top of page

గణేషుడి ఆశీర్వాద బలంరూ.25వేల కోట్ల ఊతం!

Writer: DV RAMANADV RAMANA
  • దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక ఉత్సవాలు

  • వివిధ రంగాలకు భారీగా పెరిగిన టర్నోవర్‌

  • వ్యాపార, అలంకరణ, విగ్రహాల తయారీ రంగాలకు జోష్‌

  • లక్షలాది మందికి చేతినిండా పనులు

  • కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్‌ అంచనా

ఒడియాలో ‘బారొ మాసొకు తీరొ జత్రా’ అనే సామెత ఉంది. సంవత్సరంలో ఉండే 12 నెలల్లో 13 జాతరలు జరుగుతాయని దాని అర్థం. దేశంలో పండుగలు, జాతరలకు కొదవ లేదనడానికి ఈ సామెత దర్పణం పడుతుంది. అయితే అన్ని పండుగలు, జాతరలకు ఒకేరకమైన ప్రాముఖ్యత, విశిష్టత ఉండదు. వాటిలో కొన్నే ఘనంగా జరుగుతాయి. కొన్నే కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి ఘనంగా జరుగుతాయి. వాటిలో చెప్పుకోతగ్గవి గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దేవీ నవరాత్రుల కంటే వినాయక చవితి పేరుతో నిర్వహించే గణపతి నవరాత్రులకే ఎక్కువ సందడి ఉంటుంది. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. వినాయక చవితి వస్తుందంటే చాలు పది పదిహేను రోజుల ముందు నుంచే చందాల వసూళ్లు మొదలవుతాయి. ఇది కొందరికి ఇబ్బందికరంగానూ ఉంటుంది. దీనికి మరో పార్శ్శం చూస్తే.. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే గణేష్‌ నవరాత్రుల వల్ల వ్యాపార, సేవా, క్యాటరింగ్‌ తదితర అనేక రంగాలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. తద్వారా దేశ ఆర్థికరంగం కూడా పరిపుష్టం అవుతుంది. ఈ ఏడాది వినాయక నవరాత్రుల పేరుతో దేశవ్యాప్తంగా రూ.25వేల కోట్ల ఆదాయం దేశ ఆర్థిక రంగానికి లభిస్తుందని అంచనా వేయడం విశేషం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

వినాయక చవితి.. మామూలుగా హిందువులు జరుపుకొనే అనేకానేక పండుగల్లో ఒదొకటి. కానీ మిగతా పండుగలకు దీనికి మధ్య చాలా తేడా ఉంది. సాధారణంగా అన్ని పండుగలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకొంటారు. కానీ దేవీ నవరాత్రులు, గణేష్‌ నవరాత్రులను మాత్రం బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అట్టహాసంగా నిర్వహిస్తారు. దుర్గామాత మండపాలను కేవలం ఆయా కమిటీలు పూనుకుని చేస్తే.. గణేష్‌ ఉత్సవాల్లో మాత్రం పిల్లలు, పెద్దలు, ఆ ప్రాంతంలోని ప్రజలందరూ మమేకమై నిర్వహిస్తారు. అది తమ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంగా భావించి పని చేస్తారు. ఒకనాడు ఇళ్లలో జరుపుకొన్న ఈ పండుగ బాలగంగాధర్‌ తిలక్‌ పుణ్యాన స్వాతంత్య్ర సమర వేదికగా మారి.. ఇళ్ల నుంచి ఆరుబయలు ప్రదేశాలకు తరలివచ్చింది. అప్పటినుంచీ ఏటేటా గణేష్‌ ఉత్సవ స్ఫూర్తి పెరుగుతూనే ఉంది. మండలపాల సంఖ్య ఏటికేడూ పెరుగుతూనే ఉంది. ఫలితంగా నవరాత్రుల నిర్వహణకు అవసరమైన వస్తుసామగ్రి కొనుగోళ్లు ఉత్సవాల సమయంలో పతాకస్థాయికి చేరుకుంటాయి. ఫలితంగా వ్యాపార రంగంతోపాటు సేవారంగం, హోటల్‌, క్యాటరింగ్‌, అలంకరణ, విద్యుత్‌, రవాణా, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, తదితర రంగాలకు చేతినిండా పని, జేబుల నిండా ఆదాయం లభిస్తుంది. ఏ పండుగకు లేని రీతిలో ప్రజలందరూ వినాయక ఉత్సవాలకు కనెక్ట్‌ కాగలగడమే దీనికి కారణం. దీనివల్ల కుటుంబాల పరంగా ఖర్చుతో కూడుకున్నదే అయినా.. సామాజికంగా చూస్తే ఆర్థిక రంగానికి బూస్ట్‌ ఇచ్చే పండుగగా వినాయక చవితిని వ్యాపార, ఆర్థిక రంగాల నిపుణులు పరిగణిస్తున్నారు.

