top of page

గ్రూపుల గుద్దులాట..టీడీపీలో ఇసుకాట!

Writer: NVS PRASADNVS PRASAD
  • అనుమతి లేని ఆకులతంపర నుంచి ఇసుక తరలింపు

  • ఒడిశా బిల్లులతో అక్రమార్కుల మాయాజాలం

  • గ్రామస్తులను ముందుపెట్టి అడ్డుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షడు

  • ఎమ్మెల్యే టార్గెట్‌గానే ఈ పని చేయించారని సమాచారం

  • ఎంజీఆర్‌, కలమట మధ్య ఉన్న విభేదాలతో ఇసుక దందా వెలుగులోకి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు తనకు అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తలకు మూడు వరాలిచ్చారు. అవేంటంటే.. ఇసుకను తరలించుకోవడం, నీరు`చెట్టుకు సంబంధించి రూ.240 కోట్ల పాత బిల్లులు రిలీజ్‌ చేయడం, మద్యం షాపులకు టెండర్లు నిర్వహించి వారికి అప్పగించడం. ఒక్కో లిక్కర్‌ షాపు వల్ల కనీసం పది మంది కార్యకర్తలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గత ప్రభుత్వంలో బడాబాబులే ఇసుక తవ్వకాలు నిర్వహించారు. ఈసారి కూడా అదే మాదిరిగా ఇసుకను తరలించుకుపోవాలని చూస్తున్న స్థానిక టీడీపీ నేతలకు ఆ పార్టీ నేతలే అడ్డుగా నిలవడం గమనార్హం. ఎన్నికల సమయంలో జిల్లా టీడీపీలో గ్రూపుల వ్యవహారం బయటపడిరది. సొమ్ము ఖర్చు చేసే వారికి టిక్కెటివ్వడం ద్వారా టీడీపీ కొందరిని పక్కన పెట్టింది. దీన్ని మనసులో పెట్టుకుని ఆ పార్టీ పాతకాపులు ప్రస్తుత నేతల ఇసుక దందాలను అడ్డుకుంటున్నారు. ఇది సంతోషించదగ్గ పరిణామమే. ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నేతలు చేయాల్సిన పనిని ఎక్కడికక్కడ టీడీపీ నేతలే చేస్తున్నారు. తాజాగా పాతపట్నంలో అనుమతులు లేని ర్యాంపు నుంచి తరలిపోతున్న ఇసుకను స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ అడ్డుకున్నారు. దీంతో నియోజకవర్గంలో పాతకాపులు, కొత్త ఎమ్మెల్యే వర్గానికి మధ్య ఉన్న పొరపొచ్చాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే అండదండలతో ఇసుక తరలిపోతోందంటూ ఎక్కడా కలమట రమణ తన పేరు ప్రస్తావించకుండానే అధికారుల మీదకు ఈ నెపాన్ని నెట్టేశారు.

ఒడిశా బిల్లులతో అకులతంపర నుంచి..

