చైన్‌స్నాచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఎచ్చెర్లలో తేలిన మూలాలు
ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన టీడీపీ నాయకుడు
ఇద్దర్ని తప్పించేసిన జీఆర్‌పీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రైల్లో చైన్ స్నాచింగ్ చేస్తూ రైల్వే పోలీసులకు చిక్కిన దొంగ ఇచ్చిన సమాచారంతో బంగారం రికవరీ చేసినా, బాధ్యులను మాత్రం విడిచిపెట్టేశారు. సుమారు ఏడు తులాల బంగారం రికవరీ చేసినట్టు రైల్వే పోలీసులు న్యాయస్థానానికి చూపించి కొందరు నిందితులను విడిచిపెట్టేశారని వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం పలాస రైల్వేస్టేషన్ పరిధిలో నడుస్తున్న రైలులో నుంచి మహిళ మెడలో బంగారు గొలుసును దొంగిలించినట్టు జీఆర్‌పీ ఎస్‌ఐ శ్రీనివాసు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. విశాఖపట్నం జీఆర్‌పీ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన రైల్వేపోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నరసన్నపేటలో బీకాం ఫైనల్ ఇయిర్ చదువుతున్న యువకుడిని ఆమదాలవలస జీఆర్‌పీ అదుపులోకి తీసుకుంది. యువకుడిని విచారించి నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎచ్చెర్లలో 7 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. చైన్‌స్నాచింగ్‌లో దొంగిలించిన బంగారాన్ని ఎచ్చెర్ల గ్రామానికి చెందిన రామునాయుడికి ఇచ్చినట్టు రైల్వే పోలీసు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఎచ్చెర్లకు చెందిన రామునాయుడును, ఆ బంగారాన్ని అప్పటికే కరిగించి విక్రయించిన గుప్తాను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చి చివరి నిమిషంలో తప్పించినట్లు తెలిసింది. కేసు నుంచి తప్పించడానికి రామునాయుడు నుంచి రూ.2లక్షలు, గుప్తా నుంచి రూ.50వేలు జీఆర్‌పీ పోలీసులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో శ్రీకాకుళం రూరల్ మండలానికి చెందిన జీఆర్‌పీ ఏఎస్‌ఐ కీలకభూమిక పోషించినట్టు ఎచ్చెర్లలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇందులో ఎచ్చెర్లకు చెందిన విశ్రాంత వీఆర్వో జేవీఆర్ నాయుడు (పొట్టినాయుడు) మధ్యవర్తిత్వం నడిపినట్టు చెబుతున్నారు.
ప్రమేయం ఉన్నా.. తప్పించారు
ఈ కేసు నుంచి తప్పించుకున్న రామునాయుడు ఒకటో నిందితుడి నుంచి బంగారం తీసుకొని శ్రీకాకుళంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ.2 లక్షలకు కుదువపెట్టి డబ్బులు తీసుకున్నట్టు రైల్వే పోలీసుల విచారణలో గుర్తించారు. కొన్ని రోజుల తర్వాత ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువ పెట్టిన బంగారాన్ని ఎచ్చెర్ల గ్రామానికి చెందిన గుప్త అనే వ్యాపారితో విడిపించాడు. చోరీ బంగారాన్ని విక్రయించడానికి రామునాయుడు, గుప్తా ప్రయత్నాలు చేసినా ఎవరూ వాటిని కొనుగోలు చేయలేదు. చివరికి ఆ బంగారాన్ని కరిగించి విక్రయించేశారు. ఈ ప్రక్రియ పూర్తిచేసిన కొన్ని రోజులకే రైల్లో దొంగతనం చేసిన నరసన్నపేటకు చెందిన యువకుడు రైల్వే పోలీసులకు చిక్కాడు. తనదైన స్టైల్లో విచారించగా రామునాయుడుకి బంగారం ఇచ్చినట్టు నిందితుడు అంగీకరించాడు. దీంతో రామునాయుడుని ఆమదావలస రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రామునాయుడిని కేసు నుంచి తప్పించడానికి విశ్రాంత వీఆర్వో పొట్టినాయుడు రంగంలోకి దిగారు. పొట్టినాయుడు సమీప బంధువు చింతాడకు చెందిన జీఆర్‌పీ ఏఎస్‌ఐని కలిసి రామునాయుడుని ఈ కేసు నుంచి తప్పించాలని మంతనాలు జరిపినట్టు తెలిసింది. దీంతో రామునాయుడుతో రూ.2లక్షలు ఏఎస్‌ఐకి పొట్టినాయుడు ముట్టజెప్పినట్టు తెలిసింది. చోరీ చేసిన బంగారాన్ని కుదువ నుంచి విడిపించి కరగదీసిన గుప్త నుంచి 7 తులాల బంగారాన్ని రికవరీ చేయించి ఆయన నుంచి రూ.50 వేలు ఇప్పించినట్టు విశ్వసనీయ సమాచారం. చోరీ బంగారం కుదువ పెట్టడం, ఆ తర్వాత కరగదీయడంలో రామునాయుడు ప్రమేయం ఉన్నా కేసు నుంచి తప్పించారని ఎచ్చెర్లలో ఈ వ్యవహారం చక్కర్లు కొడుతుంది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని
రామునాయుడు రిమ్స్‌లో ఉద్యోగినంటూ గ్రామంలో చెప్పుకొని తిరుగుతుంటాడని తెలిసింది. వాస్తవంగా రామునాయుడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు భోగట్టా. గతంలో ఎచ్చెర్ల టీడీపీ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా పని చేశారని తెలిసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ పరిచయంతోనే రైల్వే కోచ్‌లో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నరసన్నపేటకు చెందిన యువకుడు రామునాయుడికి బంగారం ఇచ్చినట్లు తెలిసింది. ఇదే మొదటిసారి కాదని తెలిసింది. రామునాయుడు ఇలాంటి వ్యవహారాలు చాలా చేసినట్లు ఆరోపణలున్నాయి. రామునాయుడిని జీఆర్‌పీ పోలీసులు తీసుకువెళుతున్నప్పుడు తప్పుడు పనులు చేస్తావా అంటూ గ్రామ పెద్దలు రెండు చెంపదెబ్బలు కొట్టినట్టు తెలిసింది. ఈ కేసు నుంచి రామునాయుడు తప్పించడానికి ఏఎస్‌ఐ జీఆర్‌పీలో పని చేయడం, సమీప బంధువు కూడా కావడం కారణమని ప్రచారం సాగుతుంది.
Comments