చెరువును చెరబట్టి.. ప్లాట్లుగా విడగొట్టి..!
- BAGADI NARAYANARAO
- Mar 15
- 3 min read
కబ్జా కోరల్లో పలాస మాలబంద చెరువు
23 ఏళ్ల క్రితం ఆగిన దందా మళ్లీ తెరపైకి
అధికారుల సహకారంతో రికార్డుల తారుమారు
టీడీపీ నేతల పరిచయాలతో కథ నడిపించిన కబ్జాదారుడు
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు. చంటిగాడు మాత్రం లోకల్.. అన్నట్లు పలాసలో భూబకాసురులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా జంట పట్టణాల్లో భూకబ్జాలు మాత్రం అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీతో అంటకాగుతూ భూదందాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు భూఆక్రమణలకు తెగబడుతున్నారని పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో చర్చ జరుగుతోంది. వారితో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు కూడా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకులుగా చెలామణీ అవుతున్నవారు ఏకంగా చెరువునే జిరాయితీగా భూమిగా మార్చేసి రియల్ దందా ప్రారంభించారు.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మొన్నటికి మొన్న పట్టణ నడిబొడ్డున సర్వే నెంబర్ 219/3లో ఉన్న సుమారు రూ.3 కోట్ల విలువైన 565 చదరపు అడుగుల స్థలాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతల సహకారంతో ఇద్దరు వ్యక్తులు, కొందరు బంగారం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం పలాసలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే తరుణంలో ఎప్పుడో 2002లో మరుగున పడిపోయిన చెరువు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పలాస తహసీల్దారు కార్యాలయ మార్గంలో కోర్టుకు ఎదురుగా సర్వే నెంబర్ 191/3 (ఎల్‌పీ నెంబర్ 317)లో 80 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న మాలబంద (డబ్బాల చెరువు) జిరాయితీ భూమిగా మారిపోయింది. ఈ చెరువు కబ్జాకు 23 ఏళ్ల క్రితమే కొందరు ప్రయత్నించారు. దానిపై 14 అక్టోబర్ 2002లో ఒక ప్రధాన పత్రికలో ‘నిన్నటి చెరువులు నేడ ప్లాట్లు’ అంటూ ఒక కథనం ప్రచురితమైంది. మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధుల సహకారంతో చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా ఆమ్మేస్తున్నారని కథనంలో పేర్కొన్నారు. దీంతో కొన్నాళ్ల పాటు అక్రమదందా నిలిచిపోయింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలబంద చెరువు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత అప్పటి సీఎంకు, రెవెన్యూ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు కూడా రాశారు. మరోవైపు ప్రజాసంఘాల ప్రతినిధులు సొంపేట కోర్టులో ఓఎస్ 43/2002 నెంబరుతో దావా వేశారు. దీనిపై తహసీల్దారు వివరణ సంతృప్తిగా లేకపోవడం, రికార్డులు ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలతో ఆయనపై స్థానికులు 2006 ఫిబ్రవరి 22న ఫిర్యాదు చేశారు. అలాగే కలెక్టర్‌ను కలిసి చెరువు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీనిపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్ నాగేశ్వరరావు స్టాప్ ఆల్ ప్రొసీడిరగ్స్ అంటూ పలాస తహసీల్దారుకు లేఖ పంపించారు. దీంతో ఆక్రమణదారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పలాసకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో చెరువు ఆక్రమణ యత్నాలు నిలిచిపోయాయి. 2002లో చెరువును రూ.33 లక్షలకు కొనుగోలు చేసిన నాయుడు దాన్ని వదిలించుకోవడానికి ఆతర్వాత అనేక ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు.
రెవెన్యూ రికార్డులు మార్చేశారు..
