`ఫ్రీ సింబల్స్ జాబితాలో చేరిన జనసేన గుర్తు
`అంటే ఆ పార్టీ బరిలో లేని చోట్ల ఆ చిహ్నం ఇతరులకు
`ఇది కూటమిలోని టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు నష్టదాయకం
`తమకు మాత్రమే కేటాయించాలని పవన్ పార్టీ విజ్ఞప్తి
`ఇంతవరకు స్పందించని ఎన్నికల సంఘం

(ఎన్నికల రచ్చబండ ` డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తే అత్యంత కీలకం. గతంలో బ్యాలెట్ పేపర్లపైనా, ప్రస్తుతం వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లోనూ (ఈవీఎం) ఈ గుర్తులే ఉంటాయి. వీటిపైనే ఓటర్లు తమ ఓటు ముద్ర వేయాల్సి ఉంటుంది. అంత కీలకమైన ఎన్నికల గుర్తు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని భయపెడుతోంది. వైకాపాను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీయే గొడుగు కింద చేరి సీట్ల సర్దుబాటు చేసుకుని ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాయి. సాధారణంగా పొత్తులతో పోటీ చేసిన సందర్భాల్లో ఓట్ల బదిలీ కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. కూటమి తరఫున నిలబడిన అభ్యర్థికే మిత్రపక్షాల ఓటర్లు కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక క్రాస్ ఓటింగ్ చేసేస్తుంటారు. ఈ సమస్యకు తోడు ఎన్డీయే కూటమి ఈసారి కొత్త సమస్య సవాల్ చేస్తోంది. కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడమే కొత్త గందరగోళానికి, భయాలకు తావిస్తోంది. జనసేన గుర్తు సమస్య ప్రతి ఎన్నికల్లోనూ వెంటాడుతున్నా గాజుగ్లాసును శాశ్వత గుర్తుగా కేటాయింపజేసుకోవడంలో జనసేన విఫలమవుతోంది. ఆ గుర్తు తమకే కేటాయించాలని మరో పార్టీ డిమాండ్ చేయగా, హైకోర్టులో ఆ వివాదం పరిష్కారమైనా.. ఎన్నికల కమిషన్ తీసుకున్న మరో నిర్ణయం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. అదే ఇప్పుడు మొత్తం కూటమిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.
హైకోర్టులో ఊరట లభించినా..

జనసేన ఏర్పాటైనప్పటి నుంచి పోటీ చేసిన ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తునే కేటాయిస్తున్నారు. అయితే జనసేన కంటే ముందే తాము ఆ గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నందున గాజుగ్లాసును తమకే కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యూలర్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇటీవల తీర్పు ప్రకటించింది. పిటిషనర్ వాదనలను తిరస్కరిస్తూ అర్హతల ప్రకారం జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆ వివాదం పరిష్కారమైనా ఎన్నికల కమిషన్ తీసుకున్న మరో నిర్ణయం జనసేనకు ఇబ్బందికరంగా పరిణమించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తుల జాబితాను ప్రకటించింది. ఇంతవరకు జనసేన వినియోగిస్తున్న గాజుగ్లాసు గుర్తును ఆ జాబితాలో ఫ్రీ సింబల్‌గా పేర్కొనడంతో జనసేన పరిస్థితి ఇరకాటంలో పడిరది. ఎన్నికల గుర్తును కాపాడుకోవడానికి కావల్సిన అర్హతల్లో ఏ ఒక్కదాన్నీ జనసేన సాధించలేకపోవడం వల్లే ఎన్నికల సంఘం ఇటువంటి నిర్ణయం తీసుకోకతప్పలేదు.
గుర్తుల కేటాయింపు ఇలా..
రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తుల కేటాయింపునకు ఒక నిర్ధిష్ట విధానం ఉంది. ది ఎలక్షన్ సింబల్స్(రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్`1968 ప్రకారం అభ్యర్థులకు, పార్టీలకు గుర్తులు కేటాయిస్తుంటారు. ఈ చట్టం కింద జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ ఒకటి లేదా అంతకుమించిన రాష్ట్రాల్లో చివరిసారి జరిగిన పోటీ చేసి కనీసం నలుగురు ఎంపీలను గెలిపించుకోగలగాలి లేదా దేశంలోని మొత్తం ఓట్లలో కనీసం రెండు శాతం ఓట్లు సంపాదించాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. వీటిలో ఏ ఒక్క అర్హత సాధించినా సదరు పార్టీకి కోరుకున్నట్లు శాశ్వత ఎన్నికల గుర్తు కేటాయిస్తారు. అదే ప్రాంతీయ లేదా రాష్ట్ర పార్టీల విషయానికొస్తే.. ఆ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాష్ట్రంలోని అసెంబ్లీకి చివరిసారి జరిగిన ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు లేదా ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి. సీట్లు గెలవకపోయినా మొత్తం పోలైన వాటిలో చెల్లిన ఓట్లలో కనీసం ఎనిమిది శాతం ఓట్లు సాధించినా శాశ్వత గుర్తు కేటాయింపునకు అర్హత సాధించినట్లే. 2013లో పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే శాశ్వత గుర్తు పొందేందుకు అవసరమైన స్థాయిలో కనీస ఓట్లు, సీట్లు సాధించడంలో మాత్రం విఫలమైంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసినా కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంలోనే విజయం సాధించింది. అదే సమయంలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాల్సి ఉండగా.. సుమారు 5.8 శాతం ఓట్లే లభించాయి. దాంతో రిజిస్టర్డ్ పార్టీగానే తప్ప గుర్తుంపు పొందిన ప్రాంతీయ పార్టీగా నమోదు కాలేకపోయింది. ఇదే ఆ పార్టీ తన గుర్తును కాపాడుకోలేని స్థితిలోకి నెట్టింది.
