(సత్యంన్యూస్, గార)

గార ఎస్‌బీఐలో తాకట్టులో ఉన్న బంగారు నగలు మాయమైన తర్వాత పోలీసులు రికవరీ చేసినా, ఇంతవరకు తమ ఆభరణాలు అప్పగించడంలేదంటూ ఖాతాదారులు బ్రాంచి వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. 2023 నవంబరులో లాకర్‌లో ఉండాల్సిన బంగారు నగలు మాయమయ్యాయని, వీటిని ప్రైవేటు బ్యాంకుల్లో పద్దుపెట్టి సొమ్ములు తీసుకున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని తెచ్చి మళ్లీ బ్యాంకులో బ్యాంకులో జమ చేశారు. అప్పట్నుంచి తమ బంగారం విడిపించుకుంటామంటూ ఖాతాదారులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ప్రతీసారి అక్కడి సిబ్బంది ఏదో ఒక కథ చెప్పి తప్పించుకోవడంతో కొద్ది రోజుల క్రితం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ డిసెంబరు 2న నగలు విడిపించుకోవచ్చని హామీ ఇచ్చారు. ఆమేరకు శనివారం బ్యాంకుకు చేరుకున్న ఖాతాదారులకు సిబ్బంది అప్పుడే కుదరదని చెప్పడంతో ఆందోళనకు దిగారు. వాస్తవానికి పోలీసులు రికవరీ చేసి తెచ్చిన తర్వాత దాన్ని విడిపించుకునే ఖాతాదారులకు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించాలంటూ కోర్టుకు బ్యాంకు తరఫున అఫిడవిట్ సమర్పించాలి. ఆ విషయంలో బ్యాంకు అధికారులు జాప్యం చేశారు. ఆ తర్వాత అఫిడవిట్ ఇచ్చినా మెజిస్ట్రేట్ లేకపోవడంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. బంగారం తమ చేతికి రాలేదన్న ఆందోళనలో ఖాతాదారులుంటే, వడ్డీ కట్టాలంటూ నోటీసులు పంపడంతో బ్యాంకు మీద ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comentários