top of page

గడ్డుకాలంలో గుడ్‌ డెసిషన్‌

Writer: NVS PRASADNVS PRASAD
  • పద్మావతి, పురుషోత్తమ్‌కు పదవులు

  • ధర్మాన ప్రతిపాదనకు జగన్‌ ఆమోదం

  • పార్టీకి పనిచేసినవారికి గుర్తింపు



    (సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వైకాపా ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత విధేయతకు పట్టం కట్టినట్లు కనిపిస్తుంది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రివర్గ కూర్పు దగ్గర్నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపిక వరకు భావోద్వేగ వైఖరిని కనబర్చిన జగన్మోహన్‌రెడ్డి గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం కావడంతో ఈసారి పార్టీ పట్ల విధేయత, అధినేత పట్ల అచంచల విశ్వాసం ఉన్నవారికే అవకాశం ఇస్తున్నట్లు అర్థమవుతుంది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలిగా మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతిని, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా రూరల్‌ మండలం రాగోలుకు చెందిన గేదెల పురుషోత్తంను పార్టీ నియమించింది. అనేక అనుబంధ సంఘాలకు కూడా అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించినా, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఈ రెండు పేర్లే ఇక్కడ ప్రస్తావించడానికి అనేక కారణాలున్నాయి.

