కలిసివచ్చిన అధినేత రాజకీయ అవసరాలు
కొందరికి చెక్ పెట్టేందుకు అనూహ్యంగా తెరపైకి కావలి పేరు
బీజేపీ నుంచి వీర్రాజు ఎంపికలోనూ చంద్రబాబు ఎత్తుగడ అదే
ఇటు జిల్లా.. అటు రాష్ట్రంలో చర్చనీయాంశంగా వీరిద్దరి ఎంపిక
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్సీగా గెలుపొందినవారి పేర్లు ప్రకటించడం కేవలం లాంఛనమే. ఇందులో నాగబాబు, బీద రవిచంద్ర, బీటీ నాయుడుల అభ్యర్థిత్వాలపై చర్చ లేదు. కేవలం టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజుల పేర్లను ఆ పార్టీలు ఖరారు చేయడంపైనే పెద్ద చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వీరిద్దరి ఎంపిక ద్వారా ఇటు టీడీపీ, అటు బీజేపీ ఉగాది తర్వాత కొత్త సంకేతాలు ఇవ్వనున్నాయనడంలో సందేహాలు లేవు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వల్ల కుల, ప్రాంత సమీకరణాల రీత్యా మంత్రివర్గ కూర్పును వీలైనంత వివాద రహితంగా చంద్రబాబునాయుడు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి నేటివరకు మళ్లీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాడు అన్న భరోసా ఇవ్వాలని పెట్టుబడిదారులందరూ కోరుతున్నట్లు చంద్రబాబు పదే పదే చెప్పుకొస్తున్నారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ఒకవైపు అమరావతి పూర్తికావాలన్నా, మరోవైపు వైకాపా అధికారంలోకి రాకుండా ఉండాలన్నా 2029 గానీ, అంతకు ముందే జరిగే అవకాశమున్న జమిలీ ఎన్నికల్లో గానీ కూటమే అధికారంలోకి రావాలి. అలా రావాలంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్న భావనలో ఉంది.
ప్రత్యర్థినే ఆయుధంగా చేసుకునే ఎత్తుగడ
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న కొందరి పనితీరుపై చంద్రబాబు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. అలా అని ఇప్పటికిప్పుడు వారికి ప్రత్యామ్నాయంగా వేరేవారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడానికి కొన్నిచోట్ల సమీకరణాలు కుదరడంలేదు. అందుకే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీలో తెరపైకి వచ్చిన రెండు పేర్లు చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. పార్టీ పట్ల విధేయత, చంద్రబాబు నాయకత్వం మీద విశ్వాసంతో ఉంటూ కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహించగల సామర్థ్యం ఉన్న అభ్యర్థుల వైపే చంద్రబాబు చూశారు. ఇందులో బీజేపీ తరఫున సోము వీర్రాజు పేరును ఆ పార్టీ సూచించకపోయినా స్వయంగా చంద్రబాబే ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లారని భోగట్టా. 2019`24 మధ్యలో చంద్రబాబుపై విరుచుకుపడిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా ఎలా అవకాశమిస్తారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నా సబ్జెక్టు మీద మాట్లాడటంలో ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన వీర్రాజును సానబట్టి వైకాపా మీదకు వదలడానికి, అదే సమయంలో ఇప్పటికీ కేంద్రంతో జగన్మోహన్‌రెడ్డికి ఉన్న బంధాన్ని తెగ్గొట్టడానికి వీర్రాజు ఉపయోగపడతారని భావించడం వల్లే చివరి నిమిషంలో ఆయనకు అవకాశం కల్పించి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చంద్రబాబు మరోసారి నిరూపించారు. అక్కడికి రెండు రోజుల ముందే చంద్రబాబు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావును 30 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీద కలిసి ఆయన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చంద్రబాబు చాణక్యం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత జిల్లాలో ప్రతిభాభారతిది ఒక చరిత్ర. