చాపురంలో మహానాడు
- Prasad Satyam
- Apr 28
- 1 min read
150 ఎకరాల్లో సిద్ధం చేసిన ఎమ్మెల్యే
వచ్చే నెల 27 నుంచి 29 వరకు సంబరం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏడాది అట్టహాసంగా నిర్వహించే మహానాడు ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గం చాపురం, పాత్రునివలస మధ్యలో నిర్వహించడానికి ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు భోగట్టా. ఈసారి మహానాడు సిక్కోలులోనే జరుగుతుందంటూ ‘సత్యం’ గత నెల 30న కథనం ప్రచురించింది. ఇప్ప్పుడు సరిగ్గా అనుకున్నట్టుగానే శ్రీకాకుళం నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అంగీకరించినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాýకు కామన్ ఏరియాలో మహానాడు నిర్వహించడానికి అనేక ప్రాంతాలు ఇన్‌ఛార్జి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు. చివరిగా ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పాత్రునివలస, చాపురం మధ్యలో ఉన్న స్థలాన్ని కూడా చూశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉండటం, నగరంలోకి వాహనాలు రావాల్సిన అవసరం లేకపోవడం, శ్రీకాకుళం నగరానికి ఆనుకొనే ఉండటం వంటి కారణాల రీత్యా ఇక్కడే మహానాడు నిర్వహించాలని లోకేష్ నిర్ణయించినట్టు భోగట్టా. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత మీడియాకు ప్రకటించే అవకాశాలున్నాయి. దాదాపు 150 ఎకరాల ప్రాంగణం కావాల్సి ఉండటంతో గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే గొండు శంకర్ స్థానిక రైతులతో సంప్రదింపులు జరిపారు. వారి అంగీకారం మేరకు ఈ స్థలాన్ని చదును చేసి వేదికలు తయారుచేయనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మహానాడు శ్రీకాకుళం జిల్లాలో చేయడం ఇదే తొలిసారి.






Comments