top of page

చెత్తను ఎత్తలేక చేతులెత్తేస్తున్నారు!

Writer: ADMINADMIN
చెత్తేర్‌.. చెదారేర్‌..

  • ఒక్కో మున్సిపాలిటిలో రోజుకు వందల మెట్రిక్‌ టన్నుల చెత్త

  • కొన్ని రాష్ట్రాల్లో కొండల్లా పేరుకుపోతున్న చెత్త

  • చెత్తను మేనేజ్‌ చేయలేక బెంబేలెత్తిపోతున్న స్థానిక సంస్థలు

  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌

మన ఇంట్లో కూరగాయలు తరుగుతాం కదా, వచ్చిన చెత్తను ఏం చేస్తాం? వీధిలో పడేస్తాం. భోజనాలు కానిచ్చాక మిగిలిన చెత్తను ఏం చేస్తాం? అది కూడా వీధిలోకే. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలోనే ప్రతిరోజుకు కేజీకి పైన చెత్త వీధుల్లోకి చేరితే, ఆ రోజంతా వీధిలోకి వచ్చిన వందల కేజీల చెత్త ఏమవుతుంది? టన్నుల కొద్దీ చెత్తను మరుసటి రోజు ఉదయమే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, లేదా కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు ట్రాక్టరు తీసుకొచ్చి ఎత్తుకుపోతారు. అలా ఊర్లో పోగైన రెండు మూడు ట్రాక్టర్ల చెత్తను ఆ రోజు మధ్యాహ్నానికి ఏం చేస్తారు? తిన్నగా ఊరవతలకు తీసుకువెళ్లి డంప్‌ యార్డులో పడేస్తారు. అలాంటిది పెద్ద పెద్ద పట్టణాల్లో రోజుకి ఎంత చెత్త పోగు పడుతుంది? ఇప్పుడు మనం వేసిన లెక్క కేవలం గృహ వినియోగంలో పోగుపడిరది. మరి పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్యపరమైన వినియోగంలో విడుదలవుతున్న చెత్త అంతా అదే డంప్‌ యార్డులకు చేరుతోంది. ఇప్పుడది కొండలుగా మారి చాలా మున్సిపాలిటీల్లో మనుషులకు తీవ్రమైన ముప్పు కలిగించే ప్రాణాంతకంగా మారుతోంది. దీనిని ఏవిధంగా మేనేజ్‌ చేయాలో తెలియక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటున్నాయి. గోరుచుట్టు మీద రోకటిపోటులా ఇప్పుడు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఈ ప్రాణాంతకమైన పరిణామం గురించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

డిసెంబర్‌ 2023లో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తనకు తానుగా దేశంలోని అన్ని స్థానిక సంస్థల యాజమాన్యాలకు దీనికి సంబంధించిన ఒక విపులమైన సర్కులర్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఈ ఏడాది హర్యానా, ఢల్లీి రాష్ట్రాల్లో గురుగ్రాం, ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్లను పిలిపించి ఆరావళి పర్వత శ్రేణుల నడుమ బంద్వారీ పర్వతాల నడుమనున్న మైదాన ప్రాంతంలో వద్దని చెప్తున్నా ఎందుకు చెత్త పారేస్తున్నారని ప్రశ్నించింది. ఇదివరకు పోగుపడిన చెత్తను పూర్తిగా పోనివ్వకుండానే, దానిపై ఏవిధమైన చర్యలు చేపట్టకుండానే ఇప్పుడు కొత్తగా అక్కడ చెత్త పారేయడం ఏమిటని గట్టిగా నిలదీసింది. కానీ ఈ రెండు పట్టణ మున్సిపాలిటీలు దీనికి సంబంధించి ఏ విధమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఇదే ప్రశ్న దేశంలోని ఏ మున్సిపాలిటీని లేదా మున్సిపల్‌ కార్పొరేషన్‌ను అడిగినా నిలువుగుడ్లు వేసుకు చూస్తున్నాయే తప్ప, సమాధానం మాత్రం లేదు. ఎందుకంటే మన దేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలే ఖరారు కాలేదు. ఏటికేడాది ఇలా పోగుచేస్తున్న డంప్‌యార్డుల్లో రకరకాల రసాయనాలు వెలువడుతున్నాయని ఎన్జీటీ ఇందుకు అభ్యంతరం చెప్తోంది. ప్రత్యేకంగా ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రతిరోజు దాదాపుగా వేల మెట్రిక్‌ టన్నుల చెత్త పోగుపడుతోంది. దానిని ఏమీ చేయలేక ఆ యాజమాన్యం చేతులెత్తేస్తోంది. గుడ్డు పెంకుల నుంచీ జంతు మలం వరకూ ప్రతీదీ పాలిథిన్‌ బ్యాగుల్లో చుట్టి పడేయడం ఈ దేశస్తులకు ఇప్పటికే ఒక అలవాటుగా మారింది. అరటి తొక్కల నుంచి తినేసిన బిస్కెట్‌ ప్యాకెట్‌ కవరు వరకు ప్రతీది ఈ చెత్తలో పోగుపడుతోంది. అయితే ఇదంతా శిథిలమైపోయే చెత్త కదా, ఎందుకు ఆందోళన చెందడం అని మనం అనుకోవచ్చు. చాలా విచిత్రమైన విషయం ఏమంటే, ఇప్పుడు పేరుకుపోతున్న చెత్తలో హానికరమైన విష రసాయనాలు బయటపడుతున్నాయి. ఇది ఏ విధంగా జరుగుతోందో అధికారులకు అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం ఎక్కడైనా స్థలం చూపిస్తే అక్కడ చెత్త పోగేయడమే తప్ప, స్థానిక సంస్థల యాజమాన్యాలకు అంతకుమించి ఏమీ చేతకావడం లేదు.

