top of page

గాయని ప్రవస్థి..సినిమా కెరీర్‌కు స్వస్తి

  • Guest Writer
  • Apr 22
  • 3 min read

ree

చిన్న వయసులోనే అద్భుత స్వరంతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె. విశ్వనాధ్‌, ఎస్పీ బాలు లాంటి మహమహులతో జూనియర్‌ ఆశా భోంశ్లే అని అభినందనలు అందుకున్న గాయని అత్తలూరి ప్రవస్థి ఆరాధ్య సినీ నేపథ్య రాజకీయాలతో విరక్తి చెంది గుడ్‌బై చెప్పేసింది! సరిగమప జూనియర్స్‌, పాడుతా తీయగా, సూపర్‌ సింగర్స్‌ తదితర టైటిల్స్‌ కైవసం చేసుకున్న ప్రవస్థి సంయమనం కోల్పోయి తన ఆవేదన వెళ్ళబుచ్చింది! అడుగడుగునా అవమానాలు, వివక్ష, తమ వారి కోసం సీనియర్లు ఎదుటివారిని తొక్కేయడాలకు విసుగు చెంది తనే స్వస్తి పలికింది. పాడుతా తీయగా సిల్వర్‌ జూబ్లీ పోటీల్లో పాల్గొన్న ప్రవస్థి 12వ రౌండ్‌ లోనే ఎలిమినేట్‌ అవ్వడంతో తన కోపాన్ని ఆపుకోలేకపోయింది! ఆ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కీరవాణి, చంద్రబోస్‌, సునీతలను తూర్పారబట్టింది! ‘‘పాడుతా తీయగా పోటీలలో పాల్గొనాలని కలలు కంటున్న గాయకులారా... మీకు జడ్జిలు బాగా తెలిసివుంటేనే పాల్గొనేందుకు ప్రయత్నించండి లేదంటే తొక్కేస్తారు, మీరు ఎంత బాగా పాడినా పోటీ నుంచి తరిమేస్తారు’’ అంటూ హెచ్చరించింది.

ఇప్పటికే తెలుగు, తమిళ్‌ సరిగమప ఛాంపియన్‌ టైటిల్‌తో పాటు పాడుతా తీయగా 11వ సీజన్‌ విన్నర్‌ అయిన ప్రవస్థి ఇవాళ చేసిన తీవ్ర ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. మాటీవీలో ప్రసారమైన సూపర్‌ సింగర్స్‌ పోటీల్లో గీతా మాధురి టీమ్‌లో ఉండి 104 డిగ్రీల జ్వరంలో సైతం ‘‘అమ్మ చూడాలి నాన్నను నిన్ను చూడాలి’’ అంటూ పాడిన పాటకు నూటికి నూరు మార్కులు కైవసం చేసుకుని అందరినీ ఎమోషనల్‌ గా ఏడిపించిన గాయని ప్రవస్థి ఇలా కట్టలు తెంచుకున్న ఆవేదనలో ‘‘సినిమా కెరీర్‌ వదిలేస్తున్న’’ అని ప్రకటించడం నిజంగా విచారకరం!

అసలేం జరిగింది... పాడుతా తీయగా రజతోత్సవ పోటీలకు ప్రవస్థిని కూడా ఆహ్వానించారు. ప్రవస్థి ఎంపిక సునీతకు నచ్చలేదట! ప్రవస్థిని చూసిన ప్రతిసారి ఆమె ఒక అసహ్యకర చూపు చూస్తున్నదట! ప్రవస్థి పాడేందుకు రెడీ అవుతూ మైక్‌ టెస్ట్‌ చేసుకుంటున్నప్పుడు, సునీత కీరవాణితో చెబుతున్న మాటలు ప్రవస్థి చెవిలో పడటంతో భలే బాధ కలిగిందట! ఆ అమ్మాయికి హై రేంజ్‌ ఉండదు, బేస్‌ ఉండదు అంటూ ప్రవస్థి గురించి కీరవాణికి లేనిపోని మాటలు ఎక్కించడం తనకు మింగుడు పడలేదట! అయినా దిగమింగుకుని పట్టుదలతో కసిగా ‘‘అంత రామమయం’’ పాట పాడిరదట! అది మేల్‌ వాయిస్‌ పాట! ఆ పాట ప్రవస్థి కి ఇవ్వడమే అన్యాయం! ఏ జానర్‌ లో అయినా ఇరగదీసే ప్రతిభ వున్న ప్రవస్థి ఆ పాటను అద్భుతంగా పాడితే, సునీత తన కామెంట్స్‌ లో కీరవాణికి ముందస్తుగా చెప్పిన మాటలనే రిపీట్‌ చేసిందట! కీరవాణి కూడా ఏదో భలే మేనేజ్‌ చేసావులే అని నెగటివ్‌ కామెంట్స్‌ చేశారట! ఇక లిరిక్‌ లో తప్పు పట్టాల్సిన చంద్రబోస్‌ ఏ తప్పు దొరకక ‘‘ఆర్డ్రత లేదు’’ అని కామెంట్‌ చేశారట! అదే మరో ఇద్దరు సింగర్స్‌ తప్పులు పాడినా అద్భుతం అని మెచ్చుకున్నారట! ఇంకో సింగర్‌ లోపిచ్‌ లో పాడుతునప్పుడు రేంజ్‌ పెంచు అంటూ సునీత సైగ చేసి మరీ చెప్పిందట! ఇక ఎలిమినేషన్‌ టైం లో ఈ సన్నివేశం చూడలేమంటూ కీరవాణి, చంద్రబోస్‌ సీట్లలోంచి లేచి వెళ్లిపోయారట! తన ఎలిమినేషన్‌ ప్రకటించగానే సునీత నవ్విన విలన్‌ నవ్వు తన మనసును గాయం చేసిందని ప్రవస్థి ఆవేదన వ్యక్తం చేసింది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుందామని అక్కడే వున్న ప్రవస్థి తల్లిగారు సునీత దగ్గరకు వెళితే ‘‘ముందు ఇక్కడ నుంచి వెళ్ళు దయచెయ్‌’’ అంటూ ఏకవచనంతో చెప్పడంతో తాను హర్ట్‌ అయ్యానని ప్రవస్థి అంటోంది. అవుట్‌ ఫిట్‌ విషయంలోనూ బాడీ షేమింగ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది అత్తలూరి ప్రవస్థి ఆరాధ్య.

ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి ఇక సినిమా కెరీర్‌ కు స్వస్తి పలకాలని, ఈ రాజకీయాలతో అలసిపోయి ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రవస్థి విడుదల చేసిన వీడియోలో తెలిపారు. ‘‘పెళ్లిళ్లలో పాడే గాయకులంటే తనకు అసహ్యం’’ అని కీరవాణి అనడం న్యాయమా అని ఆమె తీవ్రంగా ప్రశ్నించింది. ఆర్ధిక ఇబ్బందులు వల్ల తాను వెడ్డింగ్‌ ఈవెంట్స్‌ లో కూడా పాడతానని, అందులో తప్పేం ఉందని ప్రవస్థి ఎదురు ప్రశ్నించింది. చిత్రమ్మ, జానకమ్మ, సుశీలమ్మ అందరూ తన స్వరాన్ని మెచ్చుకున్నారని, కానీ సునీత లాంటి వాళ్ళు తనకు అవకాశాలు రాకుండా తొక్కేసారని ఆమె ఆరోపించారు. రోజూ చాలామంది తమ స్టూడియోలకు వచ్చి చాకిరీ చేసుకుంటున్నారని, అందులో అవకాశం ఇస్తానని కీరవాణి అనడం అంటే, ఆయనకు గాయకుల పట్ల ఏపాటి గౌరవం ఉందో చెప్పక్కరలేదని ప్రవస్థి కీరవాణిని తీవ్రంగా విమర్శించింది. తనకు సినిమాల్లో పాడే అవకాశాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు పాడుతా తీయగా లోను కావాలని ఎలిమినేట్‌ చేశారని అక్కసుతో మాట్లాడటం లేదని, ఉన్న వాస్తవాన్ని తెలియచేస్తున్న, నమ్మితే నమ్మండి లేదంటే లేదు అంటూ ప్రవస్థి స్పష్టం చేసింది!

మొత్తానికి ప్రవస్థి పాట విని, కూచిపూడి నృత్యం చూసి పులకించిపోయిన దర్శకుడు విశ్వనాధ్‌ తనను దగ్గరకు పిలిపించుకుని ముద్దు పెట్టి ఆశీర్వదించి తన ఒడిలో కూర్చోబెట్టుకున్న చిన్నారి గాయని ప్రవస్థి ఇప్పుడు యువ గాయనిగా సినిమాల్లో పాడుతూ తనకు ఎదురయిన చేదు అనుభవాలతో మధ్యలోనే తనకు తాను సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేయడం బాధాకరం, విచారకరం! కానీ, పాపం ప్రవస్థికి తెలియనిది ఏమిటంటే... సినీరంగంలో తొక్కేయడాలు కామన్‌! అనాదిగా వస్తున్న సంప్రదాయం! ఇలా తొక్కబడి వివక్షకు గురై నిశ్శబ్దంగా పక్కకు తప్పుకుని వేరే ఉపాధి చూసుకున్న వారు ఎందరో! కాకపోతే, ప్రవస్థకి వారికి తేడా ఒక్కటే... ధైర్యం! ప్రతిభ, ధైర్యం రెండూ టన్నుల కొద్దీ ప్రవస్థి లో ఉన్నాయి కాబట్టే ఆస్కార్‌ విజేత కీరవాణిని ఢీ కొట్టింది! సెహభాష్‌ ప్రవస్థి!

- డా. మహ్మద్‌ రఫీ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page