top of page

గడ్డే తిన్నోళ్లకి డబ్బో లెక్కా!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • అజోలా కిట్స్‌ పేరుతో రూ.70 లక్షలు మింగేశారు

  • కొనుగోళ్లు, పంపిణీ అన్నీ రికార్డుల్లోనే

  • బంధువులు, బినామీలు పాడిరైతులే

  • పాతపట్నంలో మినరల్‌ మిక్చర్‌నూ వీరే తినేశారు

  • పశు సంవర్ధక శాఖలో అంతులేని అవినీతి




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో పశు సంవర్ధక శాఖ పరిధిలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో అజోలా కిట్స్‌ (దాణా) పేరుతో ఆర్‌ఐడీఎస్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ చేయకుండానే రూ.70 లక్షలు నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదే ఏడాది చూలు ఆవుల కొనుగోలు, గొర్రెలు పంపిణీ, పెరటికోళ్ల పెంపకం కోసం ప్రభుత్వం మంజూరుచేసిన రూ.7.60 కోట్లు దుర్వినియోగం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ‘సత్యం’లో కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ఇదే అంశంపై తాజాగా మరికొన్ని అంశాలు బయటపడ్డాయి. వీటిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించిన అధికారులు పంపిణీ దగ్గరకొచ్చేసరికి మాత్రం నచ్చిన వారికి టెండర్లు అప్పగించి రైతులంటూ స్వయంగా వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో యూనిట్లు పంపిణీ జరిపినట్లు రికార్డుల్లో చూపించారని తెలుస్తుంది. తలసరి ఆదాయంలో వెనుకబడిన పాతపట్నంలో రైతుల ఆదాయం పెంచేందుకు పాడిపశువులు పంపిణీకి వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక నిధుల నుంచి రూ. 8కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రూ.1.78 కోట్లు మినరల్‌ మిక్చర్‌ కొనుగోలుకు కేటాయించారు. అయితే కొనుగోలు చేసినట్టు చూపిస్తున్న సంస్థకు ట్రాక్‌ రికార్డు లేదని, ఇది కేవలం బినామీ బిల్లు తెచ్చి రూ.1.78 కోట్లు మింగేశారని ఆరోపణలున్నాయి. పశువులు కొనుగోలు చేయకుండానే వాటికి మందులు కొనుగోలు చేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులపై ఇప్పటికే విమర్శలున్నాయి. యానిమల్‌ ఇండక్సన్‌ స్కీం ద్వారా మంజూరైన రూ.2.73 కోట్లు ఎచ్చెర్ల, కోటబొమ్మాళికి తరలించి బంధువుల పేర్లతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రస్తుతం ఉన్న అధికారులపై ఆరోపణలున్నాయి. వైకాపా హయాంలో వివిధ స్కీమ్‌ల కింద మంజూరైన నిధులను దుర్వినియోగం చేసిన అధికారులు వాటిని కప్పిపుచ్చుకొనే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉన్నారు. జిల్లాలో డీడీ, జేడీ స్థాయిలో పనిచేసిన, పనిచేస్తున్న వారంతా నిధుల దుర్వినియోగంలో బాధ్యులేనని విమర్శలు ఉన్నాయి. వీరంతా జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తూ ప్రజాప్రతినిధులను తప్పుదోవపట్టించి పబ్బం గడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2014`19 మధ్య టీడీపీ పాలనలో జిల్లా పశుసంవర్థక శాఖలో అధికారులుగా పనిచేసినవారే, ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వ హయాంలోనూ అధికారులుగా ఇక్కడే కొనసాగారు. రెండు ప్రభుత్వాలతో అంటకాగి రూ. కోట్లలో దోపిడికి పాల్పడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ అధికారులే ఇన్‌చార్జీలుగా వస్తున్నారు. రైతుల మెడపై కత్తిపెట్టి పశుమత్స్యదర్శిని మాసపత్రిక పేరుతో రెండేళ్లకు రూ.500 వసూలుచేశారు. ఈ మొత్తం రూ.4.65 కోట్లు మూడు నెలల్లోనే ఖర్చు చూపించి మెక్కేశారు. అందులో జిల్లా వాటాగా పెద్ద మొత్తంలోనే ఇక్కడివారికి అందినట్టు భోగట్టా. దీనిపై ఎచ్చెర్లలోని ఒక ఏహెచ్‌ఏ ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page