top of page

గార కేజీబీవీలో పిల్లల ప్రాణాలతో చెలగాటం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 10
  • 2 min read
  • 30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

  • నాలుగు రోజుల పాటు నిజాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ రజినీ కుమారి

  • పురుగులు పట్టిన రాగి పిండి, నిల్వ అన్నం, పాడైన చిక్కీల వడ్డన

  • చేయి దాటే వరకు అధికారులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వైనం

  • వైద్య బృందంతో రంగంలోకి దిగిన సమగ్ర శిక్ష ఏపీసీ

  • ప్రస్తుతం విద్యార్థినులు క్షేమం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గార మండలం శాలిహుండం కేజీబీవీ పాఠశాలలో సోమవారం నుంచి విద్యార్థినులు డయేరియా బారిన పడి బాధపడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో నాణ్యత లేని ఆహారం, తీవ్ర అపరిశుభ్రత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్ నిర్ధారించారు. అయితే, విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటూ, నాలుగు రోజుల పాటు అధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రిన్సిపాల్ రజినీ కుమారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోమవారం పాఠశాలలో పలువురు విద్యార్థులు డయేరియా బారిన పడితే గురువారం సాయంత్రం వరకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా గార మండలం శాలిహుండం కేజీబీవీ ప్రిన్సిపాల్ రజినీ కుమారి దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అధికారులకు సమాచారం అందిన వెంటనే వైద్య బృందాన్ని వెంటబెట్టుకొని వెళ్లడంతో అప్పటికే సుమారు 30 మంది విద్యార్థులు నాలుగు రోజులుగా డయేరియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం అందులో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి కారణమైంది.

ఈనెల ఆరో తేదీ సాయంత్రం నుంచి పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా అధికారులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. పరిస్థితి విషమించడంతో బుధవారం గార పీహెచ్‌సీ సిబ్బందితో ట్రీట్‌మెంట్ చేయించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. గురువారం మరికొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటివరకు పాఠశాల నుంచి ఈ సమాచారం వెలుగు చూడకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ నిలవరించే ప్రయత్నం చేశారు.

కేజీబీవీ పాఠశాలలో ప్రభుత్వం నిర్ణయించిన మేనూ అమలులో ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యం, వంటగదితో పాటు పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం ఇచ్చే రాగి జావ కోసం వినియోగించే రాగి పిండి పురుగులు పట్టినా, దాన్నే నాలుగు రోజులుగా వండి వడ్డించినట్లు అధికారులు గుర్తించారు. పాడైన శెనగ పల్లీల చిక్కీలు వద్దన్నా పంపిణీ చేసినట్లు విద్యార్థినులు అధికారులకు వివరించినట్లు తెలిసింది. వడ్డించగా మిగిలిన ఉడకబెట్టిన గుడ్లను, రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత రోజు వడ్డిస్తున్నట్లు విద్యార్థులు అధికారుల వద్ద వాపోయినట్లు తెలిసింది.

ఇలా వడ్డిస్తున్న ఆహారాన్ని సోమవారం నుంచి తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మంచంపట్టారు. వీరికి పీహెచ్‌సీ సిబ్బందిని పిలిపించి గోప్యంగా చికిత్స అందించే ప్రయత్నం చేసినా, నాలుగు రోజుల తర్వాత పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రిన్సిపాల్ సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పాఠశాలను పరిశీలించిన ఏపీసీ... నాణ్యత లేని ఆహారం, పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులకు చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని సత్యం (పత్రిక/ప్రతినిధి) కి వివరించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page