top of page

గోపాల‘పెంట’ చేసేశారు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • అధికారులకు తలనొప్పిగా మారిన ఇసుక టెండర్లు

  • ఆరు ర్యాంపులకు అర్ధాంతరంగా నిలిచిన ప్రక్రియ

  • గోపాలపెంట, నివగాంలో తక్కువ కోట్‌ చేసినవారికి చుక్కెదురు

  • క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ వేసిన కలెక్టర్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విస్తరిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చేయడానికి రెండే వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వీటికి ప్రభుత్వ మద్దతు కూడా ఉండటం వల్ల ఐదేళ్ల పాటు వెనక్కు తిరిగి చూడక్కర్లేదన్న భావన. మద్యం పాలసీని ప్రైవేటీకరించడం వల్ల కూటమి, వైకాపా నేతలు కలిసి ఈ వ్యాపారాన్ని సోమవారం పంచుకున్నారు. ఇప్పుడు మంగళవారం ఇసుక ర్యాంపుల వ్యవహారం దగ్గరకు వచ్చేసరికి కేవలం కూటమి నాయకులే ఇసుక తవ్వకాలు చేపట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌ టెండరు వ్యవస్థ, జిల్లా ఇసుక కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌ వంటివి పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాంపులు తమకే కావాలని పట్టుపడుతున్నారు. అలా అని బిడ్డింగ్‌లో తక్కువ మొత్తం కోట్‌ చేశారా అంటే అదీ లేదు. పోనీ తక్కువ మొత్తం కోట్‌ చేసినవారికే ఇవ్వండి అని పెద్దమనసుతో వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో నిబంధన ప్రకారం తక్కువ కోట్‌ చేసినవారికి ఇవ్వలేక, అలా అని టీడీపీ నాయకుల చేతిలో పెట్టలేక జిల్లా యంత్రాంగం సతమతమైపోతుంది. మద్యం షాపులకు లైసెన్స్‌ ఫీజు ఎక్కువ కాబట్టి, అది కూడా లాటరీ పద్ధతిలో కేటాయించారు కాబట్టి తమ లాభాన్ని వేరేవారితో పంచుకోడానికి సిద్ధపడ్డాం కానీ ఇసుక నుంచి బంగారం లాంటి డబ్బు వస్తుంటే ఎలా వేరేవారికి అవకాశమిస్తామని తెలుగుదేశం నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు (శ్రీకాకుళం మినహా) ఇందుకోసం అధిష్టానంతోనే మాట్లాడుతున్నారు.

నిబంధనల మేరకు జిల్లాస్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ఆరు రీచ్‌ల్లో ఇసుకను తోడి స్టాక్‌ పాయింట్‌కు తరలించడానికి సీల్డ్‌ టెండర్లను ఈ నెల 11న ఆన్‌లైన్‌లో ఆహ్వానించారు. శ్రీకాకుళం పరిధిలో బట్టేరు, హయాతినగరం, గార పరిధిలో బూరవల్లి, అంబళ్లవలస, నరసన్నపేట పరిధిలో గోపాలపెంట, కొత్తూరు పరిధిలో నివగాం రీచ్‌లకు ఆన్‌లైన్‌లో 38 మంది బిడ్‌లను దాఖలు చేశారు. ఈ నెల 16లోగా టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్లను నిర్ణయించాలి. టెండరు దాఖలు చేసిన సంస్థలతో నెగోసియేషన్‌ కోసం ఈ సీల్డ్‌ కవర్లను సోమవారం సాయంత్రం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తెరిచారు. టెండర్ల బాక్సులు తెరిచే సమయంలో బిడ్‌లు దాఖలు చేసినవారు కచ్చితంగా ఉండాలి. ఈ ప్రక్రియను వీడియో తీయాలి. అయితే అధికారులు కొందరికి మాత్రమే సమాచారమిచ్చి నిబంధనలకు విరుద్ధంగా సోమవారం సీల్డ్‌ టెండర్లు తెరిచినట్టు బిడ్‌లు దాఖలు చేసినవారు ఆరోపిస్తున్నారు. నరసన్నపేట మండలం గోపాలపెంట ఇసుక రీచ్‌లో ఇసుకను స్టాక్‌ పాయింట్‌కు తరలించడానికి నాలుగు ఏజెన్సీలు బిడ్‌ దాఖలుచేశాయి. మొదట ఈ బిడ్‌లను తెరిచి రెండు ఏజెన్సీలను తిరస్కరించి అందులో లోయస్ట్‌ బిడ్‌ దాఖలు చేసిన హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌ ఏజెన్సీకి టెండర్‌ దక్కినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగడంతో దీన్ని హోల్డ్‌లో పెట్టి మంగళవారం పునఃప్రారంభించారు. అయితే సోమవారం తిరస్కరణకు గురైన శ్రీకాకుళానికి చెందిన పీవీఎస్‌ ఏజెన్సీకి మంగళవారం గోపాలపెంట రీచ్‌ను కట్టబెట్టారు. ఆర్‌ఎస్‌ఆర్‌ ఏజెన్సీ ఇన్‌కమ్‌ టాక్స్‌కు సంబంధించిన నెట్‌వర్త్‌ సర్టిఫికేట్‌ ఒరిజినల్‌ను బిడ్‌లో పొందుపరిచిన పత్రాలతో జత చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఒరిజినల్‌ సర్టిఫికేట్లను తీసుకురావడానికి గడువు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఆర్‌ ఏజెన్సీ ప్రతినిధులు కోరినా అధికారులు అంగీకరించలేదని బాధితులు చెబుతున్నారు. నెట్‌వర్త్‌ సర్టిఫికేట్‌ జత చేయలేదని సోమవారం తిరస్కరణకు గురైన పీవీఎస్‌ ఏజెన్సీకి ఏ ప్రాతిపదికన మంగళవారం టెండర్‌ ఖరారు చేశారని ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి కనుసన్నల్లోనే టెండర్లు ఖరారు ప్రక్రియ జరుగుతుందని బాధిత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. టెండర్ల ఖరారు విషయంలో కూటమి పార్టీల ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని విమర్శలు ఉన్నాయి.

