హత్య జరిగి ఏడేళ్లయినా కేసులో పురోగతి శూన్యం
రాష్ట్ర ప్రభుత్వం అదిలించినా కదలని కేసు విచారణ
హిందూత్వ నేరాలకు ఈ దేశంలో శిక్షలు పడవేమో!

- దుప్పల రవికుమార్
నిప్పుకణిక లాంటి ఉద్యమకారిణి, విలేకరి గౌరి లంకేష్‌ను హత్య చేసారని ఆరోపించబడిన పద్దెనిమిది మంది నిందితుల్లో ఎనిమిది మందికి బెయిల్ లభించింది. కర్ణాటక హైకోర్టు సెప్టెంబరు 4వ తేదీన నలుగురికి బెయిల్ ఇచ్చింది. ఆ మరునాడు గౌరి లంకేష్ ఏడో వర్ధంతి. అంతకు ఎనిమిది నెలల ముందునుంచీ ఈ కేసులో నిందితులైన మరో నలుగురికీ ఒక్కొక్కరిగా బెయిల్ దొరుకుతూనే ఉంది. నిందితులకు బెయిల్ లభించినట్లయితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకావముందని ప్రాసిక్యూషన్ వాదించినా ఫలితం లేకపోయింది. ఇంజనీరుగా పనిచేస్తున్న అమోల్ కాలే సనాతన సంస్థ అందించిన సాహిత్యం చదివి ప్రేరేపితుడై గౌరి హత్యకు కుట్ర పన్నాడు. దీనికి పదిహేడుమందిని పురమాయించాడు. కాలేజీ చదువులో సగం మానేసిన పరశురాం వాగ్మోర్ గౌరి ఇంటి గేటు దగ్గర తుపాకీతో కాల్చి చంపాడు. అతడిని గణేశ్ మిస్కిన్ ఒక మోటార్‌సైకిల్‌పై తీసుకువచ్చాడు. అమోల్ కాలే మిగిలిన 15 మందికి ఈ హత్య ఉదంతంలో వివిధ పాత్రలిచ్చాడు. కాపలా కాయడం, గౌరి ఇంటికి చేరుకోవడం, ప్రయాణ వసతులు ఏర్పాటుచేయడం, హత్య అనంతరం హంతకులను దాచడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటివి చేసారు.
పోలీసుల ఛార్జిషీటే అన్నీ చెప్తోంది!
పోలీసులు వేసిన ఛార్జిషీటు ప్రకారం 2010 లగాయతు ఈ సనాతన సంస్థ వ్యక్తులు రకరాకల నేరాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి నిందితులు 18 మంది ఈ సనాతన సంస్థ లేదా హిందూ జనజాగృతి సమితికి చెందినవారే. వారికి ఆరాధ్యనీయమైన పుస్తకం క్షాత్రధర్మ సాధన. ఇది హిందూ వ్యతిరేకులను దుర్జనులుగా సంబోధిస్తుంది. కేవలం భయోత్పాతం సృష్టించడం ద్వారా హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో వారు ఈ దురాగతానికి పాల్పడ్డారని ఛార్జిషీటులో పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో వివిధ గ్రామాలు, పట్టణాలలో 19 క్యాంపులు ఏర్పాటుచేసి, సుమారు ఎనిమిదేళ్ల పాటు ఆయుధాలను వాడే శిక్షణ ఇచ్చారని ఛార్జిషీటులో పేర్కొనడం విచారకరం. తుపాకులు పేల్చడం, బాంబులులాంటి మందుగుండు సామగ్రి తయారుచేయడం, కత్తులు వాడడం వంటివాటిలో శిక్షణ మన యువతకు వీధుల్లోనే దొరుకుతోంది. మనమేమో విదేశాలను ముఖ్యంగా ముస్లిందేశాలను ఆడిపోసుకుంటుంటాం! 2010 నుంచీ ఈ సంస్థలో వీరంతా పని చేస్తున్నప్పటికీ 2016లో వారు గౌరీ హత్యకు నిర్ణయం తీసుకున్నారు. గౌరీ ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని వారు మనసుకు గట్టిగా పట్టించుకుని, ఇలాంటి దుర్జనురాలిని హతమార్చాలని తీర్మానించుకున్నారు. ఒక ఏడాది పాటు దీనికి సంబంధించిన రెక్కీ వేసారు. అమోల్ సూచన మేరకు వాసుదేవ సూర్యవంశి, సుజిత్ కుమార్ లిద్దరూ 2016 అక్టోబరులో దావనగేరేలో బాపూజీ ఆసుపత్రి వద్ద ఒక మోటారు సైకిల్ దొంగిలించారు. 2017 ఫిబ్రవరిలో వికాస్ పాటిల్, హెచ్‌ఎల్ సురేష్ గౌరి ఎక్కడ ఉండేదీ, ఎక్కడ పనిచేసేదీ చిరునామాలు తెలుసుకున్నారు.