అతిపెద్ద సమస్య పౌరస్పృహ లేకపోవడం

సుప్రీంకోర్టు పరిశీలించిన మరో ఉదాహరణ పేరుకే ఢల్లీికి పరిమితం. కాని మన దేశంలో కనీసం పాతిక చోట్ల ఇవే పరిస్థితులు దాపురించినట్లు ఎన్జీటీ ఫిర్యాదు చేస్తోంది. ఢల్లీికి కూతవేటు దూరంలో దగ్గరలో భాల్సువా డైరీ సిటీ ఉంది. సుమారు యాభై ఏళ్ల కింద పాడి పరిశ్రమను పెంపొందించే ఉద్దేశంతో ఢల్లీి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాల్స్‌ ఈ ప్రాంతంలో ఒక డైరీ సిటీని రూపొందించింది. పెద్ద కాలనీని డిజైన్‌ చేసి, తానే గృహాలు రూపొందించి, పశువులు అత్యధిక సబ్సిడీతో అందజేసింది. తాను అనుకున్న ప్రకారం పట్టణానికి పాలు సరఫరా చేసే కేంద్రంగా రూపొందించారు. కాని, మూడు దశాబ్దాల కిందట నగరంలో పోగు పడుతోన్న చెత్తను డంప్‌ చేయడానికి వీలుగా ఈ డైరీ సిటీకి ఆమడ దూరంలో ఇంకొక స్థలాన్ని ఇచ్చారు. ఈ మూడు దశాబ్దాల్లో ఆ చెత్త క్రమక్రమంగా పెరుగుతూ ఒక పెద్ద కొండ మాదిరిగా తయారయింది. దాని చుట్టుపక్కల ఎవరూ ఉండలేని దుర్గంధం దాపురించింది. ఇప్పుడు ఆ కాలనీవాసులు తమ ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతోందని రోడ్డెక్కుతున్నారు. వెంటనే డంప్‌ యార్డును తరలించమని ఢల్లీి ప్రభుత్వానికి వినతులు పెడుతున్నారు. స్థానికులు తమ ఆరోగ్యాలు పణంగా పెట్టలేమని, వెంటనే డంపు యార్డును తరలించాలని కోరుతుంటే, ప్రభుత్వమేమో డంపు యార్డుకు దగ్గరలో కాలనీవాసులను తరలించాలని, వారికి పునరావాసం కల్పించాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

మేఘాలయలో వుంకేన్‌ నది పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపు 12 గ్రామాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన గళం విప్పాయి. దానికి కారణం ఈస్ట్‌ కాశీ హిల్స్‌ జిల్లాలో వుంకేన్‌ నదిని ఆనుకున్న ప్రదేశాన్ని ప్రభుత్వం డంపింగ్‌ యార్డుగా ఎంపిక చేయడమే. ఈ చెత్త కొన్ని ఏళ్లకే పేరుకుపోయి, మొత్తం నదిని కలుషితం చేస్తుందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వారికి ఆ నదీజలమే తాగునీటి ఆధారం. 2023లో రెండు వారాలపాటు జరిగిన కన్వర్‌ యాత్రలో హరిద్వార్‌ ప్రాంతంలో 30వేల మెట్రిక్‌ టన్నుల నాన్‌ బయో డిగ్రేడబుల్‌ చెత్త పోగయింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ప్రాంతం ఏదైనా సమస్య ఒకటే. చెత్తను మేనేజ్‌ చేయలేక ప్రభుత్వాలు చతికిలపడడమే.

