top of page

గోవిందుడు అందరివాడేలే!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 19
  • 2 min read
  • రాష్ట్ర కళింగకోమటి సంఘ అధ్యక్షుడిగా బోయినే ఉండాలని తీర్మానం

  • వివాహ వార్షికోత్సవం సందర్భంగా కోటబొమ్మాళి వెళ్లి కిరీటం పెట్టిన కళింగకోమట్లు

  • కళింగవైశ్య భవనంలో సమావేశమైన పెద్దలు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కళింగకోమటి జిల్లా సంఘానికి, నగర సంఘానికి మధ్య ఇటీవల తలెత్తిన కొన్ని అభిప్రాయభేదాల వల్ల మనస్తాపం చెంది రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘ అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు ఆ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే వారం గడవక ముందే బోయిన గోవిందరాజులు మినహా రాష్ట్ర సంఘ బాధ్యతలు మోసే దిక్కు లేదంటూ కళింగకోమటి నేతలు ఆయన ఇంటికి వెళ్లి కోటబొమ్మాళిలో బుధవారం ఆయన వివాహ వార్షికోత్సవ వేడుకలు జరిపి ఆయనే మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలంటూ ఏకవాక్య తీర్మాణం చేశారు. అంతకు ముందు నగరంలో కళింగవైశ్య కళ్యాణ మండపంలో ముందుగా నగర కమిటీ సభ్యులు సమావేశమై గోవిందరాజులు సేవలు ప్రస్తుత తరుణంలో ఎందుకు అవసరమో నొక్కివక్కాణించారు. కొద్ది రోజుల్లో కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రితో పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు జిల్లాలో ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన కులాలపై సమావేశం కానున్న నేపథ్యంలో ఢల్లీిలో కళింగకోమట్ల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి బోయిన గోవిందరాజులు లాంటి సీనియర్లు అవసరమని వీరంతా పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో గోవిందరాజులు రాజీనామాను ఆమోదించడం, ఆ స్థానంలో వేరేవారిని నియమిస్తే కోమట్లు నష్టపోతారని, సంఘం అన్నాక చిన్నచిన్న మనస్పర్థలు వస్తాయని, వాటిని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని వీరు పేర్కొన్నారు. టౌన్‌ కమిటీ సమావేశం అనంతరం జిల్లా కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. వీరంతా కోటబొమ్మాళి వెళ్లి ఆయనే మళ్లీ పగ్గాలు చేపట్టాలని కోరడంతో గోవిందరాజులు సమ్మతించారు. కొద్ది రోజుల క్రితం నగర కమిటీకి, జిల్లా కమిటీ సభ్యులకు మధ్య సోషల్‌మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఆమధ్య కోరాడ హరిగోపాల్‌ వాణిజ్య విభాగం సమావేశం పెట్టినప్పుడు కోమట్ల సంఘంలో ఉన్న చాలామందిని ఆహ్వానించారు గానీ, రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులును మాత్రం పిలవలేదనే నినాదం వాట్సాప్‌ గ్రూపుల్లో యుద్ధానికి దారితీసింది. ఇందులో గోవిందరాజులు తరఫున కొందరు, హరిగోపాల్‌ తరఫున మరికొందరు మాటల యుద్ధం కొనసాగించడంతో మనస్తాపం చెందిన గోవిందరాజులు తన పదవికి రాజీనామా చేస్తూ పార్టీ ఇచ్చిన బీసీ సాధికార కమిటీ కన్వీనర్‌గా మాత్రం కొనసాగుతానని తప్పుకున్నారు. అప్పట్నుంచీ కళింగకోమటి సంఘంలో అంతర్మథనం మొదలైంది. అందరివాడిగా గుర్తింపు పొందిన గోవిందరాజులు తెలుగుదేశం పార్టీకి బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నందున ఓబీసీ సాధన కోసం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో లాబీయింగ్‌ చేయడానికి ఆయన అనుభవం పనికొస్తుందని పలువురు అభిప్రాయపడటంతో గోవిందరాజులును మళ్లీ ఈ పీఠం మీద కూర్చోబెట్టడానికి వీరంతా కోటబొమ్మాళి వెళ్లారు. మరోవైపు తాను నిర్వహించిన కార్యక్రమానికి గోవిందరాజుల్ని కూడా ఆహ్వానించానని కోరాడ హరిగోపాల్‌ చెబుతున్నారు. ఏదిమైనా టీకప్పులో రేగిన తుపాను వెలిసిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page