రెండు నెలలపాటు అమిత్ బడ్డి, గణేష్ మిస్కిన్‌లు గౌరి ఉండే వీధిలోనే మకాం వేసి ఆమెను గమనించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక గౌరిని మట్టుపెట్టడానికి రెండు ప్రదేశాలు ఎంపిక చేసారు. ఒకటి హెమ్మిగపుర జంక్షన్, రెండవది చిన్మయి పాఠశాల. ఒకట్రెండు సార్లు రూట్ రిహార్సల్ కూడా చేసారు. సెప్టెంబరు 4వ తేదీన చంపాలనుకుని స్కూలుకు చేరారు. అప్పటికే ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మర్నాడు కూడా ప్రయత్నించారు. గంటవరకూ రాకపోయేసరికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు గౌరీ ఇంటికి చేరింది. కారు దిగి ఇంట్లోకి వస్తున్నపుడే ఆమెపై కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు దిగేసరికి ఆమె కుప్పకూలిపోయింది. తుపాకులు, తూటాలు, వారి దుస్తులు ఎక్కడివక్కడ భద్రపరిచాక ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. సురేష్ మొత్తం సాక్ష్యాలన్నీ నాశనం చేసి, మిగిలిన వాటిని మగది`తావరకెరె రహదారిపైనా, తిప్పెగొండనహల్లి రిజర్వాయర్ ప్రదేశంలో పడేశాడు. సేకరించిన తుపాకులు, మోటార్ సైకిల్ చేతులు మారేట్టు చేసారు. నవీన్ కుమార్ అరెస్టు వార్త తెలియగానే మళ్లీ అందరూ కలుసుకున్నారు. తమ ఫోన్లను ధ్వంసం చేసారు. తుపాకులను విడదీసి ముంబయి నాసిక్ హైవే పక్కన ఉల్లాస్ నదిలో గిరాటేసారు.
హంతకులకు బెయిల్ మంజూరు
మోహన్ నాయక్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయమని కోరుతూ కవితా లంకేష్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా సుప్రీంకోర్టు గుమ్మమెక్కాయి. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాను జోక్యం చేసుకోనని చెప్పింది. అంతేకాకుండా విచారణ సమయంలో అతనెప్పుడూ వాయిదాలు కోరలేదని, అతని ప్రవర్తన బాగుందని సుప్రీంకోర్టు కితాబిచ్చింది. బెయిల్ షరతులు మీరితే తప్పక దానిని రద్దు చేస్తామని ఓదార్పునిచ్చింది. గౌరీ సోదరి కవిత మాట్లాడుతూ అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి సమాజంలో ఉంటే ఎంతో ప్రమాదమని ఆవేదన చెందింది. కోర్టులు వారు నిర్దోషులని తేల్చితే తప్పదు గాని, అంతవరకూ వారిని జైలులోనే ఉంచాలని డిమాండ్ చేసింది. నిందితులకు త్వరితంగా శిక్షలు పడేందుకు వీలుగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తే మంచిదని ఆమె కోరారు. వీరి కోరికను మన్నిస్తూ గౌరీ లంకేష్ హత్య కేసుతో పాటు ఎంఎం కాల్బుర్గి కేసును కూడా ఛేదించడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలిచ్చారు. కర్ణాటక హైకోర్టులో మాత్రం కదలిక లేదు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇంతవరకూ ప్రభుత్వానికి బదులివ్వలేదు. ఎన్ని విన్నపాలు చేసినా కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. హత్య జరిగి ఇప్పటికే ఏడేళ్లు అయింది. కేసు విచారణ త్వరలో ముగిసి, నిందితులకు శిక్ష పడుతుందనే ఆశ రోజురోజుకు సన్నగిల్లుతోంది.
Comments