top of page

ఘంటసాలకు నచ్చిన పొగడ్త ( మన బాలు చెప్పినది )

  • Guest Writer
  • Jun 7
  • 1 min read

ఒక సారి ఘంటసాల గార్ని ఒకళ్ళు అడిగారట.. ‘‘ఏ కళాకారులైనా తమ కళని గుర్తించాలని చూస్తారు కదా.. ఒక గాయకుడిగా మీ జీవితంలో మీకు చాలా బాగా నచ్చిన పొగడ్త చెప్పండి..’’ అని.. అప్పుడు ఆయన (ఆ రోజుల్లో టీవిలూ అవీ లేవు కనక ఆయన రూపం జనానికి తెలిసే అవకాశం లేదు). ‘‘ఒకసారి నేను ఒక టీ కొట్టు పక్కన టీ తాగుతున్నాను. ‘మహాకవి కాళిదాసు’ సినిమాలోని ‘‘మాణిక్యవీణా...అని పాట రేడియోలో వస్తోంది. ఆ పాటను.. అక్కడున్న ఒక రిక్షా అతను ఎంతగానో లీనమైపోతూ గొంతుకలిపి పాడుతూ విని ఒక చోటుకొచ్చేసరికి అతను ఆగిపోయి... ఇహ పాడలేక... ‘‘అబ్బబ్బబ్బ ఏంపాడాడ్రా.. ఏం పాడాడ్రా... ఘంటసాల.!!!!.. ‘నంజకొడుకు’ సంపేసినాడ్రా...సంపేసినాడ్రా నంజకొడుకు నంజకొడుకు... సంపేసినాడ్రా’’ అంటూ అరిచేస్తూ అన్నాడట.’’ ఆ మాటలు ఆ పక్కనే కూర్చున ఘంటసాల గారు విని నవ్వుతూ ఆయనకూడా చూశారట.

ఘంటసాల గారు ఈ మాటలు చెప్పగానే అక్కడున్న ఆయన అభిమానులు షాకైపోయి కాసేపాగి తేరుకుని చాలా ఆశ్చర్యంగా...’’ అదేమిటీ మాస్టారు మిమ్మల్ని అన్ని తిట్లు తిడితే మీ అమ్మగారిని కూడా అలా తిట్టేస్తుంటే మీకు కోపం రాలేదా బాధయ్యలేదా’’ అని అడిగారుట.

దానికి ఆయన ‘‘హృదయంలోంచి వచ్చే నిజమైన భావావేశం ఏ వస్త్రం ఏ ఆచ్చాదనా లేకుండా చాలా సహజంగా.. నగ్నంగా వుంటుంది. అదే నిజమైన పొగడ్త.. ఆ ఆవేశంలో అక్కడ సంస్కారం ప్రవేశించినప్పుడు అది కొంత కృతకంగా ఆర్టిఫిషియల్‌గా తయారౌతుంది. అతను అసలేమీ ఆలోచించకుండా ఏమీ అనుకోకుండా తన భావావేశాన్ని వ్యక్తం చేశాడు. ఒక కళాకారుడిగా దాన్ని నేను కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా’’ అన్నారట.

అదీ ఘంటసాల గారి రసవంతమైన మనసు... ఈ మాటలు ఒకసారి ఘంటసాల శ్యామలగారు నాతో చెప్తుంటే నా మనసులో ఘంటసాల గారి మీద గౌరవం ఇంకా ఇంకా ఎంతో పెరిగిపోయింది. ఎదుటివారి ఆవేశాన్ని అర్థం చేసుకుని మాటల్లోని పైపైన వచ్చే అర్థాన్ని పట్టించుకోకుండా, అంతే సహజంగా మనసునులోని భావాన్ని చూడడం, చూడడం అర్థం చేసుకోవడం ఎంత మందికి వీలౌతుంది.!!!! .. అంత సునిశితంగా ఎదుటివారి మాటల్లో మనసు మాత్రమే చూడడం ఆయనవల్లైంది కనకనే ఆయన, తన పాటల్లో ఆ భావాల్ని అలా అంత గొప్పగా లీనమై పలికించారేమో.!! అందుకే ఆ సంగీత సరస్వతి ఆయనను అలా హత్తుకుని పొదువుకుందేమో...తన ఆ సంగీతాన్ని ఆయనకు ప్రసాదించిందేమో.

- జాజి శర్మ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page