వాస్తవానికి స్థానిక నాయకుల ప్రోద్బలంతోనే ఇసుక తరలిపోతుందన్న విషయం కలమట రమణకు తెలియంది కాదు. ఒడిశా ప్రభుత్వం నుంచి కొనుక్కున్న బిల్లుతో జిల్లాలో కొత్తూరు మండలం ఆకులతంపర రేవు నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. వాస్తవానికి ఆకులతంపరకు ఏ దిక్కులో కూడా ఒడిశా బోర్డర్‌ ఉండదు. కానీ ఒడిశా బిల్లులు చూపించి లారీలకు లారీల ఇసుకను తరలించేస్తుంటే చూస్తూ ఊరుకోవడం అధికారుల వల్ల మాత్రమే జరిగే పని కాదు. దీని వెనుక రాజకీయ యంత్రాంగం ప్రమేయం ఉంటుంది. అందుకే కలమట రమణ ఓ పథకం ప్రకారం మొదట గ్రామస్తులతో లారీలు అడ్డుకునేటట్టు చేసి శనివారం ఉదయం ఆయన రంగంలోకి దిగారు. జిల్లాలో నేరడి, తాళాడ నదీ పరివాహక ప్రాంతాలకు ఓవైపు ఒడిశా బోర్డర్‌ ఉంటుంది. పోనీ అక్కడ ఇసుకను తవ్వుకొని ఒడిశా బిల్లు చూపించి ఆంధ్రా రోడ్డు ఎక్కారంటే ఒక అర్థముంది. కానీ ఆంధ్రాలోనే ఉన్న ఆకులతంపరలో ఇసుక ఎత్తడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమే. భామిని మండలం బాలేరులో ఒడిశా అనుమతులతో ఇసుక తవ్వుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే ఆంధ్రా రోడ్డు మీదుగానే లారీలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థానిక తహసీల్దార్‌ అనుమతి తీసుకోవాలి. ఆకులతంపరలో మాత్రం ఒడిశా బిల్లుతో ఇసుక ఎత్తడానికి ఏమాత్రం అధికారాలు లేవు. కానీ అక్కడ టీడీపీ నాయకుల అండదండలతోనే తరలిపోతుందన్న విషయం కలమట రమణకు తెలియందికాదు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు రెగ్యులర్‌ పాలసీ తీసుకురాలేదు. రెండురోజుల్లో డి`పట్టా భూముల్లో ఇసుక తవ్వడానికి అనుమతులు ఇవ్వనుంది. అంతవరకు నారాయణపురం కాలువల్లో పేరుకుపోయిన ఇసుకను తవ్వడానికి కాఖండ్యాం వద్ద ఒకటి, గార మండలంలో ఒక రీచ్‌కు అనుమతులిచ్చింది. కానీ పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం గత కొద్ది రోజులుగా ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. ఒడిశా పేరుతో ఒక మాఫియా ఆంధ్రాలో మకాం వేసి మీడియాను బెదిరించి లేదా ప్రలోభపెట్టి మరీ ఇసుకను తవ్వుకుపోతోంది. ఇప్పుడు స్వయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడే అక్రమ తరలింపును అడ్డుకోవడంతో ఈ వ్యవహారం పతాక శీర్షికలకు ఎక్కనుంది.

గ్రూపుల గోలలో బట్టబయలు

పాతపట్నంలో ఎప్పట్నుంచో కలమట రమణ, మామిడి గోవిందరావులు రెండు గ్రూపులుగా టీడీపీ రాజకీయాలు చేస్తున్నారు. గోవిందరావు ఎమ్మెల్యేగా, కలమట రమణ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ గ్యాప్‌ మరింత పెరిగింది. ఎన్నికల్లో పోటీకి టికెట్‌ వచ్చిన తర్వాత కలమట రమణను గోవిందరావు కలిశారు. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ వీరిద్దరూ అక్కడ చేతులు కలపలేదు. గోవిందరావు గెలుపులో కలమట రమణ పాత్ర ఎంత ఉంది? ఎన్ని ఓట్లు వేయించుంటారు? చెప్పాలని తెలుగు వన్‌ ఛానల్‌ విలేకరి ప్రశ్నిస్తే.. నమస్కారమంటూ ఆ ప్రశ్నను అక్కడితో ముగించేశారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ పొరపొచ్చాలు ఉన్నాయి. అయితే టీడీపీ సింబల్‌తో గోవిందరావు పోటీ చేయడం వల్ల క్యాడర్‌ ప్రస్తుతం ఆయనతోనే ఉన్నారు. అలాగే వైకాపా అసమ్మతి నాయకులు కూడా మొన్నటి ఎన్నికల ముందు నుంచీ గోవిందరావుకే మద్దతు తెలుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇసుక అతి పెద్ద ఆదాయవనరు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే అండదండలు లేకుండా అక్రమంగా తరలించుకుపోవడం దాదాపు అసాధ్యం. దీని వెనుక చేతులు మారే సొమ్ము ఎమ్మెల్యే కార్యాలయానికే చేరుతోందన్న భావనతోనే కలమట రమణ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. 12 చక్రాల లారీ లోడు ఇసుక విశాఖపట్నానికి చేరాలంటే రూ.70వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.30 వేలు స్థానికంగా కప్పం కడుతున్నారు. ఇది పత్రికలంటున్న మాట కాదు. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు కలమట రమణ శనివారం మీడియాకు చెప్పిందే. అదే సమయంలో అక్రమంగా ఇసుక తవ్వుకుపోతున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడే చెప్పినప్పుడు తహసీల్దార్‌ స్థాయి వ్యక్తులు పట్టించుకోకుండా ఉండరు. పట్టించుకోలేదంటే కచ్చితంగా అక్కడి పెద్దల అండదండలు ఉన్నట్లేనని కలమట రమణ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page