చైనా-భారత్ విచిత్ర బంధం!
- DV RAMANA
- May 17
- 2 min read

దాయాది పాకిస్తాన్‌తో సుదీర్ఘకాలంగా ఘర్షణ పరిస్థితులు నెలకొన్నట్లే చైనాతోనూ భారత దేశం సరిహద్దు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు చెందిన పలు సరిహద్దు ప్రాంతాల పేర్లను చైనా తన మ్యాపు ల్లో మార్చి చూపించడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సరిహద్దుల్లో చైనా చొరబాట్ల కారణంగా తరచూ సైనిక ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇన్ని ఉద్రిక్తతల మధ్య రెండు దేశాల మధ్య వాణిజ్యం మాత్రం పెరుగుతుండటం విచిత్రం. ఇటీవలే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌ను దెబ్బకొట్టిన భారత సైనిక సామర్థ్యం, ఆయుధ పాటవంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించడం సహజం. భారత్ ఒక సూపర్ పవర్‌గా మారుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సహజంగానే ఇవి భారత ప్రత్యర్థులకు నచ్చవు. ముఖ్యంగా పాక్‌కు గట్టి వత్తాసు పలుకుతున్న, భారత్‌ను చిరకాల ప్రత్యర్థిగా భావిస్తున్న చైనా అలా భావించడం అసహజమేమీ కాదు. సరిహద్దు వివాదాలు, వాణిజ్యపరమైన పోటీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చైనా ఎప్పటికైనా ముప్పే అనే అభిప్రాయం తరచూ వినిపిస్తోంది. అయితే ఈ సంబంధాలను కేవలం ముప్పుగానే కాకుండా సవాళ్లు, అవకాశాల సమ్మేళనంగా విశ్లేషించుకోవాలి. సవాళ్ల గురించి మాట్లాడుకుంటే.. తూర్పు లడ్డాఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ`వాస్తవాధీన రేఖ) వెంబడి, గల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 2024 అక్టోబరులో రెండు దేశాలు చర్చించుకుని పెట్రోలింగ్‌ను పునరుద్ధరించి నప్పటికీ సరిహద్దు వివాదం పూర్తిగా పరిష్కారం కాలేదు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో గ్రామాల పేర్లను చైనా మార్చేస్తుండటం పట్ల ఇటీవలే భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరం తెలిపింది. టిబెట్‌లో 100 బిలియన్ డాలర్లతో చైనా చేపట్టిన హైడ్రోపవర్ డ్యామ్ నిర్మాణం వల్ల భారత్ నీటి భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. చైనా 2024లో అమెరికాను అధిగమించి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. అయినప్పటికీ చైనీస్ ఉత్పత్తులపై ఆధార పడటాన్ని తగ్గించేందుకు ఆత్మనిర్భర్ కార్యక్రమం ద్వారా భారత్ ప్రయత్నిస్తోంది. 5జీ పరీక్షల నుంచి హువాయ్, జెడ్‌టీఈ వంటి చైనీస్ కంపెనీలను తొలగించడం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో స్వావలంబనను పెంచడం వంటి చర్యలు ఇందులో భాగమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) ద్వారా దక్షిణ ఆసియాలో తన ప్రభావాన్ని చైనా విస్తరిస్తోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, శ్రీలంకలో హంబన్ తోట ఓడరేవు లీజు, నేపాల్ బీఆర్‌ఐలో చేరిక, బంగ్లాదేశ్ రుణ నిబంధనలు వంటివి దీనికి ఉదాహరణలు. దీనికి ప్రతిగా భారత్ క్వాడ్ (భారత్, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా), ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్, జీ20 వంటి వేదికల ద్వారా చైనా ప్రభావాన్ని సమతుల్యం చేస్తోందని ఫారిన్ పాలసీ నివేదించింది. 2024 బ్రిక్స్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు పరస్పర నమ్మకం, గౌరవం ఆధా రంగా సంబంధాలను మెరుగుపరచాలనే ఆశాజనక సంకేతాలు ఇచ్చాయి. మొన్న జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి బీజింగ్ పర్యటన సమయంలో టిబెట్‌లో హిందూ పుణ్యక్షేత్రాల్లోకి ప్రవేశం, ట్రాన్స్‌బోర్డర్ నదీజలాల వినియోగం, డేటా షేరింగ్ వంటి అంశాలపై ఒప్పందాలు కుది రాయి. అయితే ఇవేవీ సరిహద్దు వివాదాల పరిష్కారానికి హామీ ఇవ్వడం లేదని విదేశీ వ్యవహా రాల నిపుణులు పెదవి విరుస్తున్నారు. కాగా భారత్-చైనా సంబంధాలు భవిష్యత్తులో సవాళ్లు, అవకాశాల సమ్మేళనంగా కొనసాగే అవకాశం ఉంది. చైనా దృఢమైన విదేశీ విధానం, భారత్ వ్యూహాత్మక సమతుల్య విధానాల కారణంగా రెండు దేశాలు పరస్పరం పోటీపడుతూనే సహకరిం చుకోవలసి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ కూటముల్లో చురుకైన పాత్ర పోషించడం, ఆర్థిక స్వావలం బనను పెంచుకోవడం ద్వారా చైనాతో సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించగలదు. అయితే శాంతి స్థిరత్వం కోసం రెండు దేశాలు పరస్పర నమ్మకం పెంచుకోవడం కీలకం. ఇది జరిగితే భారత్, చైనాలు అన్ స్టాపబుల్‌గా ప్రగతిపథంలో దూసుకుపోతాయి.
Comments