అక్టోబర్ 2 అంటే.. సాధారణంగా అందరికీ స్ఫురణకొచ్చే పేరు జాతిపిత గాంధీ. కానీ, నిరాడంబరతకు నిలువుటద్దంలా.. జీవితమంటే ఏంటో పరిపూర్ణ అవగాహనతో మెదిలిన ఓ సాదాసీదా ప్రధాని, దేశానికి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నందించిన దార్శనికుడి పుట్టినరోజు కూడా. తెలిసినవారి సంఖ్య ఎక్కువే అయినా గుర్తుంచుకునేవారే తక్కువ. ఒకవేళ తెలిసినా.. గాంధీ పుట్టినరోజే శాస్త్రి పుట్టినరోజవ్వడం యాదృచ్ఛికమో, ఏమోగానీ.. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతిగానే బలంగా నాటుకుపోయింది. కానీ గాంధీకి ఏమాత్రం తీసిపోని ఆ నిరాడంబరుడి కొన్ని కథలు కూడా కదిలించేవే.

సాయుధ తిరుగుబాటు, మతపరమైన అసమ్మతి, ఆకలికేకలు, ఆహారధాన్యాల కొరత, ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతదేశ రెండో ప్రధానిగా ఆశాకిరణంగా నిల్చిన మహోన్నత వ్యక్తి లాల్ బహుదూర్ శాస్త్రి. కుల, మతాలకతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు, జైజవాన్-జైకిసాన్ వంటి నినాదంతో దేశం మొత్తాన్ని రగిలించి స్ఫూర్తి నింపిన దార్శనికుడు ఎల్బీ శాస్త్రి. ఒక ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ.. తానూ ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రస్థానాన్ని మరువకుండా నిరంతరం ప్రజాశ్రేయస్సుకై యోచించినవాడు. 1965 ఇండో-పాక్ వార్ సమయంలో శాస్త్రి దేశం కోసం చేసిన కృషితో పాటు పాల పరిశ్రమను అభివృద్ధిపర్చడంపై ఆయన చూపిన చొరవ అభినందనల వర్షాన్ని కురిపించింది.
శాస్త్రి స్వాతంత్య్ర పోరాట సమయంలో పలుమార్లు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉన్న ఒకానొక సమయంలో ఆయన కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఓసారి జైలు నుంచి 15 రోజుల పాటు పెరోల్‌పై బయటకొచ్చారు శాస్త్రి. కానీ విధి వక్రించి కూతురు పెరోల్ పూర్తికాక ముందే చనిపోయింది. దాంతో శాస్త్రి తన పెరోల్ గడువు పూర్తికాకముందే మళ్లీ జైలుబాట పట్టారట. ఎందుకిలా అని జైలు అధికారులడిగితే.. నా కుమార్తెను చూసుకోవడానికి, వీలైతే ఆమెను ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి నాకు పెరోల్ ఇచ్చారు. కానీ ఇప్పుడామే లేకుండా పోయింది. ఇంకా నాకు ఈ పెరోల్ ఎందుకు? జైలుకు తిరిగిరావడం నా కర్తవ్యమని చెప్పేశారట శాస్త్రి. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులైన డాక్టర్ సందీప్ శాస్త్రి ‘లాల్ బహదూర్ శాస్త్రి’ పాలిటిక్స్ అండ్ బియాండ్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. అంతేకాదు తమకు వచ్చే యాభై రూపాయల పెన్షన్‌లో లాలా లజపతిరాయ్ పేదల కోసం నడిపించే సంస్థకు.. పది రూపాయలను విరాళంగా అందించిన సహృదయశీలి ఎల్బీ శాస్త్రి.
తన చిన్ననాట పాఠశాలకు నది దాటి వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా పడవలో ప్రయాణించడానికి డబ్బు ఖర్చు చేయకుండా ఈదుకుంటూ వెళ్లి డబ్బును ఆదా చేసి.. దాని విలువను చిన్ననాటే గుర్తించిన పొదుపరి శాస్త్రి. ప్రధాని హోదాలో ఒక కారైనా లేకపోతే ఎలా అన్న చర్చ ఇంట్లో పెరిగి పెద్దదైనప్పుడు 12వేల రూపాయల ఫియట్ కారు కొనడానికి.. కేవలం శాస్త్రి వద్ద రూ.7వేలే ఉంటే మరో రూ.5 వేలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రుణంగా తీసుకోవాల్సి వచ్చింది. ఆ లోన్ తీర్చేకంటే ముందే తాష్కెంట్‌లో ఆయన మృతి, ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ రుణాన్ని రద్దు చేస్తామన్నా వినకుండా ఆయన భార్య తనకొచ్చే పెన్షన్ డబ్బు నుంచి ఆ రుణాన్ని తీర్చేయడం.. ఆయన సారథ్యంలోని సంస్కార కుటుంబ వ్యవస్థను కళ్లకు కట్టేది.
1965-1966 మధ్యకాలంలో తీవ్ర ఆహార కొరతతో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతీ ఇంటి పెరట్లో గోధుమలు, లేదా వరిని పండిరచాలని పిలుపునిచ్చి శ్వేతవిప్లవాన్ని రగిలించిన నాయకుడు. అంతేకాదు, ఢల్లీి జనపథ్‌లోని తన ఇంట్లో ధాన్యాన్ని ఆయనే స్వయంగా పండిరచి ఆచరణలో పెట్టేవాడే నాయకుడని నిరూపించాడు. భారత్ అప్పటికే గోధుమలను ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కాలంలో భారత్‌లో ధాన్యం కొరత ఏర్పడి వినిపిస్తున్న ఆకలి కేకలను నివారించాలంటే.. వారానికి ఓ పూట ఇంటిల్లిపాది భోజనం మానేసే ఉపవాస ఉద్యమాన్ని తన ఇంటి నుంచే ప్రారంభించాడు. ఏకంగా ఆల్ ఇండియా రేడియోనే ఉద్యమానికి పిలుపునిచ్చేలా చేసిన ఆదర్శప్రాయుడు లాల్ బహదూర్ శాస్త్రి.
ఇలా శాస్త్రికి సంబంధించిన ఎన్నో కథలు నేటి తరానికి ఇంకా తెలియాల్సి ఉంది. అంతకు మించి అక్టోబర్ 2 అంటే మహాత్ముడు గాంధీ జయంతి మాత్రమే కాదు.. ది గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనీ గుర్తించి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
- రమణ కొంటికర్ల
Comments