
ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని స్థితిలోకి వచ్చేశారు సినీనటుడు చిరంజీవి. సినిమా ఫంక్షన్లకు వెళ్లి రాజకీయమాటలు, చిల్లరకూతలు మొదలుపెట్టారు. తన తాత సరస ప్రస్తావన, హీరోయిన్ల మీద వగలు పోవడాలు అతని వయసు పట్ల అభద్రతని సూచిస్తే, మగవారసుడు కావాలని కోరడం అతనిలోని ఛాంద సాన్ని ఎత్తిచూపుతుంది. తన కుటుంబాన్ని తెలివిగా మతంవైపు నడిపించి రాజకీయ పబ్బం గడుపుకో వాలనే కుట్ర కనిపిస్తుంది. ధైర్యం లేక నంగిగా నెట్టుకొస్తున్నా గానీ, ఇతని నిజరూపం మెలమెల్లగా బయటికొస్తోంది. ఈమధ్య రెండు సినిమా ఫంక్షన్లలో సినీ నటుడు చిరంజీవి చేసిన రెండు వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. అందులో మొదటిది ‘ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెందింది జనసేనగా’ అనడం. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన అనంతరం ఆశించిన ఫలితం రాకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆశించిన ఫలితం అంటే అధికారంలోకి రావడమే. ఆయన ఏ ముఖ్య మంత్రో అయిపోదాం అనుకున్నారు. పార్టీ పెట్టింది అందుకేగా మరి. 2009 ఎన్నికల్లో 18 సీట్లు వచ్చి ప్రతిపక్షంలో కూర్చోడం ఆయనకి నచ్చలేదు. అంతే, ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా టెన్యూర్ అయిపోయిన వెంటనే రాష్ట్ర విభజన కారణంగా ఏపిలో ఘోరాతిఘోరంగా కాంగ్రెస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్‌కి కనుచూపు మేర భవిష్యత్తు లేకుండా పోయింది. ఆ దెబ్బకి చిరంజీవి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లు ప్రకటించారు. పదవులు, అధికారం లేకపోతే ఇంక రాజకీయాలు దేనికి అన్నట్లుంది ఆయన ధోరణి. అప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ దృశ్యంలోకి వచ్చారు. నిజానికి ఆయన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి అధిపతి. అన్నగారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల ఈయనకి కొన్ని అభ్యంతరాలున్నట్లు బయటకు వార్తలొచ్చాయి. ఆ వార్తలు రావడం ఆయనకి అవసరం విశ్వసనీయత పెంచుకోడం కోసం. కాబట్టే ఆ వార్తలొచ్చాయనే అనుకున్నా.. కొన్నాళ్లకి పవన్ వాయిస్ మారిపోయింది. తన అన్న ఎంతో ఉదాత్తుడని, ఆయనకి రాజకీ యంగా కొన్ని ద్రోహాలు జరిగాయని, వాటికి ప్రతీకారం తీర్చుకుంటానని అంటూ ఏదేదో సెలవిచ్చారా యన. ఇక్కడే మొత్తం ఫ్యామిలీ డ్రామా అంతా బహిర్గతమైపోయింది. అన్న ఒక రకంగా కోల్పోయిన దానిని తమ్ముడు మరో రకంగా చేజిక్కించుకోడానికే జనసేన పార్టీ పెట్టారని తేటతెల్లమైపోయింది. అసలు చిరంజీవికి జరిగిన ద్రోహమేంటో, ఆ ద్రోహం ఎవరు చేశారో అర్ధం కాదు మనకి. 2009లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 68,63,509 (16.32 శాతం) ఓట్లు పడ్డాయి. ఇదేం చిన్న విషయం కాదు. కాంగ్రెస్లో విలీనం చేయడం ఆ పార్టీకి వోటు వేసిన లక్షలాదిమంది ప్రజల ఉద్దేశ్య మైతే కాదు. ఆ వోట్లన్నీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వేసినవే. అన్ని లక్షలమందికీ ద్రోహం చేస్తూ ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమే కాక ‘కాంగ్రెస్లో విలీనం చేస్తున్నందుకు గర్విస్తున్నా’ అని కూడా అన్నారు. బహుశా ఓ విజయవంతమైన సినిమాలో నటించిన అనుభూతికి లోనై వుంటారాయన ఆ వ్యాఖ్య చేస్తున్నప్పుడు. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడని ఎంతోమంది అనుకుంటుంటారు. కానీ తన అన్నగారు ప్రజలకు చేసిన ద్రోహం గురించి ప్రశ్నించడానికి ఉపయోగపడనప్పుడు అది నిజాయితీ ఎలా కాగలదు? సినిమాలతో పాటుగా రాజకీయాల్ని కూడా కుటుంబ వ్యాపారంగా మలుచుకున్న ఒడుపే అన్నదమ్ములు ముగ్గురిలో కనబడుతుంది. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందితే మరి కాంగ్రెస్లో చేసిన విలీనం మాటేమిటి? చిరంజీవి వయసు ఎంత డెబ్భైకి చేరువ అవుతున్నా ఆయనకి మరీ మతిమరుపు వచ్చేంత వార్ధక్యం వచ్చిందనుకోనక్కర్లేదు. విలీనం చేసినందుకు గాను కేంద్రమంత్రిగా భోగభాగ్యాలు అనుభవించి, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో వున్నప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి, ఇప్పుడు జనసేన అధికార పార్టీ అయిన వెంటనే అప్పుడు తాను స్థాపించిన పార్టీనే ఇప్పటి జనసేన అనడం ఏం నైతికత సామీ? ఇటీవల బ్రహ్మానందం నటించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా లాంచింగ్ ప్రోగ్రాంకి వెళ్లిన చిరంజీవి ‘మా ఇంట్లో నా గ్రాండ్ చిల్డ్రన్ అంతా ఆడపిల్లలే. గర్ల్స్ హాస్టల్‌కి వార్డెన్లా వుంది నా పరిస్థితి. ఈసారి మగపిల్లా డిని కనమని చరణ్‌కి చెబుతుంటా. మగపిల్లాడే వంశాంకురం’ అన్నారు. అందరూ ఆడపిల్లలే కాబట్టి ఒక మగపిల్లాడుంటే కూడా బాగుంటుంది అని అనుకోడంలో, అనడంలో తప్పు లేదేమో కానీ వంశాన్ని నిల బెట్టేది మగపిల్లాడే అని అనడం ఏం పురోగామి దృష్టి? అంత ప్రజాదరణ వున్న వ్యక్తి జెండర్ ఇన్సెన్సిటీవ్ పితృస్వామిక దృష్టిని ఇంతగా మోయడం సబబా? ఆయన అంటే పడి చచ్చే అభిమానులకు ఆయన ఇచ్చే సందేశం ఏమిటి? ఇంటి పేరు కొనసాగకపోతే వంశం అంతరించినట్లేనా? ఏమిటీ లైంగిక వివక్షతో కూడిన వెనుకబాటుతనం? ఇంటి పేరు మారిపోతే రక్తాలు విరిగిపోయి, జీన్స్ మారిపోయి ఆడపిల్లకి తాను పుట్టిన కుటుంబంతో బంధం తెగిపోతుందా?
Comments