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పని చేశారని మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన గ్రీష్మ కుటుంబంలో మూడు తరాల నుంచి ఎమ్మెల్యేలున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ మారడం, రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళీకి అవకాశం కల్పించడం వల్ల ప్రతిభాభారతి కుటుంబం గత కొన్ని ఎన్నికలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోయింది. కానీ జిల్లాలో తెలుగుదేశం శ్రేణుల్లో ఎచ్చెర్ల, రాజాం ప్రాంతాల్లో ప్రతిభాభారతి ఇమేజ్ ఇంకా తగ్గలేదు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి గ్రీష్మకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఇక్కడితో ప్రతిభాభారతి కుటుంబానికి రాజకీయ అవకాశాలు సరి అనేవారు కొందరున్నా ఎక్కడైనా గవర్నర్ పోస్టుకు ప్రతిభాభారతిని సిఫార్సు చేస్తారని ఆమె అభిమానులు భావించారు. ఈ రెండిరటిలోనూ వాస్తవాలున్నాయి. అర్థసత్యాలూ ఉన్నాయి. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించిన చోట తన కుమార్తె గ్రీష్మకు టికెట్ వస్తే చాలని ప్రతిభాభారతి భావించారు. అనూహ్యంగా ఎమ్మెల్సీ నామినేషన్‌కు రెండు రోజుల ముందు ప్రతిభాభారతిని పిలిపించిన చంద్రబాబునాయుడు అశోక్‌గజపతి రాజుతో కలిపి సుదీర్ఘ చర్చలు జరిపారు. కట్ చేస్తే.. తెల్లవారితే నామినేషన్లకు చివరి రోజనగా గ్రీష్మ పేరును ఖరారు చేశారు. దీంతో అత్తవారింట్లో ఉన్న గ్రీష్మ ఒకవైపు నుంచి, తల్లి ప్రతిభాభారతి మరోవైపు నుంచి హుటాహుటిన మంగళగిరి చేరుకొని పార్టీ బీ ఫారాలు తీసుకొని నామినేషన్‌కు సోము వీర్రాజు మాదిరిగానే చివరి నిమిషంలో వచ్చారు. ఈలోగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి తాను అసెంబ్లీలోనే ఉన్నానని, గ్రీష్మ నామినేషన్‌కు హాజరవుతానని చెప్పి అలానే వచ్చారు కూడా. టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన ఏ అభ్యర్థి తరఫునా రాని లోకేష్ గ్రీష్మ నామినేషన్‌కు రావడం జిల్లాలో సంచలనం రేపుతోంది. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే రెండు పత్రికల్లో కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులపై వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఇది కాకుండా చంద్రబాబు సొంత ఇంటెలిజెన్సీ కూడా కొంతమంది సిట్టింగ్ మంత్రుల మీద రిపోర్టులు ఇచ్చింది. అలాగే మరికొందరి మీద అవినీతి ఆరోపణలు లేకపోయినా సమర్ధవంతంగా శాఖను నిర్వహించలేకపోతున్నారన్న నివేదికలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత ఉగాదికి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీలో చర్చ నడుస్తోంది. గ్రీష్మ ఎమ్మెల్సీ స్థానంలోకి వస్తున్నా మంత్రుల స్థానాలకు ఢోకా లేదు కానీ, రాష్ట్రంలో ఎవరో ఒకరికి ముప్పు తప్పదు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 75 మంది మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లోకి అడుగు పెడతారని స్వయంగా చంద్రబాబే బుధవారం ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ రోస్టర్ కూడా మారనుంది. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. ముందుచూపుతో ఒక నాయకత్వాన్ని తయారుచేయడం కోసం ఎవరూ ఊహించని విధంగా గ్రీష్మను చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. ఇది కేవలం ఎస్సీ, యువత, మహిళ కోటాలో గ్రీష్మకు దక్కిన అవకాశం. ప్రతిభాభారతికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా జిల్లా నుంచి బలోపేతం చేయాలన్న ఆలోచన కూడా పార్టీలో కనిపిస్తోంది. ఒంగోలులో జరిగిన మహానాడులో గ్రీష్మ ఇచ్చిన స్పీచ్ వివాదాస్పదం కావడమే ఆమెకు కలిసొచ్చిన అంశం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో వైకాపా తరఫున వరుదు కల్యాణి దృఢమైన వాయిస్‌ను వినిపిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగుదేశం నాణ్యమైన మద్యాన్నే అందిస్తున్నామని భావిస్తే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే లేబుల్‌ను తీసేయొచ్చు కదా.. అంటూ నేరుగా ఆమె సెటైల్ వేశారు. అంతేకాకుండా మండలిలో మహిళగా చాలా గట్టిగా ఆమె కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ముల్లును ముల్లుతోనే తీయడం కోసం అదే మండలికి గ్రీష్మను పంపిస్తున్నారు.
నాలుగోతరం నాయకురాలు గ్రీష్మ

ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ ఆ కుటుంబంలో నాలుగో తరం రాజకీయ నాయకురాలు. గ్రీష్మ ముత్తాత అంటే అమ్మమ్మ తండ్రి కావలి నారాయణ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలోనే శాసనసభ్యులు. ఆయన తర్వాత గ్రీష్మ తాత అంటే ప్రతిభాభారతి తండ్రి జస్టిస్ పున్నయ్య రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి ఏకగ్రీవం కూడా అయ్యారు. గ్రీష్మ పెద్ద తాత అంటే జస్టిస్ పున్నయ్య సోదరుడు కూడా శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇక గ్రీష్మ తల్లి ప్రతిభాభారతి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఐదుసార్లు శాసనసభ్యురాలిగా, ఒకసారి మండలి సభ్యురాలిగా పనిచేశారు. చాలా చిన్న వయసులోనే ఎన్టీఆర్ మొదటి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి మహిళా స్పీకరుగా సేవలు అందించారు. బహుశా మొట్టమొదటి దళిత స్పీకర్ కూడానేమో. నాలుగో తరంలో గ్రీష్మకు మండలికి వెళ్లే అవకాశం కలిగింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిభా భారతి కుటుంబానికి ఎంతో గౌరవం ఉంది.
వీర్రాజు వెనుకా బాబు లౌక్యమే

కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా, సీటొచ్చినా, పదవొచ్చినా ఆగదు కాక ఆగదు. ఏ నిమిషానికి ఎవరికి ఎందుకు సీటొస్తుందో ఎవరికీ తెలియదు. వీర్రాజుకు రెండోసారి కూటమి అధికారంలో సీటు ఎందుకు ఇచ్చారని చాలామంది టీడీపీ అభిమానులు గుర్రు మీద ఉన్నారు. 2018 తర్వాత ఆయన చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారనేది వారి గుర్రుకి కారణం. కలిసి ఉన్నప్పుడు ఒకరి తప్పులు ఒకరికి కనపడవు. విడిపోయాక ఏమన్నా తప్పే. చంద్రబాబు, బాలయ్య, టీడీపీ నాయకులు పోటాపోటీగా మోదీని తిట్టలేదా!? కొలికపూడి శ్రీనివాసరావు విష్ణువర్ధన్ రెడ్డిని బహిరంగంగా చెప్పుతో కొట్టలేదా!? అయినా పొత్తు కుదిరింది కదా! ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమే. రాజకీయం అంటేనే ఇది. రాజకీయాల్లో అదృష్టవంతుడిని ఎవరూ చెరపలేరు. వీర్రాజు అదృష్టవంతులు. విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, భానుప్రకాష్ రెడ్డి వంటి ఎంతోమంది యువనాయకులు ఉన్నా రెండోసారి అవకాశం రావటం అంటే అదృష్టం ఉండాలి. ఇంతే కాదు.. ప్రజలు మరో ముఖ్య విషయం మరచిపోతున్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ`టీడీపీ పొత్తు పొడవకముందే పవన్ కల్యాణుడిని మోదీ వద్దకు తీసుకుని వెళ్లింది వీర్రాజే. దేర్ ఆర్ ఆల్వేజ్ వీల్స్ వితిన్ వీల్స్ ఇన్ పాలిటిక్స్. ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఏడుపు కూడా నవ్వుతూనే ఏడవాలి. అందుకే అన్నారు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ.. ఏడుపుని కూడా నవ్వుతూ ఏడవాలిరా అని. గుడ్‌లక్ వీర్రాజూ.
Comments