నివగాం ర్యాంపులో ఇసుకను నది నుంచి తోడి బయట వేయడానికి మెట్రిక్‌ టన్నుకు రూ.63ను ఒక సంస్థ కోట్‌ చేసింది. ఆ ర్యాంపునకు వచ్చిన టెండర్లలో ఇదే తక్కువ. కానీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు చెందిన వ్యక్తులు రూ.90కి కోట్‌ చేశారు. నిబంధనల ప్రకారం రూ.63 ధర పెట్టినవారికి ఈ కాంట్రాక్ట్‌ ఇవ్వాలి. కానీ ఇది వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోతుందని స్వయంగా ఎమ్మెల్యేనే అమరావతి వర్గాలకు ఫోన్‌ చేయడంతో దీన్ని నిలిపివేశారు. పైన చెప్పుకున్న రెండు వ్యవహారాల్లోనూ ఇలాగే జరగడంతో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెబుతున్న అభ్యంతరాల్లోనూ పాయింట్‌ ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే ఒక టన్ను ఇసుకను నది నుంచి తవ్వి ట్రాక్టర్‌ ద్వారా బయట వేయడానికి రూ.110కి మించకూడదని నిబంధనలు విధించింది. వాస్తవానికి ఇదే కిట్టుబాటు కాని ధర. నదిలో మనుషులు ఇసుకను తవ్వి ట్రాక్టర్‌లోకి ఎత్తితే కేవలం ట్రాక్టర్‌ ఖర్చే ఒక ట్రిప్పునకు రూ.500 అవుతుంది. కాబట్టి రూ.110కి ఇసుక ఎత్తడమనేది జరిగే పని కాదు. అటువంటిది రూ.63, రూ.56కు టెండర్‌ వేశారంటే వారు కచ్చితంగా నదిలో మిషిన్లు పెట్టి ఎత్తుతారని, అటువంటి వారికి ఇవ్వొద్దంటూ తెలుగుదేశం నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి ఈ కాంట్రాక్టు టీడీపీ నేతలకు వచ్చినా, వైకాపా నాయకులకు వచ్చినా ఎవరైనా నదిలో యంత్రాలు పెట్టే తోడేస్తారు. మనుషులను పెట్టి ట్రాక్టర్లతో ఎత్తించడమనేది కేవలం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కళ్లు కప్పడానికి పెట్టిన నిబంధన మాత్రమే. గతంలో జేపీ వెంచర్స్‌ చేసినా, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ అయినా ప్రొక్లయినర్లు పెట్టడం, లారీల కొద్దీ తరలించుకుపోవడం ఇక్కడ సాధారణం. జిల్లాలో అన్ని ఇసుక ర్యాంపులను రోజూ కలెక్టర్‌, జేసీ లాంటి అధికారులు పరిశీలించలేరు. కేవలం స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని, మైన్స్‌ విభాగాన్ని మేనేజ్‌ చేసి ఇసుకను తరలించుకుపోతుంటారు. ఇలా ప్రస్తుతం 6 ర్యాంపుల కోసం నిర్వహించిన టెండర్లకే ఇన్ని తలనొప్పులైతే, మరికొద్ది రోజుల్లో మరో 6 ర్యాంపులకు టెండర్లు పిలవనున్నారు. ఇది కాకుండా పర్యావరణ అనుమతుల వద్ద నిలిచిపోయిన మరో నాలుగు ర్యాంపులు కూడా త్వరలోనే ప్రారంభించాల్సి ఉంది. తెలుగుదేశం నేతలు ఎక్కువ మొత్తానికి కోట్‌ చేయడం, తక్కువ మొత్తం వేసినవారికి టెక్నికల్‌ అబ్జెక్షన్స్‌ చెబుతూ అడ్డుకోవడం పెద్ద తలనొప్పిగా మార్చారు. దీంతో కలెక్టర్‌ ఒక కమిటీని నియమించారు. టెండర్లు వేసిన సంస్థలకు సంబంధిత ట్రాక్టర్‌ యజమానులతో కుదిరిన ఒప్పందం పత్రాలు, జీఎస్టీతో పాటు టెండర్‌ ఫారమ్‌తో దఖలు చేసిన మిగిలిన దరఖాస్తులను పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో ఓ బృందాన్ని నియమించారు. వీరు ఇచ్చిన నివేదిక మేరకు టెండరు ద్వారా కాంట్రాక్ట్‌ దక్కించుకునే సంస్థకు అర్హతలు ఉన్నాయా, లేవా అన్నది తేలుస్తారు. వీరిని క్షేత్రస్థాయిలో మేనేజ్‌ చేసుకొని టీడీపీ నాయకులు ఇసుక ర్యాంపులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page