్రధాన శత్రువుగా పరిగణించవచ్చు. ఇది ప్రస్తుత యుద్ధాన్ని మరింత వస్తతపర్చే ప్రమాదముంది.
ఇరాన్ వ్యూహాత్మక తప్పిదాలు
మరోవైపు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య సంచరించే ఖమేనీ అంత వేగంగా ప్రత్యర్థులకు చిక్కి అంతం కావడానికి వారి తప్పిదాలే కారణమని అంటున్నారు. ప్రధానంగా ఐదు తప్పులను విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. అవేంటో చూద్దాం.
ఖమేనీ తన భద్రతా సలహాదారు అలీ షంఖానీని గుడ్డిగా నమ్మడం మొదటి తప్పుగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జూన్‌లో షంఖానీపై దాడి జరిగింది. దాంతోనే శత్రువుల నిఘా ఆయనపై ఉందని అర్థమైంది. అయినా షంఖానీ, ఐఆర్జీసీ చీఫ్ పక్పూర్లతో ఖమేనీ నేరుగా సమావేశం కావడం శత్రువులకు ‘గోల్డెన్ ఛాన్స’ ఇచ్చింది. షంఖానీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్ వేగులు ఆయన ద్వారానే ఖమేనీ ఉన్న లొకేషన్‌ను పక్కాగా గుర్తించగలిగారు.
యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అత్యున్నత స్థాయి నాయకులు భూగర్భ బంకర్లలో ఉండటం కనీస భద్రతా నియమం. కానీ ఖమేనీ తన వ్యక్తిగత భద్రతపై అతివిశ్వాసంతో వ్యవహరించారు. నిరంతరం డ్రోన్ దాడులు జరుగుతున్నా సురక్షిత రహస్య ప్రాంతానికి తరలిపోకుండా బహిరంగ ప్రదేశంలోనే సమావేశాలు నిర్వహించడం శత్రువుల పనిని సులభం చేసింది.
అమెరికా చర్చల ఎత్తుగడను నిజమని నమ్మడం మరో తప్పు. ఈ దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో దాడులు ప్రారంభించరని, తనపై నేరుగా దాడి జరగదన్న ఖమేనీ తప్పుడు అంచనాలే ఆయన్ను ఆంతం చేశాయి. అమెరికా ఒకవైపు చర్చల నాటకం ఆడుతూనే, మరోవైపు ఖమేనీని అంతం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది.
అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా 1990లలో ఖమేనీ జారీ చేసిన ఫత్వా ఇరాన్‌ను రక్షణపరంగా వెనక్కి నెట్టింది. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయదని ఈ ఫత్వా ద్వారా ప్రకటించారు. ఇది పైకి శాంతి మంత్రంలా కనిపించినా.. శత్రుదేశాలు దీన్ని ఇరాన్ బలహీనతగా భావించాయి. అణ్వాయుధాలు లేకపోవడం వల్లే ఇరాన్‌పై నేరుగా దాడి చేసేందుకు అమెరికా సాహసించింది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా-ఇజ్రాయెల్ విధానాలు కఠినతరం అవుతున్నా ఖమేనీ తన పాత భద్రతా నియమాలనే అనుసరించారు. ఆధునిక యుద్ధ సాంకేతికతను, శత్రువుల దూకుడును తప్పుగా అంచనా వేశారు. ఈ వ్యూహాత్మక తప్పిదాలే ఖమేనీ శకాన్ని ముగించాయి. ఇరాన్‌ను మరో చరిత్రాత్మక మలుపు ముంగిట నిలబెట్టాయి.






Comments