2024 ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు సైలెంట్‌ అయిపోయారు. ఆయన్ను మళ్లీ యాక్టివ్‌ చేయడానికి, జిల్లాలో వైకాపాను బలోపేతం చేయడానికి ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంతనాలు జరిపినా, ధర్మాన ప్రసాదరావు ఇంకా జనజీవన స్రవంతిలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో నగరం నుంచి పద్మావతి, రూరల్‌ నుంచి గేదెల పురుషోత్తంలను పార్టీ రెండు కీలకమైన పదవుల్లో కూర్చోబెట్టాలని నిర్ణయించడం హర్షణీయం. వీరిద్దరూ ధర్మాన ప్రసాదరావు వర్గంలో కీలక నేతలు. అంతకు మించి గడిచిన ఎన్నికల్లో వెన్నుపోటు రాజకీయాల జోలికి పోకుండా పార్టీకి ఒక్క ఓటు కూడా పోకూడదని కృషి చేసిన నిఖార్సయిన వైకాపా సైనికులు. అన్నింటికీ మించి ఈ రెండు పేర్లను ప్రతిపాదించింది స్వయంగా ధర్మాన ప్రసాదరావే కావడం అనేక సందేహాలకు పుల్‌స్టాప్‌ పెట్టినట్లయింది. జిల్లాలో కొన్ని పార్టీ పదవులు భర్తీ చేస్తున్నామని, అందుకు సంబంధించి నియోజకవర్గాల నుంచి ఇన్‌ఛార్జుల పేర్లు ఇవ్వాలంటూ సూచించినప్పుడు తన నియోజకవర్గం నుంచి ధర్మాన కేవలం రెండే రెండు పేర్లు పంపారు. ఆ రెండు పేర్లకు ఏయే పదవులు ఇవ్వాలని కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడికి సూచించారు. ఆ మేరకే పద్మావతికి జిల్లా ఉపాధ్యక్షురాలు, గేదెల పురుషోత్తంకు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు వచ్చాయి. వాస్తవానికి ఈ రెండు పోస్టులను ఎప్పుడో ఖరారు చేశారు. కాకపోతే పార్టీ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి మీద ధ్వేషంతోనో, ధర్మాన ప్రసాదరావు మీద కోపంతోనో నియోజకవర్గంలో చాలామంది వైకాపా కార్యకర్తలు, నాయకులు పరోక్షంగా టీడీపీకి సహకరించారు. మరికొందరైతే సైలెంట్‌ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ రెండు పదవులూ దక్కించుకున్న నేతలు పార్టీకి ఎదురుగాలి వీస్తుందని తెలిసినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ధర్మాన ప్రసాదరావు 2019లో గెలిచిన తర్వాత మొదటి రెండున్నరేళ్లు మంత్రి పదవిలో లేనని కార్యకర్తల ముందు నిరాసక్తత వ్యక్తం చేసేవారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి వచ్చినా విజయవాడలో పలికినవారే లేరని కార్యకర్తలను దూరం పెట్టారు. ధర్మాన వాదనలో వాస్తవం లేకపోలేదు. కానీ స్థానికంగా ఉండే కార్యకర్తలందరికీ విజయవాడలో మాత్రమే పనులుండవు.. స్థానికంగా కూడా వ్యక్తిగత అవసరాలుంటాయి. కనీసం వాటిని కూడా ఆయన పేషీ గడిచిన ఐదేళ్లలో పట్టించుకోలేదు. రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులకు ఎలాగూ అప్పటి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిధులు విదిల్చలేదు. కనీసం జగన్మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాల్లోనైనా తమవారి పేర్లు ఉండేటట్లు చూడాలని ధర్మానను కలిసినా పని జరిగిన సందర్భాలు లేవు. తన చేతిలో ఏమీ లేదని, అంతా వాలంటీర్లు, వార్డు సచివాలయాలే చూసుకుంటున్నాయని తేల్చేసేవారు. అదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో వాలంటీర్లను తమ ఆధీనంలో పెట్టుకొని అప్పటి సిట్టింగులు పనులు చేయించుకున్నారు. అయితే వేవ్‌లో అందరూ కొట్టుకుపోయారు. కానీ ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లకు మాత్రమే అన్ని ఓట్ల తేడా రావడానికి కారణం ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లు పట్టు వదిలేయడమే. ధర్మాన ఔనన్నా, కాదన్నా ఆయన్నే అంటిపెట్టుకొని నియోజకవర్గంలో రాజకీయాలు నెరుపుతూవచ్చారు పద్మావతి. వైకాపా తరఫున ఒకవైపు వరం కుటుంబం, మరోవైపు మెంటాడ కుటుంబం తనకు ఓటును తెచ్చిపెడతాయని ధర్మాన భావించినా, చివరి నిమిషంలో వరం సంతానం టీడీపీ గూటికి చేరిపోయింది. దీంతో నగరం మొత్తాన్ని పద్మావతి మాత్రమే హ్యాండిల్‌ చేయాల్సిన పరిస్థితి గడిచిన ఎన్నికల్లో ఏర్పడిరది. కానీ అప్పటికే నగరంలో సగభాగంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినా ఎక్కడా పోలింగ్‌ బూత్‌లలో పట్టు సడలకుండా కేడర్‌ను నిలిపారంటే అందుకు కారణం నగరంలో పద్మావతే. స్వతహాగా జగన్మోహన్‌రెడ్డి మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నా నగరంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేజారిపోకుండా అటువంటి గొడవలు ధర్మాన బంగ్లా వరకు వెళ్లకుండా ఆమె ఆపగలిగారు. ఒకానొక సమయంలో ఎమ్మెల్సీ రేసులో ఉండి కేవలం ధర్మాన సోదరుల వల్లే ఆ పదవిని కోల్పోయారని తేలినా నాయకుడి పట్ల విశ్వాసాన్ని మాత్రం ఆమె వీడలేదు. స్థానిక హయాతినగరంలో జరిగిన ఓ సభలో ఎమ్మెల్సీ నర్తు రామారావే ధర్మాన సోదరుల దయ వల్ల తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పినప్పుడు అదే వేదిక మీద ఉన్న పద్మావతి ప్రసంగించాల్సి వచ్చినప్పుడు ధర్మాన ఈ నగరానికి ఎందుకు అవసరమో, అంతకు ముందు ఏమేం చేశారో చెప్పుకొచ్చారు తప్ప ఎక్కడా తన నాయకుడ్ని చిన్నబుచ్చలేదు. పద్మావతి కుటుంబానికి విజయనగరంలో బొత్స సత్యనారాయణతో సన్నిహిత సంబంధాలున్నా ఎక్కడా ధర్మానను కాదని వ్యతిరేక శిబిరాన్ని నడిపే రాజకీయాలు చేయలేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాలకమండలి లేకపోవడం వల్ల ధర్మాన సోదరుడ్ని కార్పొరేషన్‌ సూపర్‌ పవర్‌గా నియమించినా, తాజా మాజీ చైర్మన్‌గా పద్మావతి చేసిన ఏ సిఫార్సు చెల్లకపోయినా ఏరోజూ ధర్మాన మీద అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కాకపోతే ధర్మాన సోదరుడు శ్రీను తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్‌ ఇచ్చి వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు నగరంలో మరో పవర్‌సెంటర్‌ తలెత్తుతుందని పద్మావతి వర్గీయులే ఎక్కడికక్కడ ఆయన పర్యటనను అడ్డుకున్న మాట వాస్తవం. తన అన్న చెబితేనే వార్డుల్లో పర్యటిస్తున్నానని చల్లా శ్రీను చెప్పినా చివరకు పద్మావతి కుటుంబం దీనిని వ్యతిరేకిస్తుందని తెలుసుకున్న ధర్మాన తన తమ్ముడ్నే వెనక్కు తగ్గిపోమన్నారు. పద్మావతికి, ఆమె తనయుడు స్వరూప్‌కు నేరుగా జగన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగితే మేయర్‌ అభ్యర్థిగా ఎవర్ని నిలపాలన్న ప్రపోజల్స్‌ తీసుకోకుండానే పద్మావతికి టిక్కెటిస్తారనే విషయం ఆ పార్టీలో అందరికీ తెలుసు.

జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితుడైన గేదెల పురుషోత్తం ఎన్నికల అనంతరం ధర్మాన బంగ్లానే క్లాస్‌రూమ్‌గా ఆయన వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. నియోజకవర్గం నుంచి సీనియర్‌గా పద్మావతిని ఓ పదవిలో పెట్టి భవిష్యత్తులో పార్టీకి ఓ బలమైన నాయకుడ్ని ఇవ్వడం కోసం ధర్మాన గేదెల పురుషోత్తంను తెర మీదకు తెచ్చారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుపు కోసం ఆస్తులు సైతం అమ్ముకొని కష్టపడే తత్వం గేదెల కుటుంబానిది. పురుషోత్తం తండ్రి, తల్లి ఎంపీపీగా పని చేసినా, వీరి మీద అవినీతి మరకలు లేవు. ప్రస్తుతం ఈయన సోదరుడు చంగలరావు రాగోలు మేజర్‌ పంచాయతీకి సర్పంచ్‌గా ఉన్నారు. వైకాపా హయాంలో సర్పంచ్‌గా గెలవడానికి ఆ కుటుంబం పెట్టిన ఖర్చుకు, ఆ పోస్టుకు ఏమాత్రం పొంతన కుదరదు. కాకపోతే రాజకీయాల్ని వ్యాపారంగా కాకుండా సేవ చేయాలనే కోణంతో చురుగ్గా ఉన్న పురుషోత్తం భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి బలమైన నాయకుడవుతాడని ధర్మాన నమ్మారు. అప్పజెప్పిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా చేసుకుపోవడం మినహా వాక్చాతుర్యం, చతురత లేని పురుషోత్తం తాను రాజకీయాల్లో రాణించలేనేమో అని భావిస్తున్న నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు గడిచిన ఏడు నెలలుగా ఆయనకు రాజకీయ పాఠాలు చెబుతున్నారు. ఎలా ప్రసంగించాలి? స్టేజ్‌ ఫియర్‌ను ఎలా విడిచిపెట్టాలి? ఏ పుస్తకాలు చదవాలి? వంటి అంశాల్లో ఆయన తర్ఫీదునిస్తున్నట్టు భోగట్టా. శ్రీకాకుళం రూరల్‌ మండలంలో వైకాపా తరఫున ఉన్న నాయకుల్లో గేదెల పురుషోత్తం కుటుంబానిది మచ్చ లేని రాజకీయం. బహుశా ఇదే భవిష్యత్తులో పార్టీకి కలిసొస్తుందని ధర్మాన భావించివుండవచ్చు.

ధర్మానకు, జగన్మోహన్‌రెడ్డికి మధ్య ఏమాత్రం పొసగడంలేదని జరుగుతున్న ప్రచారానికి వీరిద్దరి నియామకం పుల్‌స్టాప్‌ పెట్టింది. ధర్మాన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఆయన మాటే వింటారని మరోసారి రుజువైంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page