చంద్రబాబు.. సెల్ఫ్ మేడ్ లీడర్
- DV RAMANA

- Apr 20
- 3 min read

1996-2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు ఎంత తేడా? ఆ రోజుల్లో ప్రధానులను మార్చి మార్చి నియమిస్తూ, మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న లోకేష్ వద్దన్నాడని వదిలేసిన బాబు ఇప్ప్పుడెక్కడ? తర్వాత కాలంలో హరికిషన్‌సింగ్ సుర్జిత్, ఏబీ బర్దన్, డి.రాజా.. ఇంకా చిన్నాచితగా ఢిల్లీలో ఉండే నాయకుల్ని ఏమార్చి 1998లో బీజేపీ పెద్దల దగ్గరికి పోయి స్పీకర్‌గా బాలయోగిని చేసి తలుపు ఓరగా వేసి గడప బయట నుంచే మద్దతు ఇస్తారంటూ సమస్య వచ్చినప్పుడల్లా చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్ప్పుడేరీ? తనపై అలిపిరిలో దాడి జరిగితే ప్రజల్లో సానుభూతి వచ్చిందని సికింద్రాబాద్ వైస్రాయ్ హోటల్లో బసచేసిన వాజ్‌పాయ్ చేత కూడా జాతీయ ఎన్నికలను ఎనిమిది నెలల ముందుకు జరిపించేసిన చంద్రబాబు ఇప్ప్పుడు మచ్చుకు కూడా ఎందుకు కనిపించడంలేదు? కేంద్ర ప్రభుత్వం తన ఎంపీల దాక్షిణ్యంతోనే మనుగడ సాగిస్తోందని తెలిసి కూడా మోడీ, షాలు ఎప్పుడు రమ్మంటే అప్పుడు కేవలం ఒక జత బట్టలతో ఢిల్లీ పోయి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసి వస్తున్న చంద్రబాబెక్కడ? రాజకీయాల్లో విజయం అనేది కేవలం అవకాశాల మీద ఆధారపడి ఉండదు, ఆ అవకాశాన్ని సృష్టించుకునే సాహసం మీద ఆధారపడి ఉంటుంది. 1975-1980 మధ్య కాలం భారత రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైనది, అస్థిరమైనది. అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, ఒక యువ విద్యార్థి నాయకుడిగా ఉండి, ఎమ్మెల్యేగా గెలిచి, ఆ వెంటనే మంత్రి స్థాయికి ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఒక రాజకీయ అద్భుతం. దానికి గుండె నిండా ధైర్యం కావాలి. 1975లో విధించిన ఎమర్జెన్సీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచింది. 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవ్వడం, కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం రావడం.. ఇవన్నీ దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. ఎంతోమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవడానికి సిద్ధమైన ఆ తరుణంలో, ఆ పార్టీలో ఉండటమే ఒక పెద్ద సాహసం. కానీ చంద్రబాబు నాయుడు ఆ క్లిష్ట సమయంలోనే తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. 1978 నాటికి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఇంకా చల్లారలేదు. అటువంటి క్లిష్ట సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి యువ నాయకత్వం కోసం వెతుకుతోంది. అదే సమయంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ సాధించడం చంద్రబాబుకు ఒక పెద్ద పరీక్ష. ఆయన కేవలం పార్టీ టికెట్ మీద ఆధారపడలేదు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా తనకంటూ ఒక బలమైన స్థానిక బంధాన్ని ఏర్పరచుకున్నారు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు అండగా నిలిచిన యువ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. 1978లో ఆయన గెలుపు, ఆయన వ్యక్తిగత బలమే తప్ప, గాలిలో వచ్చిన విజయం కాదు. కేంద్రంలో ఇందిరా గాంధీ మళ్ళీ పుంజుకుంటున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు చురుకైన పాత్ర పోషించారు. పార్టీ పట్ల ఆయన చూపిస్తున్న విధేయత, కష్టకాలంలో నిలబడిన ధైర్యం ఆయనను అగ్ర నాయకత్వానికి దగ్గర చేశాయి. 