గ్లాస్ ఫ్రీ సింబల్ అయితే నష్టమేంటంటే..
జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నిర్ధిష్టంగా ఎన్నికల సంఘం ఒక గుర్తు కేటాయిస్తుంది. ఆయా పార్టీలు పోటీలో ఉన్నా లేకపోయినా ఎంకెవరికీ కేటాయించరు. కానీ ఫ్రీ సింబల్స్‌లో ఉన్న గుర్తులను పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు, ఇతర రిజిస్టర్డ్ పార్టీలకు వారు కోరిన మేరకు ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. ఇప్పుడు జనసేన ఇన్నాళ్లూ వాడుతున్న గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడం వల్ల.. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారికే గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. అదే సమయంలో ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర రిజిస్టర్డ్ పార్టీలు, ఇండిపెండెంట్లు కోరితే గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. అంటే జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో కూడా గ్లాస్ గుర్తుపై వేరే అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంది. ఆ గుర్తుకు అలవాటు పడిన జనసేన ఓటర్లు దానిపై ఓటు వేసే ప్రమాదం కూడా ఉందన్నమాట.
కూటమికి ఇరకాటం
ప్రస్తుత ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేయడంలేదు. తెలుగుదేశం, బీజేపీలతో కలిసి ఎన్డీయే కూటమి గొడుగు కింద పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా తనకు కేటాయించిన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకే బరిలోకి దిగింది. ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తారు. అంతవరకు ఏ ఇబ్బంది లేదు. కానీ కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీలు పోటీ చేస్తున్న మిగిలిన 154 అసెంబ్లీ, 23 లోక్‌సభ స్థానాల్లోనే ఓట్ల బదిలీ వ్యవహారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పొత్తు లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ, బీజేపీల అభ్యర్థులకు జనసేన ఓట్లు బదిలీ కావాల్సి ఉంటుంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తుపై జనసేన కాకుండా వేరే అభ్యర్థులు ఉండటం వల్ల మిత్రపక్షాలకు పడాల్సిన జనసేన ఓట్లు వారికి కాకుండా గాజుగ్లాసులో పడిపోయే ప్రమాదం ఉంది. అంటే మిత్రపక్షాలకు దక్కాల్సిన జనసేన ఓట్లు వేరే వారికి మరలిపోతాయన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం.. నాలుగేళ్ల క్రితం తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయలేదు. కానీ అక్కడ గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అభ్యర్థి ఎటువంటి ప్రచారం చేయకపోయినా గ్లాస్ గుర్తుపై 2500 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే జరిగే ప్రమాదముంది. జనసేన బరిలో లేని చోట్ల ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించనుండటం వల్ల జనసేన, మిత్రపక్షాలకు లభించాల్సిన ఓట్లు వేరేవారికి లభిస్తాయి. ఆ మేరకు మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుంది. ఈసారి పోటీ హోరాహోరీగా ఉంది. ఎవరు గెలిచినా భారీ మెజారిటీలు వచ్చే పరిస్థితి లేదు. తక్కువ మెజారిటీలతోనే ఎక్కువ మంది అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు దక్కాల్సిన ఓట్లు వేరేవారికి మరలిపోతే ఆ మేరకు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గుర్తించిన జనసేన నాయకత్వం ే గాజుగ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తప్పించి గతంలో మాదిరిగా తమ పార్టీకే కేటాయించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసింది. కానీ ఇంతవరకు ఈసీ నుంచి సమాధానం రాకపోవడం మొత్తం కూటమిని ఆందోళనకు గురి చేస్తోంది. నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో అది పూర్తి అవుతుంది. ఆ వెంటనే రంగంలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఆలోగా ఎన్నికల సంఘం తన నిర్ణయం మార్చుకోకపోతే జనసేన ఓటుబ్యాంకుగా పరిగణిస్తున్న ఆరు శాతానికిపైగా ఓట్లు పూర్తిస్థాయిలో మిత్రపక్షాలకు బదిలీ కావడం అనుమానమే.
Comments