10 ప్రభుత్వ ట్యాంకులకు హక్కులిచ్చేసిన పెద్దలు
గ్రామానికి ఇంత.. వారికెంత?
టీడీపీ`వైకాపా ఒక్కటైన వేళ
ఎచ్చెర్లలో వెలుగులోకొచ్చిన దందా
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రావయ్యా ముద్దుల మామా.. నీకు రాసిస్తా రాయలసీమ అని ఓ సినీకవి అంటే.. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా అని మరో సినీకవి అన్నాడు. రాయలసీమ, మైసూల్ ప్యాలెస్‌లు ఎలా అయితే ఈ కవులవి కావో, తమవి కాని చెరువులను కూడా కొందరు పెద్దమనుషుల ముసుగులో రాసిచ్చేశారు. కొన్నాళ్లు గుట్టుగా దీన్ని ఉంచినా, కలెక్టర్ గ్రీవెన్స్‌లో రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఎచ్చెర్ల గ్రామం పరిధిలో ఉన్న 10 చెరువులను ఒక ప్రైవేట్ వ్యక్తికి రాసిచ్చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందువరకు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్న వైకాపా, టీడీపీ నాయకులు ఎన్నికల తర్వాత ఒకే తాటిపైకి వచ్చారు. ఆ చెలిమిలో భాగంగానే ఏడాదికి రూ.లక్ష చొప్పున పదేళ్లకు రూ.10లక్షలకు అజ్జరాం పంచాయతీ ఎస్‌ఎస్‌ఆర్ పురానికి చెందిన దుంప తోటయ్యకు లీజుకు ఇచ్చేశారు. లీజు డీడ్‌లో మాత్రం ఐదేళ్లకు రూ.5లక్షలు, పదేళ్లపాటు లీజు కొనసాగిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. రూ.20 జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై గ్రామానికి చెందిన 13 మంది తాజా, మాజీ స్థానిక సంస్థల ప్రతినిధులు సంతకాలు చేసి లీజ్‌డీడ్‌ను ఆగస్టు ఒకటిన రాయించారు. ఈ వ్యవహారం కొన్ని రోజుల వరకు వెలుగులోకి రాకుండా పెద్దలంతా జాగ్రత్తపడ్డారు. చెరువు గట్టులను లీజును దక్కించుకున్న దుంప తోటయ్య గట్టులను చదును చేసి నీలగిరి మొక్కలు వేయడంతో గ్రామంలో చర్చకు దారితీసింది. 2వేలకు పైగా జనాభా ఉన్న ఎచ్చెర్ల మండల కేంద్రంలో గ్రామంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్నవారి నిర్వాకంపై ఈ నెల 14న కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో గ్రామానికి చెందిన కేతింటి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. గ్రామంలో పెద్దలు, స్థానికులు కలిసి చర్చించి గ్రామదేవత పండగలకు వినియోగించేందుకు ఈ లీజు మొత్తాన్ని వినియోగించనున్నట్టు లీజు డీడ్‌లో రాయించారు. లీజు డీడ్‌లో ఎచ్చెర్ల గ్రామం పరిధిలో ఉన్న చెరువుల పేర్లను ప్రస్తావించి, వాటిపై నీలగిరి మొక్కలు నాటుకునే వెసులుబాటు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ లీజు తంతు గ్రామ కార్యదర్శి, వీఆర్వోల సమక్షంలోనే సాగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెవిన్యూ గ్రామ పరిధి సర్వే నెంబర్ 14లో సవిటి చెరువు, సర్వే నెంబర్ 35లో కొండవాని చెరువు, సర్వే నెంబర్ 54లో దాలోడు చెరువు, సర్వే నెంబర్ 35లో ధర్మాన చెరువు, సర్వే నెంబర్ 72లో అల్లువాని చెరువు, సర్వే నెంబర్ 102 రాళ్ల చెరువు, సర్వే నెంబర్ 123లో పల్లవాని చెరువు, సర్వే నెంబర్ 159లో ఎంకాలమ్మ చెరువు, సర్వే నెంబర్ 168లో వానోడు చెరువు, సర్వే నెంబర్ 177లో కొత్త చెరువు గట్టులను గ్రామ పెద్దల ముసుగులో కొందరు స్థానికులు లీజుకు ఇచ్చేశారు. లీజుకు తీసుకున్న తోటయ్య మొదటి విడతగా రూ.5లక్షలు చెల్లించి చెరువు గట్లను తన స్వాధీనంలోకి తీసుకొని చదునుచేసి నీలగిరి మొక్కలను నాటేశారు. నీలగిరి మొక్కలు పెంపకాలను వాణిజ్య సాగుగా గుర్తించడం వల్ల చెరువుగట్లపై పెంపకాలకు అనుమతి ఉండదు. దీనిపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన చెరువు ఆయకట్టు రైతులు చెరువు గట్లు ఎత్తు బాగా తగ్గిపోవడం, పూడిక పేరుకుపోవడం వల్ల చెరువుల్లో అంతంత మాత్రంగానే నీరు నిల్వ ఉందని కలెక్టర్‌కు వివరించారు. నీలగిరి మొక్కల పెంపకానికి ఎక్కువగా నీరు వినియోగించే అవకాశం ఉండడం వల్ల ఆయకట్టుకు సాగునీరందే అవకాశం కోల్పోతామని విన్నవించారు. వ్యవసాయ పనుల కోసం రాకపోకలు సాగించే వారిని చెరువుగట్టుపైకి అనుమతించడం లేదని, పశువులు, జీవాలను అడ్డుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే నివేదిక ఇవ్వాలని ఎచ్చెర్ల తహసీల్దార్‌కు ఆదేశించారు.
గ్రామ పెద్దల లీజు వ్యవహారంపై కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎచ్చెర్ల తహసీల్దారుపై టీడీపీ, వైకాపా నాయకులు ఒత్తిడి పెంచి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయాలని గ్రామ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి కలెక్టర్‌తో మాట్లాడిరచి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెరువు గట్లు లీజుకు తీసుకున్న తోటయ్య గట్టు చదును చేయడానికి, మొక్కలు నాటడానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాడని కొత్తవాదన గ్రామపెద్దల తెరపైకి తెచ్చారు. దీన్ని గ్రామంలో స్థానిక యువత ఆక్షేపిస్తున్నారు. చెరువుగట్లు లీజుకు ఇచ్చిన సమయంలో పెద్దలుగా చలామణి అవుతున్న 13 మందికి తప్ప మరొకరికి తెలియకుండా తతంగమంతా నడిపి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసిన తర్వాత ఇప్పుడు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గ్రామదేవత పండగల పేరు చెప్పి చెరువుగట్లు లీజకు ఇవ్వడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. గ్రామంలో అనేక చోట్ల వివిధ పేర్లతో గ్రామ దేవతలు ఉన్నారని, అలాంటప్పుడు గ్రామదేవత పేరు చెప్పి ఎలా లీజుకు ఇస్తారని కొందరు ఎదురుతిరుగుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Comments