గల్లీలో సవాల్.. ఢల్లీిలో సలాం!
- NVS PRASAD
- Jun 26, 2024
- 3 min read
నాటి పోరాటపటిమ స్థానంలో బేలతనం
ప్రతిపక్ష హోదా, ఢల్లీి మద్దతు కోసం పాకులాట
తనను ఓడిరచినవారి వెంట పడటంపై పార్టీలో అసంతృప్తి
కేసుల భయంతోనే జగన్‌లో ఈ మార్పు అని ప్రచారం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘పెత్తందారులంతా ఒకవైపు.. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపు’..

‘నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’..
16 నెలలు జైలులో పెట్టినా సోనియాగాంధీకి మోకరిల్లని జగన్ ఇప్పుడు ఆ పార్టీలో ఎందుకు కలుస్తారు?
.. ఇవీ ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై వచ్చిన ఎలివేషన్లు. పార్టీ పెట్టిన దగ్గర్నుంచి 2019 వరకు జగన్ యుద్ధమే చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండటం మినహా ఆయన జీవితమంతా పోరాటమే. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గతంలో కనిపించిన ధీరత్వం ఆయనలో కనిపించడంలేదు. ఓటమికి కారణం తాను కాదని, ఈవీఎంలేనని నెపం నెట్టేసే పరిస్థితి నుంచి బీజేపీ అడక్కుండానే ఆ పార్టీ కాళ్ల ముందు దేబిరించడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ జగన్మోహన్‌రెడ్డేనా సోనియాను ఎదిరించి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసినది అనిపించకమానదు. మొన్నటికి మొన్న ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి రాజ్యసభలో తమకున్న సంఖ్యాబలంతో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే స్పీకర్ ఎన్నికకు తమ నలుగురు ఎంపీలు సహకరిస్తారని చెప్పుకొచ్చారు. ఇంతకంటే బేలతనం మరొకటి లేదు. జగన్మోహన్‌రెడ్డిని ఓడిరచడానికి చంద్రబాబుతో చేతులు కలిపిన మోదీతో ఇప్పుడు అంటకాగితే వైకాపా తెలుగుదేశం కంటే భిన్నమైన పార్టీ ఎలా అవుతుందో జగన్మోహన్‌రెడ్డే చెప్పాలి. లోక్‌సభలో స్పీకర్ పదవికి తొలిసారిగా ఎన్నిక జరిగితే ఎన్డీయేకు అనుకూలంగా ఓటు వేయడానికి వైకాపా నిర్ణయించుకుంది. అఫ్‌కోర్స్ కాంగ్రెసంటే జగన్మోహన్‌రెడ్డికి కిట్టకపోవచ్చు. అంతమాత్రాన బీజేపీ పిలుపునకు అనుకూలంగా స్పందించనక్కర్లేదు. ఓటింగుకు దూరంగా ఉన్నా సరిపోతుంది.
ముసుగులో గుద్దులాట ఎందుకు?
అసలు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకో అర్థం కావడంలేదు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అడిగిన ప్రతిదానికీ మద్దతిచ్చి ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకోవడం కంటే ఎన్డీయేలో చేరిపోవడమే జగన్ ముందున్న బెటర్ ఆప్షన్. ఇటీవలి ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి ఓడిపోయిన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైకాపా క్యాడర్ రోడ్డు మీద పోరాడుతుంటే జగన్ మాత్రం ఆ కూటమికి ఢల్లీిలో సపోర్ట్ చేస్తున్నారు. ఢల్లీిలో ఎన్డీయేకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో మాత్రం కూటమిలో మిత్రభేదాన్నయితే సృష్టించలేరు. ఎన్డీయేకు కేంద్రంలో బలముంది. వైకాపాకు ఉన్న నలుగురు ఎంపీల అవసరం వారికి లేదు. కానీ ఇలా వెనుకా ముందూ ఆలోచించకుండా జగన్ మద్దతు ఇవ్వడం కేవలం తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోడానికేనన్న వాదనకు బలం చేకూరుస్తోంది. యూపీఏ హయాంలో జగన్ జైలుకెళ్లారు. కానీ ఇప్పుడెందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదు. ఆయన బేలగా తయారయ్యారనడానికి బలమైన కారణం తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడమే కావచ్చు. పైన దేవుడు, కింద తాను నమ్ముకున్న జనాలు ఉన్నంతవరకు తనకేమీ కాదని ప్రతి సభలోనూ చెప్పుకొచ్చే జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖ రాయడం సబబుగా లేదు. ఏదైనా ప్రజలు తీర్పునివ్వాలి. 11 మంది ఎమ్మెల్యేలుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడా చట్టంలోనూ, రాజ్యాంగంలోనూ రాసి లేదు కాబట్టి తనకు ఆ హోదా ఇవ్వాలని జగన్ కోరడం సహేతుకం ఆకదు. ఒక్కడితోనే మొదలైన ఆ పార్టీకి ఇప్పుడు 11 మంది ఉన్నారు. జగన్‌లో నిజంగా ఆ పోరాటపటిమే ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండానే అధికార పక్షాన్ని నిలువరించవచ్చు. కాకపోతే గత ఐదేళ్లలో ఆయన వందిమాగధులు అన్ని పాపాలు చేసుండకపోవాల్సింది. తనకు 40 శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్న జగన్ 2019లో కూడా టీడీపీ సింగిల్‌గా వెళ్తే 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఆ మిగిలిన 11 శాతం ఓట్లను మిగుల్చుకోవడంలోనే ఏ పార్టీ సత్తా ఎంతనేది తెలుస్తుంది. గుంటూరు, కడప వంటి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈసారి వైకాపా స్కోర్ చేయలేకపోయిందంటే దానికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కంటే వైకాపా భిన్నమైన పార్టీ ఏమీ కాదని ముస్లింలు నమ్మడమే. కనీసం టీడీపీకి ఓటేస్తే వైకాపా అరాచకవాదులకు బుద్ధి చెప్పినట్టవుతుందన్న ఉద్దేశంతోనే ఈసారి కూటమి వెంట వెళ్లిపోయారు. ఒడిశాలో కూడా ఎటువంటి అవినీతి మరకా లేని మాజీ సీఎం నవీన్ పట్నాయిక్ కూడా ప్రతి అంశంలోనూ బీజేపీకి బేషరతు మద్దతునిచ్చి రాష్ట్రంలో బీజేపీ బీ`టీమ్‌గా తన పార్టీని తయారుచేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్ కూడా అయినదానికి, కానిదానికి కేసులకు భయపడి బీజేపీ వెంట వెళ్లినంత మాత్రాన తనకు వచ్చే అపాయాన్ని మాత్రం తప్పించుకోలేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం హోదా వస్తే జగన్‌కు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. మహా అయితే కేబినెట్ ర్యాంకు వస్తుంది. అసలింతకీ ఈ ప్రధాన ప్రతిపక్షమనే అంశం నిజంగానే పదోవంతు సభ్యులు తప్పనిసరి అని చట్టంలో ఉందా? సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ సోషల్ మీడియా పోస్టు దీన్ని కొంత చర్చించింది.
పదో వంతు ప్రస్తావన లేకపోవడం నిజమే
ఇలా.. ‘మొదటగా అసలు ప్రధాన ప్రతిపక్షం గురించి రాజ్యాంగం ప్రస్తావించలేదు. మరి ఈ పదోవంతు సీట్ల ప్రస్తావన ఎలా వచ్చింది? 1950ల ప్రాంతంలో సభ్యులకు సీట్లు కేటాయించడానికి అప్పటి స్పీకర్ ఒక ఏర్పాటు చేసుకున్నారు. పదోవంతుకు పైగా సీట్లు వచ్చిన పార్టీలను మాత్రమే పార్టీలుగా గుర్తించి వారికి ముందు వరుసల్లో సీట్లు కేటాయించి, మిగిలిన వాటిని కేవలం గ్రూపులుగా పరిగణించేవారు. కానీ ఆ తర్వాత వచ్చిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఈ గ్రూపుల పద్ధతిని తిరస్కరించి, ప్రతి పార్టీని పార్టీలుగానే గుర్తించింది. దీంతో ఆ పదోవంతు నిబంధనలకు కాలం చెల్లింది. ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని దేన్ని బట్టి గుర్తించాలి? దీనికి పార్లమెంట్‌లో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు జీతభత్యాల చట్టం-1977 ఆధారం. దీని ప్రకారం లీడర్ ఆఫ్ ది అపోజిషన్‌ని గుర్తించాల్సిన చట్టబద్ధ బాధ్యత స్పీకర్‌కు ఉంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్‌ని గుర్తించాలంటే, ముందుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని గుర్తించాలి. సభలో అధికారపక్షానికి వ్యతిరేకంగా ఉండే పార్టీల్లో అతి పెద్ద పార్టీ (ఎక్కువ సభ్యులున్న పార్టీ) నేతనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్‌గా ఎన్నుకోవాలని ఈ చట్టం నిర్వచిస్తోంది. కనుక అతి పెద్ద ప్రతిపక్ష పార్టీయే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. దీన్నిబట్టి పదోవంతు సభ్యులకు ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధం లేనట్టే. గతంలో ఢల్లీి అసెంబ్లీలో కేవలం ముగ్గురే సభ్యులు ఉన్న బీజేపీకి ఈ చట్టం ప్రకారమే ఆ సభ స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ పార్టీ నేతకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా దక్కింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రత్యేకమైన లెజిస్లేచర్ నిబంధన ఏదైనా ఉంటే తప్ప, అమలులో ఉన్న పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాకు పదోవంతు సీట్లకి సంబంధం లేదు..’ కానీ దీనికి విరుద్ధమైన వాదనలు, వివరణలు కూడా వినిపిస్తున్నాయి. 1977 చట్టంలోనే కనీసం పదోవంతు సీట్లున్న పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే క్లాజ్ ఉందని సంబంధిత చట్టంలోని భాగాన్ని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇలా.. చట్టపరమైన, సాంకేతికమైన వాదనలు, వివరణలు, సూచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే జగన్‌ను గౌరవించండి అని చంద్రబాబు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నా సరే ప్రస్తుత ఏపీ రాజకీయాల ట్రెండ్ ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా, వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అసాధ్యంగానే కనిపిస్తున్నాయి..! కాకపోతే శాసనసభకు రాకుండా ఉండటానికి ఓ సాకు అవసరమని అనుకుంటే జగన్‌కు ఈ ఇష్యూ కొంత ఉపయోగపడవచ్చు..!!
Comentários