top of page

ఖా‘కీచకుడు’

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • మహిళా కానిస్టేబుల్‌కు ఎస్‌ఐ లైంగిక వేధింపులు

  • ఆమదాలవలస ఎస్‌ఐపై ఎస్పీకి ఫిర్యాదు

  • అవినీతిలో ఆరితేరిన చరిత్ర వెంకటేష్‌ది

  • గుట్టుచప్పుడు కాకుండా విచారణ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుశాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న వెంకటేష్‌ అదే స్టేషన్‌లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్‌ పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్టు వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్‌తో ఎస్‌ఐ వెంకటేష్‌ అసభ్యకరంగా ప్రవర్తించడం ఇది రెండోసారి అని తెలిసింది. ప్రస్తుతం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్‌, ఒక మహిళా ఏఎస్‌ఐ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో బాధిత మహిళా కానిస్టేబుల్‌ రెండేళ్ల క్రితం శ్రీకాకుళం మహిళా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించి బదిలీపై ఆమదాలవలసలో పని చేస్తుంది. రోజూ శ్రీకాకుళం నుంచి ఈమె రాకపోకలు సాగిస్తుంది. నాలుగు రోజుల క్రితమే ఎస్పీని బాధిత మహిళా కానిస్టేబుల్‌ వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌చేసి, ఫోన్‌లో ఎస్‌ఐ వెంకటేష్‌పై ఫిర్యాదు చేసినట్టు భోగట్టా. ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి డీఎస్పీ వివేకానందతో విచారణ చేయించి నివేదిక కోరినట్టు విశ్వసనీయ సమాచారం. వెంకటేష్‌ వ్యవహారంపై పోలీసు శాఖలో అంతర్గత విచారణ నడుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారం రోజులుగా ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్నా పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటుందన్న కోణంలో ఎస్‌ఐ ప్రవర్తనపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేసిన వ్యవహారం వెలుగులోకి రానీయకుండా పోలీసులు ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్‌తో ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎస్‌ఐ వెంకటేష్‌పై అనేక అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. సంపాదనే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వర్తిస్తుంటాడని పోలీసుశాఖలో ప్రచారం ఉంది. జిల్లాలో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ప్రతిచోట వెంకటేష్‌పై ఆరోపణలున్నాయి. న్యాయం చేయాలని స్టేషన్‌ను ఆశ్రయించే బాధితుల నుంచే పెద్ద మొత్తంలో వసూలుచేసి, వారికే వ్యతిరేకంగా వ్యవహరించడంలో వెంకటేష్‌ దిట్టన్న టాక్‌ ఉంది.

శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్టేషన్‌ ఎస్‌ఐగా పని చేస్తున్నప్పుడు మితిమీరిన వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణల నేపధ్యంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌ను కేవలం మూడు నెలల వ్యవధిలోనే ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఓ చెక్‌బౌన్స్‌ కేసులో నిందితుడ్ని అరెస్ట్‌ చేయకుండా ఉండటానికి పెద్ద మొత్తంలో సొమ్ములు తీసుకున్న వ్యవహారం వెలుగుచూడటంతో ఈయన్ను ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. ఎస్‌ఐగా పని చేసినది మూడునెలలే అయినా అప్పటి సీఐ ఈశ్వరప్రసాద్‌ బదిలీ కోసం ప్రయత్నిస్తూ రాజధాని చుట్టూ తిరగడంతో వెంకటేష్‌ మాత్రమే స్టేషన్‌ బాధ్యతలు చూసేవారు. ఆ సమయంలో ఆయన గట్టిగా దండేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్‌ నుంచి మన్యం జిల్లాకు మ్యూచువల్‌ బదిలీ పెట్టుకున్నారు. మన్యం నుంచి ఎస్‌ఐ హరికృష్ణ శ్రీకాకుళం రావడానికి, శ్రీకాకుళం నుంచి వెంకటేష్‌ మన్యం వెళ్లడానికి విల్లింగ్‌ తెచ్చుకున్నారు. కానీ హరికృష్ణ ఇక్కడకు వచ్చినా మన్యంలో వెంకటేష్‌కు కావాల్సిన స్టేషన్‌ ఇవ్వకపోవడంతో ఆయన ఎన్నికల అనంతర బదిలీల్లో ఆమదాలవలస ఎస్‌ఐగా వచ్చారు. ఆమదాలవలసలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు స్టేషన్‌ ఇన్‌స్పెక్షన్‌ పూర్తిచేసి బదిలీ చేయడానికి సిద్ధమయ్యారు. అంతలోనే మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

పోలీసులు విచారణలో వెంకటేష్‌ వ్యవహారంపై అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. మహిళా కానిస్టేబుల్‌ను లోబర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సన్నిహితంగా ఉంటూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని విశ్వసనీయ సమాచారం. బాధిత కానిస్టేబుల్‌ వెంకటేష్‌ చర్యలను వ్యతిరేకించడంతో వేధింపులకు గురి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బయటకు రాకుండా పోలీస్‌స్టేషన్‌లో అందరికీ హెచ్చరించినట్టు తెలిసింది.

