గత ఎన్నికల ఖర్చు రూ.3,861 కోట్లట!
- DV RAMANA
- Mar 27
- 2 min read

2024లో పార్టీల ఖర్చు రూ. 3,861 కోట్లు.. అనధికారిక లెక్క లక్ష కోట్లపైనే.. ఆదాయ, వ్యయాల్లో బీజేపీయే టాప్.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?.. ఎన్నికల్లో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ఏవైనా వ్యయం మాత్రం కొండలా పెరిగిపోతూనే ఉంది. గత సంవత్సరం దేశంలో ఐదు ఎన్నికలు జరిగాయి. వీటికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.3,861 కోట్లు. ఒక్క లోక్‌సభ ఎన్నికలకే రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు చేశారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. అయితే ఇది అనధికారిక అంచనా. మరి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు చేసిన ఖర్చుపై ఎన్నికల కమిషన్ వెల్లడిరచిన అధికారిక లెక్కలు ఎలా ఉన్నాయి? రాజకీయ పార్టీలు తమ ఆదాయాన్ని, వ్యయాన్ని తెలియజేస్తూ ఎన్నికల కమిషన్‌కు నివేదికలు అందిస్తుం టాయి. అయితే అందులో పూర్తి వివరాలుండవు. కొన్ని జమా ఖర్చులను రహస్యంగా ఉంచుతాయి. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాల ఆధారంగా కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (సీహెచ్‌ఆర్‌ఐ) అనే సంస్థ ఇటీవల ఓ అధ్యయనం జరిపింది. అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఏ స్థాయిలో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తాయో ఈ అధ్యయనం బయటపెట్టింది. ఆదాయంలోనే కాదు.. ఖర్చులోనూ అధికార బీజేపీదే పైచేయి. అధికార గణాంకాల అధ్యయనం ప్రకారం కేవలం 22 పార్టీలు రూ.18,742.31 కోట్లు ఖర్చు చేశాయి. వీటిలో ఆమ్‌ఆద్మీ, అసోం గణపరిషత్, అన్నా డీఎంకే, మజ్లిస్, తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, బీజేడీ, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ(ఎం), డీఎంకే, కాంగ్రెస్, జేడీఎస్, జేడీయూ, ఎల్జేపీ (రాం విలాస్), ఆర్జేడీ, సమాజ్‌వాదీ, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, సిక్కిం క్రాంతికారి మోర్చ, టీడీపీ, వైకాపా ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల కోసం రూ.3,861.57 కోట్లు ఖర్చు చేయగా, ఒక్క బీజేపీయే రూ.1,737.68 కోట్లు.. అంటే మొత్తం వ్యయంలో 45 శాతం ఖర్చు చేసింది. అన్ని పార్టీలకూ కలిపి రూ.7,416.31 కోట్లు విరాళాల రూపంలో అందగా, అందులో 84.5 శాతం ఒక్క బీజేపీ ఖాతాకే చేరాయి. కేవలం ఏడు పార్టీలు అందజేసిన వివరాల ప్రకారం ప్రింట్, టీవీ, డిజిటల్ వేదికల ద్వారా మీడియా ప్రకటనల కోసం రూ.992.48 కోట్లు, సోషల్ మీడియా, వర్చువల్ ప్రచారం కోసం రూ.196.23 కోట్లు ఖర్చు చేశారని సీహెచ్‌ఆర్‌ఐ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ తెలిపారు. స్టార్ క్యాంపెయినర్ల హెలికాప్టర్, ప్రైవేటు జెట్ల ప్రయాణాలకు రూ.830.15 కోట్లు ఖర్చయ్యాయి. ఇక బ్యానర్లు, హోర్డింగులు, పోస్టర్లు, ఇతర ప్రచార సామగ్రి నిమిత్తం రూ.398.49 కోట్లు ఖర్చు చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు నగదు ఎలా లభించింది అని అడిగిన ప్రశ్నకు వెంకటేష్ నాయక్ సమాధానమిస్తూ ‘జవాబు దొరకని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీల ఖాతాలలో రూ.14.848.46 కోట్లు నిల్వ ఉన్నాయి. ఈ అదనపు సొమ్ము ఎక్కడికి పోతుంది? బీజేపీ సహా ఆరు పార్టీల వద్ద ఎన్నికల ప్రారంభంలో కంటే ముగిసిన తర్వాతే ఎక్కువ సొమ్ము ఉంది. ఇది ఎలా సాధ్యం? సీపీఐ, జేఎంఎం, శివసేన, శిరోమణి అకాలీదళ్ సహా అనేక పార్టీలు తమ ఖర్చుల వివరాలే ఇవ్వలేదు’ అని చెప్పారు. ‘దిగ్బ్రాంతి కలిగిస్తున్న ఈ లెక్కల్ని చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నికలు ఇంకెంతో కాలం ప్రజాస్వామ్యం గురించి జరగబోవు. అవి ధనాన్ని విచ్చలవిడిగా వెదజల్లే యుద్ధ క్షేత్రాలుగా మారుతాయి. రాజకీయ పార్టీలు ఈ విధంగా డబ్బును మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తుంటే సామాన్య మానవుడి మనసులో ఓ ప్రశ్న మెదులుతుంది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? చివరికి ప్రయోజనం పొందేది ఎవరు? ఏదేమైనా ఎన్నికలలో ఓట్లు కాదు.. డబ్బే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోంది. భారత రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించబోయేది డబ్బే. ఈ ధన ప్రవాహాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకోగలదా? లేదా ధనబలం, గోప్యత ఇలా కొనసాగుతాయా? అనేదే తేలాల్సి ఉంది’ అని వెంకటేష్ నాయక్ చెప్పారు.
Opmerkingen