చప్పిడి మెతుకుల చదువులు! అర్థాకలి హాహాకారాలు!
- DV RAMANA

- Aug 1
- 2 min read
ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆకలికేకలు
రుచీపచీ లేని ఆహారం తినలేకపోతున్న దుస్థితి
రేటు ఘనం.. వంటకాలు నాసిరకం
సరఫరాదారును ఏకపక్షంగా మార్చడమే కారణమని ఆరోపణలు
రాష్ట్రంలోని నాలుగు క్యాంపస్‌లలోనూ దాదాపు ఇదే పరిస్థితి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా ఇంజినీరింగ్ చదువులు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో చెబుతున్న చదువుల సారమెంతో గానీ.. వాటిలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాలు మాత్రమే చప్పిడి మెతుకుల కంటే హీనంగా ఉంటున్నాయని విద్యార్థి వర్గాల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రిపుల్ ఐటీల్లో ఇదే దుస్థితి ఉండగా.. ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఈ చప్పిడి మెతుకులు తినలేక బయట పారబోస్తున్నారు. ఇదేం ఆహారమని అధికారులను అడిగితే పెట్టిందే తినమని గదమాయిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఈ దుస్థితికి కారణం ఎటువంటి టెండర్లు, సంప్రదింపులు లేకుండా రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీల్లో ఆహారం, అల్పాహారం సరఫరా చేసే బాధ్యతను ఒకే సంస్థకు గంపగుత్తగా ధారాదత్తం చేసేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) పరిధిలో ఉన్న ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో సుమారు 26,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు.
ఏకపక్షంగా ఆహార సరఫరా బాధ్యత
రాష్ట్రంలో నాలుగు ట్రిపులఐటీలు ఉండగా వాటన్నింటికీ ఏకమొత్తంగా ఒకే గాటన కట్టి ఒకే సంస్థకు ఆహార సరఫరా బాధ్యత కట్టబెట్టేశారు. ఆ మేరకు హరేకృష్ణ మÖవ్‌మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఎటువంటి టెండర్లు, ధరల సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా ఆహార సరఫరా బాధ్యత కట్టబెట్టారు. ఒక్కో విద్యార్థికి రోజుకు అయ్యే ఖర్చును జీఎస్టీతో కలుపుకొని రూ.116 అవుతుందని అంచనా వేసి.. అందులో సుమారు ఆరు రూపాయలు తగ్గించి పనులు కాకుండా రూ.110 చెల్లించేలా RGUKT పాలకమండలిలో ఆమోదించేసి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వేసవి సెలవులకు ముందు వరకు ఆహారం సరఫరా చేసిన సంస్థకు ఒక్కో విద్యార్థికి రూ.88 చొప్పున చెల్లించేవారు. కానీ సెలవుల తర్వాత రంగప్రవేశం చేసిన హరేకృష్ణ సంస్థకు ఏకంగా రూ.110 రేటు ఖరారు చేయడంపైనే అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనూ సదరు సంస్థ మరో మెలిక పెట్టినా అధికారులు అత్యంత ఉదారంగా దానికి కూడా తలూపేశారు. విద్యార్థులకు శాకాహార భోజనం తప్ప మాంసాహారం, గుడ్లు సరఫరా చేసేది లేదన్నదే ఆ సంస్థ పెట్టిన మెలిక. పైగా దాన్ని సర్దుబాటు చేసేందుకు స్వయం సహాయక సంఘాలకు చెందిన మండల, పట్టణ సమాఖ్యలు, హెల్పింగ్ హ్యాండ్స్ వంటి సంస్థల ద్వారా గుడ్లు, చికెన్ అందించేలా ఏర్పాటు చేశారు. అందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.6.67 చెల్లించాలని హరేకృష్ణ సంస్థకు సూచించారు. పోనీలే గుడ్డిలో మెల్ల.. అని సర్దుకుపోదామన్న సాధ్యంకాని దుస్థితి కొన్ని రోజులుగా నెలకొంది.
నాసిరకం వంటలు
వేసవి సెలవుల అనంతరం కాంపస్‌లు తెరుచుకున్న తర్వాత జూలై ఒకటో తేదీ నుంచి విద్యార్థులకు హరేకృష్ట సంస్థ ఆహార సరఫరా బాధ్యత చేపట్టింది. ఆహార పదార్థాల్లో నాణ్యత గానీ, రుచీపచీగానే లేకపోవడంతో విద్యార్థులు దాన్ని తినలేకపోతున్నారు. దీనికి కారణం.. డబ్బులు మిగుల్చుకోవాలన్న యావతో వంటకాల్లో వేయాల్సిన మసాలాలు, స్సైసెస్ మోతాదు బాగా తగ్గించేస్తుండటం వల్ల ఆహార పదార్థాలు పూర్తి నిస్సారంగా తయారవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కడపు నింపుకోవడానికి కొందరు బలవంతంగా తింటుంటే.. మరికొందరు ఆకలిని చంపుకొని ఆహారాన్ని బయట పారబోస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఉదయం అందజేసే అల్పాహారమైనా నాణ్యంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఇడ్లీ, గారె, పునుగులు వంటి వాటిని రొటేషన్ పద్ధతిలో టిఫన్‌గా అందజేస్తున్నారు. అయితే ఇడ్లీ తప్ప మిగతావి తినలేని విధంగా ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు గట్టిగా రాళ్ల మాదిరిగా, ఇంకొన్నిసార్లు ఎక్కువగా వేగిపోయి మాడిపోవడమో, చేదుగా ఉండటం వల్ల తినలేకపోతున్నామని అంటున్నారు.
ఒకరోజు గుడ్డు, చికెన్ గల్లంతు
ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో మొత్తం 4600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్ సరిపోకపోవడంతో సమీపంలో ఉన్న శివానీ కళాశాలను కూడా తీసుకున్నారు. ఎచ్చెర్లలో 3600 మంది సీనియర్ విద్యార్థులు ఉంటుండగా, కొత్తగా చేరిన వెయ్యి మంది జూనియర్ విద్యార్థులు శివాజీ క్యాంపస్‌లో ఉంటున్నారు. వీరందరికీ హరేకృష్ణ సంస్థే ఆహారం, టిఫిన్ సరఫరా చేస్తున్నది. కాగా వారంలో ఐదు రోజులు గుడ్డుతోపాటు బుధ, ఆదివారాల్లో చికెన్ పెట్టాల్సి ఉంది. ఇందులో ఆదివారం చికెన్ బిర్యానీ పెట్టాలి. మిగతా రోజుల్లో శాకాహార భోజనం పెట్టాల్సి ఉంది. గతంలో పనిచేసిన సంస్థ ఈ మెనూనే అమలు చేసేది. కొత్త సంస్థకు కూడా ఇదే మెనూ ఇచ్చినా దాన్ని అమలు చేయడంలేదు. నాలుగు రోజులే గుడ్డు, ఒక్కరోజే చికెన్ పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అది కూడా పెట్టడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా అన్నం కూడా నాణ్యంగా ఉండటం లేదని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నాసిరకం బియ్యం వాడుతున్నందున అన్నం ముక్కిపోయిన వాసన రావడం, తరచూ ముద్దగా ఉండటం వల్ల కనీసం చప్పిడి మెతుకులైనా తినలేక అర్ధాకలి చదువులు సాగిస్తున్నామని విద్యార్థులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






Comments