సోంపేటలో ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో ఒక సివిల్‌ తగాదాలో తలదూర్చి భారీస్థాయిలో డబ్బులు గుంజే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. సోంపేటకు చెందిన న్యాయవాది వెంకటరావు మృతిచెందిన తర్వాత వారసత్వ ఆస్తి కోసం ఆ కుటుంబంలో వివాదం చెలరేగింది. ఈ సివిల్‌ మేటర్‌లో వెంకటేష్‌ తలదూర్చి న్యాయవాది వెంకటరావు అల్లుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి మూడు రోజుల పాటు లాకప్‌లో పెట్టి డబ్బులు డిమాండ్‌ చేసి ఆస్తిపత్రాలపై సంతకాలు చేయాలని చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికంగా ఉన్న ఒక టీవీ ఛానల్‌ ప్రతినిధి వీడియో తీశాడు. వీడియో తీసినందుకు సదరు టీవీ ఛానల్‌ ప్రతినిధిపైనా అక్రమంగా కేసు నమెదు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ విలేకరిపై బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. దీంతో సదరు టీవీ ప్రతినిధి తీసిన వీడియోను హ్యూమన్‌రైట్స్‌కు పంపించి ఎస్‌ఐ వెంకటేష్‌ ఒక కుటుంబ వివాదంలో తలదూర్చి అక్రమంగా ఒక ఇంజినీరింగ్‌ విద్యార్ధిని లాకప్‌లో పెట్టి చితకబాదాడని ఫ˜ిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి నోటీసులు జారీ చేసి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై అప్పటి క్రైం అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వరరావుని విచారణ అధికారిగా అప్పటి ఎస్పీ నియమించారు. ఈ కేసును నీరుగార్చి కేసు నుంచి బయటపడటానికి ఉన్నతాధికారికి రూ.5లక్షలు సమర్పించుకొని విచారణ నివేదికను అనుకూలంగా రాయించినట్టు వెంకటేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం పోలీసు శాఖలో ఇప్పటికీ చర్చనీయాంశమే. తాజాగా ఆమదాలవలసలో ఛార్జి తీసుకొని వంద రోజులు కూడా కాకముందే ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌ను అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపించారు వెంకటేష్‌. తన ప్రైవేటు వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తికి ఆరోగ్యం బాగులేదన్నా వినకుండా పని చేయించి, తీరా పరిస్థితి చేజారిపోతున్న సమయంలో ఆమదాలవలసలో ఉన్న ఒక వృద్ధ ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు తీసుకువెళ్లి రాత్రికి రాత్రే ట్రీట్మెంట్‌ ఇప్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వెంకటేష్‌ ప్రైవేట్‌ డ్రైవర్‌ చనిపోయాడు. ఈ కేసులో డ్రైవర్‌ కుటుంబం వెంకటేష్‌ను నిందించకుండా మొత్తం నేరాన్ని ఆర్‌ఎంపీ వైద్యుని మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆయన ట్రీట్మెంట్‌ వల్లే చనిపోయాడని ఆయన్ను జైలులో వేశారు. డ్రైవర్‌ పోస్టుమార్టం రిపోర్టును, డెత్‌ డిక్లరేషన్‌ను రిమ్స్‌లో వెంకటేష్‌ ఐదుసార్లు చించేసి వైద్యుల మీద ఒత్తిడి తెచ్చి మరీ తనకు అనుకూలంగా రాయించినట్లు ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకటేష్‌ అవినీతి చరిత్రను పోలీసు వర్గాలేవీ ఖండిరచడంలేదు. డబ్బే పరమావధిగా పని చేస్తారని, అందుకే ఆయన కోరుకున్న చోటకు బదిలీలు జరుగుతాయని పోలీస్‌ శాఖలో చెప్పుకుంటున్నారు. ఎస్పీగా మహేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులను ఏరివేయడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సొంత శాఖలోనే ఒక ఎస్‌ఐ అదే శాఖలోని ఒక మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page