ఫరీద్‌పేటకు చెందిన ముగ్గురు అరెస్టు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గంజాయి అక్రమరవాణా, విక్రయం, సేవించడంపై ఇటీవల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే బహిరంగంగా గంజాయి సేవిస్తున్న ముగ్గరు యువకులను శుక్రవారం ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఎలిమెంట్రీ స్కూల్ భవనంలో ముగ్గురు యువకులు గంజాయిని సిగరెట్‌లో పెట్టి సేవించినట్టు విశ్వసనీయ సమాచారం. గంజాయిని పొట్ల్లాన్ని విప్పి కాగితంలో వేసి దాన్ని సిగిరెట్‌లో చొప్పించి దమ్ములాగేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారాన్ని యువకులు వీడియో తీసి వాటిని స్నేహితులకు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో వైరల్ కావడంతో దీని ఆధారంగా వీడియోలో గంజాయిని సిగిరెట్‌లో పెట్టి సేవించడానికి సిద్ధమైన ముగ్గురు యువకులను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినట్టు తెలిసింది. వీరు గంజాయిని కొనుగోలు చేశారా, రవాణా చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గంజాయిని రవాణా చేసే బ్యాచ్‌తో వీరికి ఉన్న సంబంధాలపై శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. వీరితో పాటు ఇంకెవరైనా గ్రామంలో గంజాయి సేవించేవారు ఉన్నారా, ఉంటే వారిని గుర్తించి అందరినీ రీహేబిటేషన్ సెంటర్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. గంజాయిని సేవిస్తూ పోలీసులకు చిక్కిన ముగ్గురు యువకులు ఫరీద్‌పేటకు చెందినవారని తేలడంతో గ్రామంలో యువత ఉలిక్కిపడిరది. ఇప్పటికే జిల్లాలో రోజుకో గంజాయి కేసు నమోదవుతుండడం, గంజాయి సేవించేవారిలో యువతే ఎక్కువ మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించడంతో అందరిలో కలవరం ప్రారంభమైంది. ప్రస్తుతం అదుపులో ఉన్న యువకుల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసుల చెరలో ఉన్నవారిని విడుదల చేయించడానికి రాజకీయ ప్రయత్నాలు ప్రారంభమయినట్టు విశ్వసనీయ సమాచారం.
댓글