గ్లోబల్ బంగారు కొండ.. భారత్!
- DV RAMANA

- Jul 3
- 2 min read

ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించేది బంగారమేననడంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక్కో దేశానికి ఒక్కో రకమైన కరెన్సీ ఉంటుంది. అది ఆ దేశంలో తప్ప ఇతర దేశాల్లో చెల్లదు. అందువల్ల విదేశీ పర్యటనలకు వెళ్లేవారు, విదేశీ వాణిజ్యం చేసేవారు మన కరెన్సీని ఆయా దేశాల కరెన్సీగా మార్చి చెల్లించడమో లేదా డాలర్లలోకి మార్చి ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. ఇలా కరెన్సీ ఎక్స్ఛేంజ్ కు చాలాచోట్ల కమీషన్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా డాలర్‌తో స్థానిక కరెన్సీ మారకం రేట్లు చాలా తేడాగా ఉండి ఆయా దేశాలకు, వ్యక్తులకు నష్టం కలగజేస్తుంటాయి. దీనికి ఉన్న ఒకే ఒక్క విరుగుడు బంగారం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బంగారం క్రయవిక్రయాలు జరుగు తుంటాయి. అందువల్లే దాదాపు అన్ని దేశాలు విదేశీ మారక ద్రవ్యంతో పాటు అత్యవసర సమయా ల్లో వినియోగించేందుకు వీలుగా భారీగా బంగారం నిల్వలను కూడా మెయింటైన్ చేస్తుంటాయి. ఆ క్రమంలో మన భారత దేశంలో రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా 879.58 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల సహజంగానే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులు తగ్గినా మళ్లీ అంతలోనే పైకి ఎగబాకుతున్నాయి. దీనికితోడు మన దేశప్రజలకు బంగా రంపై మోజు అంతా ఇంతా కాదు. శుభకార్యాలకు తోడు ఏ చిన్న అవకాశం దొరికినా బంగారం కొనడానికే భారత మహిళలతో పాటు ఇటీవలి కాలంలో పురుషులు కూడా మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా భారత ప్రభుత్వం వద్ద ఉన్న బంగారం నిల్వల ఎన్నో రెట్లు అధిక నిల్వలు ప్రజల ఇళ్ల లోనూ, దేవాలయాల ట్రెజరీల్లోనూ ఉన్నాయని ఒక అంచనా. ఆ లెక్క ప్రకారం దేశంలో ఏకంగా 25 వేల టన్నులు అంటే.. 2.50 కోట్ల కిలోల బంగారం ఉండవచ్చంటున్నారు. దీని విలువ అక్షరాలా రూ.200 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాల్లో ఇది 56 శాతం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే ఆరు రెట్లు ఎక్కువ. అంతే కాదు.. ప్రపంచంలోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం వాటా భారతదేశానిదే. ఈ లెక్కన భారత్‌ను గ్లోబల్ బంగారు కొండ అనవచ్చేమో! 2020 నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఏడాది కాలంగా మరింతగా భగ్గుమంటు న్నాయి. పది గ్రాముల పసిడి ధర లక్ష దగ్గరగా ఉంది. ఈ ధర వింటే మధ్యతరగతి ప్రజల గుండెలు గుభేల్‌మంటుంటే.. దిగువ మధ్యతరగతివారు బంగారం షాపుల వైపే చూడ్డం మానేశారు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలప్పుడు తప్పనిసరి కావడంతో తులమో అరతులమో కొనడంతో సరిపెట్టుకుంటు న్నారు. అయినా కొనుగోళ్లు తగ్గడం లేదు. ఈ లోటు ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాలు భర్తీ చేస్తున్నాయి. గత ఏడాది మన దేశంలో బంగారం డిమాండ్ ఏకంగా 782 టన్నులకు చేరింది. కరోనాకు ముందున్న సగటు అమ్మకాల కంటే ఇది 15 శాతం ఎక్కువ. ఆర్నమెంట్ బంగారం డిమాండ్ కాస్త మందగించినా.. బంగారం కడ్డీలు, కాయిన్లలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గడంతో బంగారంపై రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లు బాగా పెరిగాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి మన దేశంలో బంగారం డిమాండ్ 725 టన్నులకు చేరుతుందన్నది యూబీఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ అంచనా. 2026 తర్వాత కాస్త నెమ్మదించినా గోల్డ్ డిమాండ్ 800 టన్నుల వద్ద స్థిరపడవచ్చని అంచనా. దేశంలోని ప్రైవేట్ బంగారు నిల్వలు ఏటా సగటున ఎనిమిది వేల టన్నులు పెరుగుతున్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. ఇళ్లలో ఉన్న బంగారంలో రెండు శాతం కంటే తక్కువ మాత్రమే తనఖా కోసం బయటకు వస్తోంది. మిగతాదంతా బీరువాలు, రహస్య ట్రెజరీలు, బ్యాంకు లాకర్లలో మూలుగు తోంది. ఈ నిల్వలను బయటకు తెచ్చే ప్రయత్నంగా ఆర్థిక సంస్థలు గోల్డు లోన్లపై వడ్డీలు తగ్గించినా లాభం లేకపోతోంది. దీనికి కారణం.. భారతీయులు బంగారాన్ని ఆస్తిగానే కాకుండా ప్రతిష్టకు సంబంధించినదిగా చూస్తారు. బంగారు నగలతో ఎమోషనల్ అనుబంధం పెంచుకుంటారు. అందు వల్ల తప్పనిసరైతే తప్ప తాకట్టు పెట్టడానికి, అమ్మడానికి ఇష్టపడరు. ఈ కారణంగానే గోల్డ్ మాని టైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటి పథకాలేవీ పెద్దగా సక్సెస్ కావడం లేదు. అందువల్ల దేశంలో ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వలకు అదనంగా మరో పాతిక వేల టన్నుల బంగారం ఉన్నా అది పూర్తిగా ప్రైవేట్ ఆస్తి. దాన్ని జాతీయ సంపదగా చెప్పలేం. గోల్డ్ కంట్రోల్ యాక్ట్ వంటివి సక్రమంగా అమలుకాక పౌరుల వద్ద బంగారం నిల్వలు అపరిమితంగా పెరిగిపోతున్నాయి.










Comments