
గార, నరసన్నపేట కుంభకోణాల్లో ఒక్కలాంటివే
`తాకట్టు బంగారం మాయం కేసు విచారణ మళ్లీ తెరపైకి
`ఇన్నాళ్లూ ఒకే కోణంలో.. ఇప్పుడు రెండో కోణంలో శోధన
`మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్‌పై చర్యలకు ప్రతిపాదన
`ఆర్‌ఎం రాజు అక్రమాల గుట్టు లాగుతున్న విజిలెన్స్
నరసన్నపేట ఎస్‌బీఐ బజారు బ్రాంచిలో జరిగిన రుణాల కుంభకోణంలో బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ల పైన కూడా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజును సరెండర్ చేశారు. ఆ తర్వాత బినామీ రుణాల మంజూరు, హౌసింగ్ లోన్ల కమీషన్‌ను ఏజెంట్ల ఖాతాలో వేసి దానిని దిగమింగేశారన్న ఆరోపణలపై బ్రాంచి మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్‌ను కూడా అక్కడి నుంచి తప్పిస్తారని తెలిసింది. బజార్ బ్రాంచ్‌లో జరిగిన లొసుగులపై ఇప్పటికే ఆమదాలవలస చీఫ్ మేనేజర్ బీఏఎన్ మూర్తి విచారణ ముగించారు. ఏజెంట్ల ద్వారా వచ్చిన వారికి హౌసింగ్ లోన్లు మంజూరు చేసినట్లు చూపించి బ్యాంకు సిబ్బందే కమీషన్ నొక్కేశారని ‘సత్యం’ కథనం ప్రచురించడంతో శుక్ర వారం నుంచి ఆ బ్యాంకు పరిధిలో ఎవరెవరు హౌసింగ్ లోన్లు తీసుకున్నారు, అందులో ఎంతమంది బ్యాంకుకు నేరుగా అప్రోచ్ అయ్యారన్న విషయాలపై విజిలెన్స్ విభాగం నేరుగా రుణగ్రహీతలకు ఫోన్లు చేసి ఆరా తీస్తోంది. ఈలోగా విచారణ సక్రమంగా జరగడం కోసం బీఎంను, ఫీల్డ్ ఆఫీసర్‌ను తప్పించాలనే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తుంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్టేట్ బ్యాంక్ శ్రీకాకుళం రీజనల్ మేనేజర్(ఆర్‌ఎం)గా టీఆర్‌ఎం రాజు పని చేసిన కాలంలో ఈ రీజియన్ పరిధిలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అవి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే గార బ్రాంచిలోనూ, నరసన్నపేట బజారు బ్రాంచిలోనూ జరిగిన కుంభకోణం ఒకే విధంగా ఉంటుంది. గార బ్రాంచిలో తాకట్టు బంగారం ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని దారి మళ్లించి ప్రైవేటు బ్యాంకుల్లో కుదువ పెట్టి, ఆ సొమ్మును ఆర్‌ఎం నేతృత్వంలోని టీమ్ పంచుకుంది. ఎవరైనా ఎస్‌బీఐ బ్రాంచిలో కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించడానికి వస్తే వారిని వారం తర్వాత రమ్మని చెప్పేవారు. ఆలోగా లాకర్‌లో ఉన్న మరో తాకట్టు బంగారం బ్యాగును తీసుకువెళ్లి దాన్ని అక్కడ పెట్టి పాత బ్యాగును తీసుకొచ్చేవారు. ఆ విధంగా దఫదఫాలుగా 89 బ్యాగులు మాయమైపోయాయి. అయితే నరసన్నపేట బజారు బ్రాంచిలో బంగారం బదులుగా రుణాలు ఇచ్చినట్టు చూపించి ఆ సొమ్మును తినేశారు. ఎంఎస్‌ఎంఈ రుణాల పేరిట లేని సంస్థలకు రుణాలిచ్చినట్టు చూపించి, ఆ సొమ్మును సొంతానికి వాడుకున్నారు. ఒక రుణం ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాల్సి వస్తే బ్యాంకు నుంచి 80 పైసల వడ్డీకి తీసుకున్న సొమ్మును బయట మూడు రూపాయల వడ్డీకి తిప్పి దాన్ని వాయిదా కింద కట్టేవారు. అది కూడా ఆలస్యమైతే మరో బినామీ కంపెనీ పేరుతో కొత్త లోను ఇచ్చినట్లు చూపించి పాత అకౌంట్‌ను క్లోజ్ చేసేవారు. అయితే ఒకే తరహా నేరం ఎస్‌బీఐలో జరగడం వెనుక ప్రధాన సూత్రధారి ఆర్‌ఎంగా పని చేసిన టీఆర్‌ఎం రాజేనని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు.