కోర్టు ఉత్తర్వులతో 23 ఏళ్ల క్రితం మరుగున పడిన చెరువు కబ్జా యత్నాలు మళ్లీ మొదలయ్యాయి. చెరువును జిరాయితీ భూమిగా మార్చి దాన్ని స్థానిక అధికారుల సహకారంతో ల్యాండ్ కన్వర్షన్ చేయించి రియల్ ఎస్టేట్ దందాకు మార్గం సుగమం చేశారు. నాయుడుకు జిల్లాలోని టీడీపీ అగ్రనాయకులతో మంచి దోస్తీ ఉంది. ఉమ్మడి రాష్టంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరికీ హైదరాబాద్‌లో సకల వసతి సౌకర్యాలు, వాహనాలు సమకూరుస్తూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆ పరిచయాలతోనే 2014కు ముందే సీసీఎల్‌ఏలో పలాసకు చెందిన దేవదాయ, ప్రభుత్వ భూములకు చెందిన రికార్డులను ట్యాంపరింగ్ చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే మాలబంద చెరువును జిరాయితీ భూమిగా మార్చేశారని పలాసలో చర్చ జరుగుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీ సర్వేలో ఎల్‌పీ నెంబర్ కేటాయించి చెరువును జిరాయితీగా చూపించి పక్కా చేసేశారు. మాలబందను రూ.33 లక్షలకు అయన కుటుంబ సభ్యుల నుంచే నాయుడు కొనుగోలు చేశారని పలాసలో ప్రచారం జరుగుతోంది. దీంతో 23 ఏళ్లుగా దాని జోలికి వెళ్లకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పూర్తి స్వాధీన హక్కులు కలిగి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు సృష్టించుకున్న నాయుడి నుంచి పలాసకు చెందిన టీడీపీ నాయకుడు శంకర్ దాన్ని కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.
రెవెన్యూ అధికారుల అండతో..
రికార్డుల్లో మాలబంద చెరువుగా చూపిస్తున్నా స్థానికులు మాత్రం డబ్బాల చెరువుగా పిలుస్తుంటారు. జీడిపిక్కల పార్సిల్‌కు వినియోగించే వందలాది డబ్బాలను ఈ చెరువులోనే శుభ్రం చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు ఈ చెరువును ఉదయపురం, శాసనాం, మొగిలిపాడు, పురుషోత్తపురం గ్రామాల వారు తాగునీటికి, పశువుల అసవరాలకు వినియోగించేవారని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమేణా దీన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని, ఆతర్వాత కాలంలో సీసీఎల్‌ఏ స్థాయిలో రికార్డులు మార్పించి వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదుచేసి చెరువును జిరాయితీగా మార్చేశారు. 2002 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉండేవాడు. అక్కడి నుంచే వ్యవహారమంతా నడిపేవాడు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాలబందను లైన్‌లో పెట్టాలని ప్రయత్నించాడు. మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతిలోకి వచ్చిన తర్వాత కౌన్సిలర్లను మచ్చక చేసికొని చెరువును కొట్టేయాలని ప్రయత్నించాడు. దీన్ని కొందరు కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో స్థానిక ఎమ్మెల్యేతో రాయబారం నడిపించారు. అయినా వారు అంగీకరించలేదు. దీంతో సీసీఎల్‌ఏ నుంచి పని కానిచ్చి రికార్డులు మార్పించేసిన నాయుడు తన పేరుతో వన్`బీ అడంగల్‌ను తయారుచేయించి రెవెన్యూ అధికారులతోనే స్వాధీనహక్కులు పొందాడు. 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాలబందను కంకరతో కప్పి ప్లాట్లుగా విభజించే ప్రక్రియ పునఃప్రారంభించారు. పలాస ఆర్డీవో కార్యాలయం నుంచి తహసీల్దారుకు ల్యాండ్ కన్వర్షన్ ఫైల్ పంపించి సంతకాలు పెట్టించి నాలా కట్టించేశారు. నాలా కట్టిన అక్రమార్కులు దర్జాగా చెరువును ప్లాట్లుగా విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. పలాస ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగి సంతు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడిచిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments