చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
- BAGADI NARAYANARAO
- Jun 6
- 1 min read
15 బైక్‌లు, బంగారం, వెండి ఆభరాణాలు స్వాధీనం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సారవకోట, జలుమూరు, నరసన్నపేట, ఎచ్చెర్ల, లావేరు, జేఆర్ పురం, శ్రీకాకుళం టూటౌన్, విజయనగరం జిల్లా డెంకాడ పోలీసు స్టేషన్ల పరిధిలో అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న సారవకోట మండలం బుడితికి చెందిన కొర్ల శివను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రణస్థలం మండలం సుందరపాలెంకు చెందిన బస్వా సుధాకర్ రెడ్డి శ్రీకాకుళం నగరంలో ఏఎస్‌ఎన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను తీసుకువచ్చి కేసుల పూర్వపరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకొని 35 గ్రాములు బంగారం, 129 గ్రాములు వెండి ఆభరాలతో పాటు 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సారవకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ అనీల్‌కుమార్ బుడితి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొర్ల శివ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడని తెలిపారు. ఆయన నుంచి ప్లాస్టిక్ సంచిలో రెండు పాలిథిన్ కవర్లలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను గుర్తించి అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయగా నేరాలకు పాల్పడినట్టు గుర్తించారన్నారు. సారవకోట పరిధిలో బంగారం, వెండి ఆభరణాలు, ఒక బైక్, జలుమూరు పరిధిలో బంగారం, వెండి ఆభరణాలు, ఎచ్చెర్ల పరిధిలో 5 మోటార్ సైకిళ్లు, జేఆర్ పురం పరిధిలో రెండు, శ్రీకాకుళం టూ టౌన్ పరిధిలో రెండు, లావేరు పరిధిలో ఒకటి, నరసన్నపేట పరిధిలో ఒకటి, డెంకాడ పరిధిలో ఒకటి మోటార్‌సైకిల్‌ను తస్కరించినట్టు తెలిపారు.
శ్రీకాకుళంలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మౌళీ సిబ్బందితో పాత్రనివలస ఫ్లైఓవర్ అండర్‌పాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బస్వా సుధాకర్‌రెడ్డి పట్టుబడ్డాడని తెలిపారు. శ్రీకాకుళం రెండవ పట్టణ పరిధిలో విశాఖపట్నంలో మొత్తం మూడు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్టు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించి కేసు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకొని ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరిచిన నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాస్‌రావు, సారవకోట ఎస్సై అనిల్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ ఎస్‌ఎస్ చంద్రమౌళీ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డివిజన్ అధికారులు, సీఐలు పాల్గొన్నారు.
Comments