మళ్లీ తెరపైకి గార కేసు విచారణ
తాజాగా ‘ఆర్‌ఎం ఉచ్చులో స్వప్నప్రియే సమిధ’ అన్న శీర్షికతో ‘సత్యం’లో కథనం ప్రచురితమైన తర్వాత గార బ్రాంచిలో జరిగిన తాకట్టు బంగారం మాయం కేసును ఎస్‌బీఐ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ బ్రాంచిలో బంగారం మాయమవడం, పోలీసు ఫిర్యాదు చేయడం, నిందితులను పట్టుకోవడం, గోల్డ్ బ్యాగులను రికవరీ చేయడంతో కథ ముగిసిపోయిందని ఇన్నాళ్లూ బ్యాంకు ఉన్నతాధికారులు భావించారు. అయితే ఇందులో ప్రధాన సూత్రధారులు బ్యాంకు ఉద్యోగులేనని ‘సత్యం’ తన కథనంలో పేర్కొనడంతో తాజాగా దీనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. అస్మదీయులను విడిచిపెట్టేసి తస్మదీయులపై ఆర్‌ఎం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో ఇన్నాళ్లూ ఈ అంశాన్ని అంతా ఒకవైపే చూశారు. కానీ బ్యాంకులో ఉండాల్సిన బంగారం లోలలాక్షి ఫైనాన్స్ సంస్థకు చెందిన తిరుమలరావు చేతుల మీదుగా ప్రైవేటు బ్యాంకులకు కుదువకు వెళ్లిందని తేల్చిన పోలీసులు తిరుమలరావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఆ సొమ్ము అప్పటి ఫీల్డ్ ఆఫీసర్ చింతాడ శ్రీనివాసరావు ఖాతాలో పడిరదని చెప్పారు. కానీ ఈ విషయాన్ని అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు పైఅధికారుల దృష్టిలో పెట్టలేదు. ఈ కేసుకు సంబంధించి పాత్రధారులపై కేసులు నమోదు కాగా, సూత్రధారులు తప్పించుకున్నారంటూ ‘సత్యం’ కొన్ని ప్రశ్నలు లేవనెత్తడంతో దీనిపై ఇప్పుడు శాఖాపరమైన విచారణ మొదలైంది.
ఆర్‌ఎం చేసిన బదిలీలపై దృష్టి
గార బ్రాంచిలో బంగారం మాయమైనప్పుడు అక్కడ పని చేసిన ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావును ఆ తర్వాత నరసన్నపేట బ్రాంచ్‌కు ఆర్‌ఎం రాజు బదిలీ చేశారు. ఇప్పుడు అక్కడ పాత్ర ముగిసిపోయిందని తేలిన తర్వాత ఆయన్ను స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ప్రాసెసింగ్ సెల్‌కు బదిలీ చేశారు. నరసన్నపేట బజారు బ్రాంచిలో వెలుగు చూసిన బినామీ రుణాల మంజూరులో కూడా శ్రీనివాసరావు పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి. గార బ్రాంచిలో మాయమైన బంగారం డబ్బులు, నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ రుణాల వ్యవహారాల్లో చింతాడ శ్రీనివాసరావు పాత్రపై ఇప్పుడు విచారణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. గార బ్రాంచిలో జరిగిన నాటకీయ పరిణామాల తర్వాత ఎస్‌బీఐ విజిలెన్స్ విభాగం ఆర్‌ఎంపై ఓ కన్నేసి ఉంచింది. ఆర్‌ఎం తన పరిధిలో తనకు కావాల్సిన ఉద్యోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడకు బదిలీ చేయడం వంటి చర్యలపై ఇంతకు ముందే ఫిర్యాదులు వెళ్లాయి. కాకపోతే సాధారణ బదిలీలు జరిగే సమయంలో ఆయనకు స్థానమార్పిడి ఉంటుందని అంతా భావించారు. ఒక స్టేట్‌బ్యాంకు ఉద్యోగిని నెల రోజుల వ్యవధిలోనే నాలుగు స్థానాలు మార్చి, చివరకు రీజనల్ కార్యాలయంలో ఉన్న గెస్ట్ రూమ్‌లో 15 రోజులు అనధికారికంగా ఉంచిన టీఆర్‌ఎం రాజుపై కొద్ది రోజుల క్రితమే ఏజీఎం సత్యానంద్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఇప్పుడు తవ్వుకుంటూపోతే ఈ రీజియన్ పరిధిలో రాజు, ఆయన బంట్లు చేసిన అక్రమాలు చాలానే బయటపడే అవకాశం ఉంది.
Comments