ఆలోచన ధోరణి మారనంతవరకూ ఇంతే!

మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైదాన ప్రాంతంలో చెత్త పోగేయడం ఒక సాధారణ అంశం. ఈ ఓపెన్‌ ఫీల్డుల నుంచి దుర్గంధం వెలువడటం, కొన్నిసార్లు చెత్త అగ్నికి ఆహుతి కావడం, అప్పుడు వెలువడే వాయువులు ప్రమాదకరంగా పరిణమించడం రివాజుగా మారింది. దీనికి కారణం ఇది తనంతట తాను శిథిలమయ్యే (డిగ్రేడబుల్‌) చెత్త కాకపోవడమే. దేశ రాజధానిలో ఉన్న డంపుయార్డుల్లో చెత్తను పరిశీలించిన పొల్యూషన్‌ బోర్డు శాస్త్రవేత్తలు వాటిలో కలిసివున్న ప్రమాదకర రసాయనాలను చూసి విస్మయం చెందుతున్నారు. మనదేశంలో స్థానిక సంస్థల యాజమాన్యాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించక, తాత్కాలిక పరిష్కారాలతో పొద్దు పుచ్చుతున్నారు. సమస్య పరిష్కారానికి కేటాయించిన నిధులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు బదిలీలపై పోవడం, మనకు చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణాలు. ఈ చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించే పనిముట్లు గాని, అంత సాంకేతికత గాని, దానికి సరిపడా సిబ్బంది గాని మన వద్ద లేకపోవడం కూడా ఒక వాస్తవమే.

ఇలా పేరుకుపోతున్న చెత్త నుంచి వెలువడుతున్న భయంకరమైన రసాయన విష వాయువులు అక్కడ నేల నుంచి దగ్గర్లో ఉండే జలవనరులలో కలిసిపోతున్నాయి. ఇది మరింత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తోంది. ఆ జలావాసాల్లో పెరిగిన చేపల్ని వినియోగించినవారు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్జీటీ ఓపెన్‌ ప్లాట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తను పోగేయవద్దని కోరుతోంది. మరి అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో ఏం చేస్తున్నాయని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చెత్త సమస్యను వారు పరిష్కరించారు. దానికి సాంకేతికత సహాయం తీసుకున్నారు. ప్రపంచంలో ఈ విషయంలో స్వీడన్‌ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు స్వీడన్‌ తన పొరుగు దేశాల నుంచి చెత్తను కొంటున్నది. ఎందుకంటే దానినుంచి అంత లాభం సంపాదిస్తోంది. మీథేన్‌ హార్వేస్ట్‌ చేయడం, విద్యుత్‌ ఉత్పత్తి జరపడం, మెటీరియల్‌ రికవరీ సెంటర్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెప్తున్నారు. స్వీడన్‌ చెత్త నుంచి సంపద సృష్టిస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పోగుపడుతున్న చెత్తను సమర్థంగా వినియోగించుకోవడానికి మరిడి లాంటి కొన్ని సంస్థలు కొంతమేర ప్రయత్నిస్తున్నాయి. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే యంత్రాంగం మనం రూపొందించగలిగితే, స్థానిక సంస్థలు పెద్ద ఎత్తున సంపద సృష్టించగలుగుతాయి. ఎక్కడా చెత్త దుర్వినియోగం కాదు. స్థానిక సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం కాగలుగుతాయి.

రోడ్లు ఊడ్చడం నుంచి చెత్త ఎత్తడం వరకు ఇదంతా దళితుల పనిగా మన దేశం భావిస్తోంది. అందువల్లనే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం. ఇంతవరకూ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంటుకు మనకు ఒక వ్యవస్థ లేకపోవడం శోచనీయం. పేరుకే వంద స్మార్ట్‌ సిటీలు ప్రకటించుకున్నాం. చెత్త గురించి ఆలోచించలేకపోతున్నాం.

- దుప్పల రవికుమార్‌

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page