20 లక్షలకుపైగా మండపాలు

కాలం మారుతున్నా గణేష్‌ ఉత్సవాల స్ఫూర్తి తగ్గకపోగా పెరుగుతోంది. ఆధునిక సొబగులు అద్దుకుంటోంది. ఈసారి కూడా ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. శనివారం వినాయక చవితి పర్వదినాన్ని దేశం యావత్తు ఆనందోత్సహాలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంది. ఆరోజు కొలువుదీరిన గణనాథులు తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఈ తొమ్మిది రోజులూ పండుగ కోలాహలమే. రకరకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, నిమజ్జనోత్సవాలతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. వీటికి సమాంతరంగా దేశ ఆర్థికరంగం కూడా కొత్త ఉత్సాహం నింపుకుంటోందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌(క్యాట్‌) అంచనా వేస్తోంది. చైనీస్‌ వస్తువుల్ని పూర్తిగా పక్కన పెట్టేసి దేశీయ వస్తువులను వ్యాపారులు, కొనుగోలుదారులు ప్రోత్సహిస్తున్న విషయాన్ని వ్యాపార సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గణేష్‌ నవరాత్రులు ఉత్సాహంగా జరుగుతున్నా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో మాత్రం ఉత్సవాలు వేరే లెవల్లో జరుగుతాయి.. జరుగుతున్నాయన్నది వాస్తవం. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 20 లక్షలకుపైగా గణేష్‌ మండపాలు ఏర్పాటయ్యాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బార్టియా అంచనా వేశారు. ఒక్క మహారాష్ట్రలోనే ఏడు లక్షలకు పైగా మండపాలను ఏర్పాటు చేయగా ఆ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో ఐదు లక్షలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లో రెండు లక్షలు చొప్పున వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో మండపాలు కొలువుదీరాయి. ఈ మండపాల నిర్వహణ, ఉత్సవ కార్యక్రమాల రూపేణా భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనివల్ల ఆర్థిక రంగం కళకళలాడుతోందని క్యాట్‌ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు.

అనేక రంగాలకు ఊతం

ఉత్సవాలు భారీగా జరుగుతున్న రాష్ట్రాల్లో క్యాట్‌ నిర్వహించిన సర్వేలో ఖర్చులకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 20 లక్షల మండపాలు ఏర్పాటయ్యాయనుకుంటే.. ఒక్కో మండప ఏర్పాటుకు కనీసం రూ.50 వేలు ఖర్చు అవుతుందనకున్నా.. మొత్తం అన్ని మండపాలకు కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇక మండపాలు, ఇళ్లలో వినాయక విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేయడం సంప్రదాయం. ఆ విధంగా విగ్రహాల తయారీదారులకు రెండు మూడు నెలల ముందు నుంచే చేతి నిండా పని లభించింది. చిన్నా పెద్దా విగ్రహాల అమ్మకాల ద్వారా రూ.500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పూలు, దండలు, పండ్లు, కొబ్బరి, ధూపం, ఇతర పూజా సామాగ్రి విక్రయాల లావాదేవీలు ఇప్పటికే రూ.500 కోట్లకు చేరుకున్నాయి. ఈ తొమ్మిది రోజులూ ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అలాగే స్వీట్లు, ప్రసాదాలు, ఇతర గృహావసరాలకు కలిపి రూ.రెండువేల కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. అన్నదానాలు, పెద్ద కుటుంబాలు నిర్వహించే విందు భోజనాల వల్ల క్యాటరింగ్‌, స్నాక్స్‌ వ్యాపారం రూ.మూడువేల కోట్ల వరకు జరుగుతుందని సర్వేలో అంచనా వేశారు. పండుగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి స్వగ్రామాలకు ప్రయాణాలు, బట్టలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, మండపాల వద్ద తొమ్మిది రోజులపాటు నిర్వహించే సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాలకు కలిపి రూ.5వేల కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయని అంటున్నారు. అదే సమయంలో ఈ రంగాల్లో లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది. ఇవి కాకుండా పర్యాటకం, ట్రావెల్స్‌, హోటల్‌ రంగానికి కూడా డిమాండ్‌ నెలకొంది. ఈ రంగాల టర్నోవర్‌ రూ. రెండువేల కోట్లు దాటవచ్చని అంచనా. రిటైల్‌ వ్యాపారానికి సంబంధించి ఇళ్లు, మండపాల అలంకరణ, బహుమతి వస్తువుల అమ్మకాలు రూపంలో రూ. మూడువేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. మండపాల వద్ద తొమ్మిది రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఈవెంట్ల రూపంలో సుమారు రూ. ఐదువేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. మొత్తం మీద గణేషుడి పూజాఫలంగా పుణ్యంతోపాటు ఆర్థిక ఊతం కూడా లభించడం విశేషం.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page