top of page

చట్టాలు పెట్బుబడిదారుల కోసమేనా..?

Writer: DV RAMANADV RAMANA

చట్టాలన్నీ ఉన్నోళ్ల చుట్టాలేననేది మనం తరచూ వింటున్న మాటే కాదు, పదే పదే నిజమవుతున్న మాట కూడా. అయితే చీకట్లో దీపంలా ఈ చట్టాలను ప్రజాపక్షం చేస్తున్న ఘటనలూ లేకపోలేదు. కానీ ఇలాంటివి బహు అరుదు. ప్రగతిశీల, వామపక్ష శక్తుల పాలనలో తప్ప బూర్జువా పార్టీల పాలనలో వాటిని చూడలేం. ఇటీవల వెలువడిన తాజా వార్తలు కొన్ని దీన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి. అందులో మొదటిది.. అమెరికా లో విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ-1977) అమలును నిలిపివేయడం. రెండవది.. ఒక సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా సరిహద్దు భద్రతా నిబంధనలనే సవరించడం. మూడవది.. శ్రీలంకలోని పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ వైదొలగడం. ఈ మూడు వార్తలూ భారత అపర కుబేరుడు అదానీకి సంబంధించినవే కావడం గమనార్హం. సౌర విద్యుత్‌ కాంట్రాక్టుల కోసం ఆంధ్రా, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్మూకశ్మీరు అధికారులకు అదానీ గ్రీన్‌ సంస్థ రూ.2,100 కోట్లు ముడుపులుగా ఇచ్చిందని, లంచాల వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీని అతిక్రమించి ఈ ప్రాజెక్టుల కోసం అమెరికాలో రుణసేకరణ చేసిందని.. గతేడాది నవంబరులో జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా న్యాయశాఖ గుర్తించడం, ఆమేరకు తమ విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే. కానీ అమెరికా తాజా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఏ చట్టం కింద అదానీని ప్రాసిక్యూట్‌ చేయాల్సివుందో ఆ చట్టం అమలునే ఇప్పుడు నిలిపివేశారు. ఈ కేసులతో స్వదేశంలో, విదేశాల్లో తీవ్ర ఇరకాటంలో పడిన అదానీకి భారీ ఊరట కలిగించారు. సరిగ్గా మోదీ ఆమెరికా పర్యటనకు ముందే ఈ చర్య చోటుచేసుకోవడంతో.. ఇది ప్రధాని ఆప్తమిత్రుడైన అదానీ కోసం ట్రంప్‌ ఇచ్చిన ‘అడ్వాన్స్‌ గిఫ్ట్‌’ అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు సత్యదూరమేమీ కాదు. నరేంద్ర దామోదర మోదీ, డొనాల్డ్‌ ట్రంపుల ‘అపూర్వ మైత్రి’ కారణంగా అదానీకి లభించిన ఈ ఉపశమనం.. పొట్టకూటికోసం అమెరికా వెళ్లిన అసంఖ్యాకులైన వలసదారు లకు లభించకపోవడం వైచిత్రి! ఇదిలా వుంటే భారత ప్రభుత్వమేమైనా తక్కువతిందా.. ఇదే అదానీకి చెందిన సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం సరిహద్దు భద్రతా నిబంధనలనే సవరించేసింది! ఈ విషయమై ‘గార్డియన్‌’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అదానీ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి ప్లాంటును గుజరాత్‌ లోని ఖావ్‌డాలో నిర్మిస్తోంది. 2020 లో ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. అయితే, రక్షణ శాఖ నిబంధనల ప్రకారం దేశ సరిహద్దు నుంచి పది కిలోమీటర్ల వరకు ఎలాంటి భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, రోడ్లు నిర్మించడానికి వీళ్లేదు. కానీ ఈ ఖావ్‌డా ప్రాజెక్టు పాకిస్థాన్‌ సరిహద్దుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉంది. అయినప్పటికీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులను, భూములను కేటాయించటమేగాక.. కఠినమైన జాతీయ భద్రతా నిబంధనలను కూడా సవరించాయని ‘గార్డియన్‌’ తన కథనంలో పేర్కొంది. ఇలా కేవలం ఒక వ్యక్తి కోసం చట్టాల అమలును నిలిపివేయడం, భద్రతా నిబంధనలనే సవరించడం సంపన్నుల కోసం తప్ప సామా న్యుల కోసం సాధ్యమవుతుందా? మిశ్రమ ఆర్థికవ్యవస్థతో మొదలైన స్వతంత్ర భారత ప్రస్థానం.. కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతాలు పలికే దశకు చేరుకుంది. దేశానికి కీలకమైన రంగాల్లో ఒకప్పుడు ప్రభుత్వమే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రపంచీకరణ, సరళీకరణ పేరుతో పూర్తిగా ఆ కాడిని పక్కన పడేశాక బడా కార్పో రేట్లదే రాజ్యమైపోయింది. కోటానుకోట్ల పెట్టుబడులతో దేశ ఆర్థికవ్యవస్థను, ప్రభుత్వాలనే శాసించే స్థాయికి అవి విస్తరించాయి. ఈ తిమింగలాల ధాటిని తట్టుకుని నిలబడగల దమ్మూధైర్యం ప్రభుత్వాలకు లేకపోగా, వారి కనుసన్నల్లో మెలుగుతూ వారి అనుకూల విధానాలతో ‘జీ హుజూర్‌’ అంటున్నాయనడానికి ఇవి తార్కా ణాలు. ఇక మూడవది ఇందుకు భిన్నమైనది. శ్రీలంకలోని పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నట్టు అదానీ గ్రూపు వెల్లడిరచింది. లంచాలు ముట్టజెప్పి విద్యుత్‌ ఒప్పందాలు చేసుకుందని అదానీ గ్రూపుపై అమె రికాలో కేసులు నమోదవడమేగాక, ఈ ప్రాజెక్టుల కోసం భారత ప్రధాని మోదీ గత శ్రీలంక ప్రభుత్వాలను పరోక్షంగా ప్రభావితం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ నూతన అధ్యక్షుడు, వామపక్ష నేత దిసనాయకే ప్రభుత్వం అదానీ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అవినీతిని నిర్మూలించి, దేశాన్ని వృద్ధి పథంలో నడిపిస్తాననే హామీకి అనుగుణంగా అదానీ ప్రాజెక్టులపై సమీక్ష ప్రారంభించింది. ఇది అదానీ గ్రూప్‌నకు ఊహించని భారీ ఎదురుదెబ్బ. అందుకే అదానీ గ్రూపు తాజాగా శ్రీలంకలో విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయినా అదానీ గ్రూప్‌ కంపెనీలు ప్రతిపాదిస్తున్న ఖర్చులో దాదాపు మూడిరట రెండొంతుల ధరకే చిన్నచిన్న పునరుత్పాదన ఇంధన సంస్థలు విద్యుత్తును అందిస్తుంటే.. అదానీతో అంటకాగడానికి అదేమీ మోదీ సర్కారు కాదు కదా..! ప్రజాపక్షం వహించే ఏ ప్రభుత్వమూ అలా చేయదని శ్రీలంక ప్రభుత్వం నిరూపించింది. చట్టాలు అసంఖ్యాకులైన ప్రజల ప్రయోజనం కోసమా? లేక గుప్పెడుమంది పెట్టుబడిదారుల కోసమా? అన్నది వాటిని ఉపయోగించే పాలక పార్టీల వర్గస్వభావాన్ని, విధానాలను బట్టి ఉంటుందనడానికి ఇదో నిదర్శనం.

 
 
 

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page