గోవిందా!.. ఏమిటా కండువా?
- NVS PRASAD

- Nov 4, 2024
- 2 min read
కళింగకోమటి రాష్ట్ర అధ్యక్షుడి మెడలో వైకాపా రంగు
అవాక్కయిన టీడీపీ శ్రేణులు
సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా వైకాపా పెత్తనమే చెల్లుబాటవుతుందని ‘ఆంధ్రజ్యోతి’లో రోజూ ఏదో ఒక కథనం రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల మీద వైకాపా సానుభూతిపరులు దాడులు చేస్తున్నారన్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ప్రధానమైన పోస్టుల్లో వైకాపా చెప్పినట్టు గతంలో ఆడిన అధికారులే ఉన్నారని ‘ఈనాడు’ కూడా బాధపడిన సందర్భాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇందులో ఏది ఎంత శాతం నిజమన్న విషయం పక్కన పెడితే, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ నేత ఒకరు వైకాపా కండువాతో ఓ కార్యక్రమంలో కనిపించి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్‌లో ఆదివారం ఉదయం విశాఖపట్నంకు చెందిన ఓ వైకాపా నాయకుడు కళింగ కోమటి వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు హాజరయ్యారు. ఆయనతో పాటు 40 మంది పైచిలుకు టీడీపీ నాయకులు వచ్చారు. అయితే ఇక్కడే ఓ అరుదైన ఘట్టానికి తెరలేచింది. ఈ టీడీపీ నాయకులందరికీ వైకాపా కండువా వేసి ఆహ్వానించడం కొసమెరుపు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా వైకాపా కండువా వేస్తుండగా వ్యతిరేకించకపోవడం, దీనికి తోడు వాట్సాప్ గ్రూపుల్లో తామేదో ఘనకార్యం చేసినట్టు ఫోటోలు షేర్ చెయ్యడంతో జిల్లాలోని టీడీపీ శ్రేణులందరూ అవాక్కయ్యారు. బోయిన గోవిందరాజులు ప్రస్తుతం రాష్ట్ర కళింగకోమటి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. గోవిందరాజులు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఏర్పాటుచేసిన కమిటీల్లో కూడా 40 శాతానికి పైబడి వైకాపా నాయకులే ఉన్నారు. అదీ కాకుండా వీరిలో ఎక్కువ మంది కీలక పదవుల్లో ఉన్నారు. అలవాటులో పొరపాటుగా మొన్నటి వరకు ఈ సంఘం వైకాపా చేతిలో ఉండటం వల్ల ఈ కండువాలు వేశారా, లేదూ అంటే అధ్యక్షుడు మారినంత మాత్రాన తమ సత్తా తగ్గలేదని నిరూపించడానికే కండువాలు వేశారా, లేదూ గతంలో హోల్‌సేల్‌గా కొనేసి ప్రభుత్వం మారిన తర్వాత వేస్టయిపోతాయని వాడేశారో తెలియదు గానీ స్టేజ్ మీద ఉన్న టీడీపీ నాయకులు వైకాపా కండువాలతో కనిపించారు. విచిత్రమేమిటంటే.. అక్కడున్న వైకాపా నేతల మెడలో మాత్రం ఆ పార్టీ కండువాలు లేవు. ఇదే విషయాన్ని బోయిన గోవిందరాజులు వద్ద ‘సత్యం’ ప్రస్తావించగా, గౌరవంగా మెడలో కండువాలు వేసి ఆహ్వానించడాన్నే తప్ప, అవి ఏ రంగులో ఉన్నాయో తాను చూడలేదన్నారు. సంఘాన్ని బలోపేతం చేయడం కోసం అన్ని పార్టీల్లో ఉన్న ప్రముఖులను కలుపుకొని వెళ్తున్నామని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినవారికి మెడలో ఎటువంటి కండువాలు వేస్తున్నామన్న స్పృహ ఉండాలే కాని, తాము ఇవన్నీ చూసుకోలేమన్నారు. ఇదిలా ఉండగా, జగన్మోహన్‌రెడ్డి మాదిరిగానే చంద్రబాబు కూడా కుల కార్పొరేషన్లు ఇస్తున్నారని, అదే జరిగితే కళింగ కోమటి కార్పొరేషన్‌కు బోయిన గోవిందరాజులు పేరు ముందు వరుసలో ఉంటుంది కాబట్టి ఆయన్ను ఇరికించేందుకే వైకాపా నేతలు ఓ పథకం ప్రకారం ఈ కండువాలు వేశారన్న వాదన కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.










Comments