1978లో ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లకే, 1980లో ఆయన ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబం రాజకీయ నేపథ్యం లేకున్నా.. యూనివర్సిటీ విద్యార్థిగా ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవ్వడం ఊహకు కూడా అందని విషయం. చంద్రబాబు నాయుడు ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోకుండా, పార్టీని నమ్ముకుని నిలబడటం, ఎమ్మెల్యే స్థాయికి చేరడం అనేది ఒక ప్రాథమిక మెట్టు అయితే, మంత్రిగా ఎదగడం ఆయన పనితీరుకు నిదర్శనం. దేశంలో కాంగ్రెస్ ఓడిపోతున్నా, తన నియోజకవర్గంలో గెలిచి చూపించగలననే ఆత్మవిశ్వాసం. నిజానికి, ఒక విద్యార్థి దశ నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుని, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేది ఒక రాజకీయ అద్భుతమే. కష్టకాలంలో కూడా అవకాశాలను వెతుక్కుని, నిలకడగా నిలబడే వారికే రాజకీయాల్లో స్థిరమైన భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు ప్రస్థానం మనకు స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ముదర డెక్కలు, యన్టీఆర్ ..టీడీపి ఎమ్మెల్యేలని ముప్పు తిప్పలు పెడుతున్నారు. అప్పుడు..పిల్లల్ని ఎత్తుకు పోయే గద్దల బారి నుండి రక్షించుకునే కోడిలాగ..పొదువు కున్నారు. యన్టీఆర్‌కు అండగా..మొత్తం తానై ముందుకు నడిపించారు. ఆయనకు తోడుగా..వెంకయ్య..వామపక్షాలు ఉన్నాయి. తిరిగి యన్టీఆర్ ముఖ్యమంత్రి కావటానికి శ్రమించారు. తర్వాత పార్టీలో..పని చేస్తూ..పార్టీ నిర్మాణం ..గ్రామస్దాయి నుండి పటిష్టపరిచారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి వారు సమర్ధుడైన యువనాయకుడు..! మంత్రిగా పనిచేసారు..! ప్రజల్లో కూడా గుర్తింపు వచ్చింది కొద్దిగా..! అయితే ప్రజాకర్షణ..అనర్ఘళ వాగ్ధాటి లేదు. ఆయనకు అది స్పష్టమైన లోపం..! రాజును చూసిన కళ్ళతో మొగుడ్ని చూసినట్టు..! యన్టీఆర్ స్ధానం లో ఈయన్ని ఊహించుకోలేకపోయారు కొందరు పార్టీ సానుభూతి పరులు..! యన్టీఆర్ వీరాభిమానులు...! తర్వాత ఆయన్ని ఆయన తయారు చేసుకున్నాడు. అతనిలోని లోపాలు..క్రమశిక్షణ..పనితీరు తో అధికమించటానికి ప్రయత్నం చేసారు. రాజకీయం కొత్తమలుపు తీసుకున్నది. ఎన్నికలు.. అధికారం లక్ష్యంగా ఉండే రాజకీయాలు అభివృధ్ది .. సంస్కరణలు.. వైపు మారాయి. అభివృధ్దిలో భాగంగా కొత్తమార్గాలు అన్వేషించారు. సంస్కరణలకు.. దార్శనికత తోడయింది. పని చేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు..అదే ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రి ని చేసింది. దేశవిదేశాల పెట్టుబడులు..పాలనాపరమైన విధానాలు కొత్తపుంతలు తొక్కాయి. ఆయన చేసిన..అభివృధ్ది..సంస్కరణ ఫలాలు ప్రజలకు పంచే లోపల ..అధికారం కోల్పోయారు. ఆయన మస్తిష్కం నుండి..వచ్చిన ఆలోచనలు..దేశం ఆచరించింది. రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకుంది. ఆనాటి నుండి..ఆయన ఎదుర్కున్న..అవమానాలు..విమర్శలు దేశంలో ఏ రాజకీయనాయకుడు ఎదుర్కుని ఉండరు. సుదీర్ఘకాలం అధికారంలో లేకపోయినా..పార్టీని కాపాడుకున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా చంద్రబాబు చరిత్ర మాత్రం ఒక పాఠమే. ఒక నాయకుడు ఇన్నాళ్లు జనం మధ్యలో ఉన్నా, మొగసాటు కలగకపోవడం, అది కూడా సినిమాహీరో చరిష్మా లేని తొలినాయకుడు చంద్రబాబే. దక్షిణాదిలో నిరంతరం పార్టీలు అధికారాన్ని కోల్పోతుంటాయి. దాన్ని మళ్లీ సినిమా చరిష్మాతో నిలబెట్టుకున్న రాష్ట్రాలున్నాయి. అలా కాకుండా ఓ సినిమాయేతర వ్యక్తి ఇన్నేళ్లు పార్టీని బతికించడం చరిత్రే. చంద్రబాబు పాలన, ప్రాంత ప్రీతి వంటి అంశాలపై ఫిర్యాదులున్నా రాజకీయ నాయకుడిగా చంద్రబాబు శైలి భిన్నమైనదే. కాకపోతే గత చంద్రబాబు ఇప్ప్పుడు కనిపించడంలేదు. బాషా సినిమాలో రజనీకాంత్ తిరిగి బాంబే బాషా అయినట్టుగా చంద్రబాబు 1998-2004 చంద్రబాబు కావాలని కోరుకుందాం.






Comments