top of page

గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?

  • Guest Writer
  • May 28
  • 2 min read

ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు.

భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన

ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెండ్ అవుతున్నాయి. ఇది సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న సరదా మీమ్ అయితే మాత్రమే కాదు. ఒక లోతైన రాజకీయ, సాంస్కృతిక మార్పుకు స్పష్టమైన సంకేతం.

రాజకీయ బ్రాండింగ్ వర్సెస్ ఆధ్యాత్మిక అన్వేషణ...

హిందూమతం అంటే అన్వేషణ,హిందూమతం అనేది మనుషులకు ప్రశ్నించడం నేర్పింది. హిందుత్వం అంటే సమీకరణ. ఈ మార్పును మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. హిందుత్వ రాజకీయాలు మొదట్లో వచ్చినప్పుడు, అవి హిందూ సంస్కృతిని రక్షిస్తామనే ఒక బలమైన భావోద్వేగంతో ప్రజల్లోకి వెళ్లాయి. అయితే కాలక్రమేణా ఆ రాజకీయ శక్తి హిందూ మతం యొక్క మూలాల నుండి దూరంగా జరుగుతోంది. అది ఇప్పుడు హిందూ ఐడెంటిటీని మార్కెటింగ్ చేసుకునే వైపు మళ్లింది.

నిజానికి హిందూమతం అనేది మనుషులకు ప్రశ్నించడం నేర్పింది. ఉపనిషత్తులు మనల్ని “నేతి నేతి” (ఇది కాదు, ఇది కాదు) అంటూ ప్రతి విషయాన్ని సందేహించమన్నాయి. సత్యాన్ని కనుగొనే దాకా ఆగవద్దని చెప్పాయి. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని ఒక అంధ భక్తుడిగా మార్చాలని చూడలేదు. అతడిని ప్రశ్నలు అడగమన్నాడు. ఆలోచించే వ్యక్తిగా తీర్చిదిద్దాడు. బుద్ధుడు, శంకరాచార్యుడు, రామానుజుడు వంటి మహానుభావులంతా వాదనల ద్వారా, తర్కం ద్వారానే కొత్త మార్గాలను నిర్మించారు. అంటే హిందూమతం యొక్క అసలైన మూలం ఒక నిరంతరఆధ్యాత్మికఅన్వేషణ. కానీ ఆధునిక హిందుత్వ రాజకీయాల పునాది భావోద్వేగ సమీకరణ మీద ఆధారపడి ఉంది. ఇక్కడే భగవద్గీత స్థానంలో మెలోడీ చాక్లెట్ వచ్చి కూర్చుంది. చాక్లెట్ నోట్లో పెట్టుకోగానే తక్షణ తీపిని ఇస్తుంది కానీ, శాశ్వత పోషణను ఇవ్వలేదు. నేటి రాజకీయాలు కూడా లోతైన అవగాహన కంటే, వెంటనే వైరల్ అయ్యే విజువల్స్, ఫోటోల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

సాఫ్ట్ పవర్ పేరిట జరుగుతున్న మార్పు...

ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన నాగరికత, ఇప్పుడు మెలోడీ పంచుతూ సాఫ్ట్ పవర్‌ను అమ్ముకుంటోంది. గతంలో నరేంద్ర మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భగవద్గీతను బహూకరించినప్పుడు ఆ గాంభీర్యం వేరు. చివరకు 1997లో కేరళ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి ఈ.కె. నాయనార్ రోమ్‌లో పోప్‌ను కలిసినప్పుడు కూడా భగవద్గీతనే బహుమతిగా ఇచ్చారు. అంతెందుకు, అమెరికాలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్ పటేల్ ప్రమాణం చేసినప్పుడు కూడా గీతపైనే చేయి వేశారు.

ఆ గంభీరత నుండి నేటి సోషల్ మీడియా మీమ్స్ స్థాయికి రావడం మన సమాజం ఏం కోరుకుంటుందో చూపించే అద్దం. లోతైన తత్వం కంటే వైరల్ క్షణాలు, ధ్యానం కంటే డిజిటల్ బ్రాండింగ్ ఇక్కడ ముఖ్యం అవుతున్నాయి. ధర్మం కంటే డ్రామా ఇవే ఆధునిక రాజకీయాల కొత్త మంత్రాలుగా మారాయి.

రాజకీయాల మెలోడీ చాక్లెట్ ఎప్పటికైనా కరిగిపోవచ్చు. కానీ గీతలోని ప్రశ్నలు, ఆ సత్యాన్వేషణ మాత్రం మానవజాతి ఉన్నంత కాలం నిలిచి ఉంటాయి.

ఈ మార్పును మనం కోపంతో కాకుండా పూర్తి స్పష్టతతో చూడాలి. హిందుత్వం, హిందూమతం ఒకటే కాదని గ్రహించాలి. ఒకటి ఎన్నికల కోసం ఎప్పటికప్పుడు మారే ఒక రాజకీయ ప్రాజెక్ట్. మరొకటి వేల ఏళ్ల నాటి నాగరిక అన్వేషణ. ఒకటి ఓట్ల కోసం మారుతుంది. మరొకటి కాలంతో సంభాషిస్తూ నిలిచి ఉంటుంది. రాజకీయాల మెలోడీ చాక్లెట్ ఎప్పటికైనా కరిగిపోవచ్చు. కానీ గీతలోని ప్రశ్నలు, ఆ సత్యాన్వేషణ మాత్రం మానవజాతి ఉన్నంత కాలం జీవిస్తూనే ఉంటాయి. మీరేమంటారు? మన సాంస్కృతిక గుర్తింపు డిజిటల్ బ్రాండింగ్‌గా మారడాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ గంభీరత మళ్లీ తిరిగి రావాలా? లేదా చాక్లెట్ యుగమే కొనసాగాలా?

- నంబూరి చంద్రశేఖర్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page